కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని..
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని.. వేధిస్తున్న కుల పెద్దలు
పట్టించుకోని పోలీసులు.. ఎస్పీకి ఫిర్యాదు
కరీంనగర్: కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కుల పెద్దలు ఆ కుటుంబానికి కుల బహిష్కరణ శిక్ష విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అడుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ కుటుంబం బుధవారం ఎస్పీ శివకుమార్‌ను కలిసి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అనంతరం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యురాలు ఏనుగుల లచ్చవ్వ చెప్పిన కథనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఏనుగుల లచ్చవ్వ కూతురు మమత రామన్నపేటకు చెందిన కొల్లూరు సురేందర్‌రెడ్డిని ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో దంపతులిద్దరు కలిసి మెలిసి కాపురం చేసుకుంటున్నారు. మమత కులానికి చెందిన పెద్దలు మాత్రం వీరి పెళ్లిని అంగీకరించలేదు. మమతను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానించారు. ఇటీవల మమతకు కొడుకు పుట్టడంతో లచ్చవ్వ ఇంటికొచ్చారు. కులం నుంచి బహిష్కరించాక మమతను ఎట్లా రానిచ్చావంటూ కుల పెద్దలు రూ.10 వేల ధరావత్ తీసుకుని పంచాయితీ నిర్వహించి రూ.4,250 జరిమానా విధించారు. మమతను మళ్లీ ఇంటికి రానిస్తే... లచ్చవ్వ కుటుంబాన్ని కూడా కులం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
అంతేకాకుండా.. కుల పెద్దల్లో ఒకరు లచ్చవ్వకు చెందిన ఎనిమిది గుంటల భూమిలో తనకు వాటా ఇవ్వాలని నిత్యం గొడవ పడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం లచ్చవ్వ కొడుకు మోహన్‌కు ప్రమాదం జరిగితే పరామర్శించేందుకు వెళ్లిన లచ్చవ్వ తల్లి గుండవ్వకు కూడా కుల పెద్దలు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా కుల పెద్దల వేధింపులు ఆగలేదని, దీంతో ఎస్పీని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నట్లు లచ్చవ్వ తెలిపింది. ఈ విషయమై వేములవాడ రూరల్ సీఐ మాధవిని సంపద్రించగా, లచ్చవ్వ ఫిర్యాదుపై ఎస్‌ఐ విచారణ జరుపుతున్నారని చెప్పారు. కుల పెద్దలు జరిమానా విధించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కుల పెద్దలను పిలిచి కూడా మాట్లాడామని, ఫిర్యాదు చేసిన లచ్చవ్వ ఆ తరువాత మళ్లీ తన దగ్గరకు రాలేదన్నారు.