relegation
-
నిమ్మాడలో నియంత ఆగడాలు
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): ఇవే మా భూములు.. బహిష్కరణ వలన పంటలు పండించుకోలేక బీడుగా మారాయి.. మా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు సుమారు 18 ఎకరాల భూములున్నాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం మంత్రి కుటుంబానికి ఎదురు తిరిగామన్న కక్షతో 26 కుటుంబాలను బహిష్కరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడితోపాటు ఆయన సోదరుడు ప్రసాద్ మాపై కక్ష కట్టారు. 6 సంవత్సరాలుగా పంటలు పండించుకోనివ్వడం లేదు. నా భూములను తక్కువ ధరలకు లాక్కోవాలని చూస్తున్నారు. ఆ బాధలకు తాళలేక గ్రామానికి కొంత దూరంలో నివసిస్తున్నాను. ఇది నిమ్మాడకు చెందిన మెండ రామ్మూర్తి అనే బాధితుడి ఆవేదన. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడి నిరంకుశత్వానికి ఇలాంటి ఉదాహరణలెన్నో.. వారి కుటుంబానికి ఎదురు తిరిగినందుకు బయట ప్రపంచానికి తెలియకుండా సంవత్సరాల తరబడి సామాజిక బహిష్కరణ చేశారు. వారి ఇళ్లల్లో చావు పుట్టుకలకు ఎవరూ వెళ్లకూడదు. రజకులు, నాయిబ్రాహ్మణుల వంటి కులవృత్తులవారు వారి పనులు చేయకూడదు. చివరకు వారి పంట పొలాల్లో పనులకు సైతం కూలీలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సంవత్సరాల తరబడి పంట భూములు బీడుగా మారిపోయాయి. బాధితులు మూడు పూటలా తిండి కోసం విలవిలలాడుతున్నారు. చివరకు రేషన్ బియ్యం కూడా ఇవ్వకుండా చేస్తున్నారంటే ఇక్కడ ఎటువంటి పాలన కొనసాగుతుందో అర్థమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాల తరబడి సుమారు 26 కుటుంబాలపై ఇదే కక్షసాధింపు చర్యలు జరుగుతున్నప్పటికీ చట్టాలు వారిని ఆదుకోలేకపోతున్నాయి. ఎప్పుడో పాత కాలంలో విన్న ఇటువంటి ఆటవిక చర్యలు సాక్షాత్తు మంత్రి సొంత గ్రామంలోనే జరుగుతున్నప్పటికీ ప్రశ్నించే అధికారులు కానరావడం లేదు. నేనున్నాను.. మంత్రి రాక్షస పాలన నుంచి తమను రక్షించే దేవుడెప్పుడు వస్తాడని బాధితులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో బాధితులు కొంతమంది తమ గోడును వివరించారు. నిమ్మాడలో జరుగుతున్న ఆటవిక పాలన గురించి తెలుసుకున్ని వైఎస్ జగన్ నివ్వెరపోయారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూశారు మమ్మల్ని గ్రామంలోనే వెలివేశారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూశారు. పంటలు పండిస్తామనుకుంటే అడ్డు తగులుతున్నారు. మంత్రి, ఆయన సోదరుడికి భయపడి ఎవరూ మాకు అండగా నిలవడం లేదు. –కాళ ఆదినారాయణ, బాధితుడు, నిమ్మాడ నిమ్మాడలో అరాచక పాలన మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు కలిసి నిమ్మాడలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఆటవిక పాలన పురాణాల్లో చదువుకున్నాం. బాధిత ప్రజలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకుడు గుణపాఠం చెప్పాలి నిమ్మాడలో నియంత పాలన కొనసాగుతోంది. మంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన సోదరునితో రౌడీ పాలన కొనసాగిస్తున్నారు. మంత్రికి తగిన గుణపాఠం చెప్పి బాధితులకు ఆదుకోవాలి. –పేరాడ తిలక్, వైఎఎస్సార్ సీపీ నాయకుడు -
61 రోజుల జాప్యాన్ని మన్నించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ వ్యవహారంలో మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకుంది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానాన్ని, వీరిద్దరి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన తీర్పు అమలును 2 నెలల పాటు ధర్మాసనం నిలిపేసింది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ కార్యదర్శి వి.నిరంజన్‌రావుకు కోర్టు ధిక్కారం కింద ఫామ్–1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలును సైతం నిలుపుదల చేసింది. కోర్టు ధిక్కార వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లలో జరిగిన 61 రోజుల ఆలస్యాన్ని కూడా మన్నించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ను బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు ఈ ఏడాది ఏప్రిల్ 17న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌కు విచారణార్హత లేదంటూ ధర్మాసనం దానిని కొట్టేసింది. అయితే కోర్టు తీర్పు మేరకు తమ పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో చేర్చలేదని, దీనికి గాను కోర్టు ధిక్కారం అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులను శిక్షించాలంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనేందుకు ప్రాథ మిక ఆధారాలున్నాయంటూ వారిద్దరికీ ఫామ్–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల భద్రతను పునరుద్ధరించనందుకు డీజీపీతో పాటు నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలకు ధిక్కార నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్పీకర్ మధుసూదనాచారికి సైతం షోకాజ్ నోటీసులిచ్చారు. జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఇరువురు కార్యదర్శులు కూడా ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలు చేశారు. ఇయర్ ఫోన్లు విసరలేదని ఎమ్మెల్యేలు చెప్పడం లేదు.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించే సమయంలో జరిగిన వివాదం తాలూకు వీడియో ఫుటేజీ కోర్టు ముందు సమర్పించకపోవడాన్నే సింగిల్ జడ్జి ప్రధాన అంశంగా పరిగణించారని, ఇది సరికాదన్నారు. ఇరువురు ఎమ్మెల్యేలు కూడా ఇయర్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారని, దీంతో వారిద్దరినీ బహిష్కరిస్తూ శాసనసభ తీర్మానం చేసిందని, ఆ తరువాత వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఘటన జరిగిన మార్చి 12న గానీ, బహిష్కరణ జరిగిన 13న గానీ ఇరువురు ఎమ్మెల్యేలు మౌనంగా ఉండి ఆ తరువాత వినతిపత్రం సమర్పించారన్నారు. మండలి చైర్మన్‌పై ఇయర్ ఫోన్లు విసరలేదని ఇరువురు ఎమ్మెల్యేలు చెప్పడం లేదని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందన్న సింగిల్ జడ్జి తీర్పు సరికాదన్నారు. బహిష్కరణ విషయంలో న్యాయ సమీక్షకు అవకాశం లేదన్న ఉద్దేశంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. అందుకే 61 రోజుల జాప్యం జరిగిందని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం సంగతి తరువాత తేలుస్తామని, ఈ అప్పీళ్లపై విచారణ జరిపే పరిధి ఉందో లేదో చెప్పాలని స్పష్టం చేసింది. తమ అప్పీళ్లకు విచారణార్హత ఉందని రోహత్గీ తెలిపారు. సభ తీర్మానంపై న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. న్యాయ సమీక్షకు ఆస్కారం లేదు.. న్యాయశాఖ కార్యదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది హరేన్ రావెల్ వాదనలు వినిపిస్తూ, సభ నిర్వహణ పూర్తిగా స్పీకర్ పరిధిలోని వ్యవహారమన్నారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయం స్పీకర్‌ది కాదని, మొత్తం సభే తీర్మానం చేసిందని ఆయన వివరించారు. సభ తీర్మానం విషయంలో న్యాయ సమీక్షకు ఆస్కారం లేదన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి... కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బహిష్కరణ తరువాత పిటిషనర్లకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అప్పీళ్ల దాఖలులో జరిగిన జాప్యంపై వాదనలు వినిపించకుండా సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పునిచ్చినప్పుడు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరించిన కార్యదర్శులు, కోర్టు ధిక్కార నోటీసుల జారీతో ఈ అప్పీళ్లు జారీ చేశారన్నారు. అంతేకాక సింగిల్ జడ్జి ముందు ఇరు కార్యదర్శులు కూడా కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ పని చేయకుండా ఈ అప్పీళ్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. లోతుగా విచారణ అవసరం ధర్మాసనం జోక్యం చేసుకుని, 12 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణార్హ త లేదంటూ కొట్టేసిందే తప్ప, కేసు పూర్వాపరాల ఆధారంగా కాదని తెలిపింది. ఇప్పుడు ఇరువురు కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లకు విచారణార్హత లేదనడం సరికాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అప్పీళ్ల దాఖలులో జరిగిన 61 రోజుల ఆలస్యానికి కారణం ఉందని అభిప్రాయపడింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల బహిష్కరణ తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ జడ్జి ముందు కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుతో సహా తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది. -
బీజేపీ ఆందోళన ఉద్రిక్తం
కరీంనగర్‌సిటీ: ధర్మాగ్రహ యాత్ర పేరుతో హైద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు నిర్వహించాలనుకున్న పరిపూర్ణానంద స్వామిని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు గృహ నిర్భంధంతోపాటు నగర బహిష్కరణ విధించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని పోలీస్హెడ్క్వార్టర్స్ ఎదుట ప్రధాన రహదారిపై బుధవారం భారీ రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి బండి సంజయ్‌తో సహా కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పరిపూర్ణనందను నగర బహిష్కరణతో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానం బహిర్గతమైందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆరాద్యదైవమైన శ్రీరాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేశ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ చేయకుండా కేవలం నగర బహిష్కరణ వేటుతో చేతులు దులుపుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతస్తుల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టానికి లోబడి నిరసన వ్యక్తం చేస్తున్న పరిపూర్ణానందపై కూడా నగర బహిష్కరణ వేటు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, జోనల్ ఇన్చార్జి తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కొత్తపెల్లి రతన్‌కుమార్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీజేపీ, బీజేవైఎం నాయకులు గాజె రమేశ్, ఎన్నం ప్రకాశ్, మామిడి రమేశ్, కందుకూరి ఆంజనేయులు, శశి, పొన్నం మొండయ్య, కాశెట్టి శేఖర్, బండ అనిత, జెల్లోజు చిట్టిబాబు, ఉప్పరపెల్లి శ్రీనివాస్, పర్వతం మల్లేశం, ముప్పిడి సునీల్, కందుకూరి వెంకట్, అక్షయ్, తిరుపతి, సాయి, మహేశ్, హరీశ్, ఓదెలు, రామురాయ్, అభిలాష్, ప్రణయ్, నిఖిల్, సుమన్, సుధాకర్, రంజిత్ తదితరు పాల్గొన్నారు. -
ఎన్క్యూపీ సెమినార్ బహిష్కరణ
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్క్యూపీ (న్యూ క్వాలి టీ పాలసీ) సెమినార్‌ను ప్రభుత్వ సాంఘిక సంక్షే మ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బహిష్కరించారు. సెమినార్‌కు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 22 మంది ఉపాధ్యాయులను ఎంపిక చే శారు. కేవలం ఇద్దరే హాజరుకాగా.. మిగిలినవారు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల జేఏసీ నాయకులు కె. వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేసే విధంగా సీసీ కెమెరాల నిఘాలో ఎన్క్యూపీ సెమినార్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. దీనిని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
12 గౌడ కుటుంబాల గ్రామ బహిష్కరణ
నిజామాబాద్ క్రైం : జిల్లాలోని బిచ్కుంద మండలం వాజీద్‌నగర్‌కు చెందిన 12 గౌడ కుటుంబాలకు మున్నూర్‌కాపు సంఘం గ్రామ బహిష్కరణ విధించింది. బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలు మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ను కలిసి తమను గ్రామ బహిష్కరణ చేసిన మున్నూర్‌కాపు సంఘానికి చెందిన 21 మందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలో జరిగిన జాతరకు చందా డబ్బులు ఇవ్వని కారణంగా తమపై కక్ష గట్టిన మున్నూర్‌కాపు సభ్యులు గ్రామ బహిష్కరణ చేసి సహాయ నిరాకరణ చేశారని తెలిపారు. ఈ నెల 22న గౌడ కులానికి చెందిన మహిళ చనిపోతే ఆమె అంత్యక్రియలు నిర్వహించే వారిని సైతం రాకుండా అడ్డుకున్నారని, దాంతో తామే అంత్యక్రియల పనులు చేసుకున్నట్లు ఎస్పీతో వాపోయారు. గ్రామ బహిష్కరణ చేసిన 21 మందిపై బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఐదుగురిపైనే కేసు నమెదు చేశారని ఎస్పీకి తెలిపారు. మున్నూర్‌కాపు సంఘం వారిపై పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రూ. ఒక లక్ష చెల్లించాలని లేకుంటే తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. మున్నూర్‌కాపు సంఘం సభ్యుల బారి నుంచి తమను కాపాడి న్యాయం చేయాలని ఎస్పీను కోరారు. -
ఎయిడ్స్ దంపతుల బహిష్కరణ
కలెక్టర్‌కు ఫిర్యాదు టీనగర్: ఇంటి స్థలం ఇవ్వాలని ఆజ్ఞాపించినా తమకు గ్రామ నిర్వాహక అధికారి ఆ దిశ గా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ చెంగల్పట్టు సమీపంలోని ఎయిడ్స్ బాధిత దంపతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెంగల్పట్టు సమీపంలోని తిరుమణి పంచాయితీలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్న రాధాకన్నన్( 45), కాంత( 40) లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా తనకు ఎయిడ్స్ సోకిందనే విషయాన్ని పక్కన బెట్టి 20 ఏళ్ల క్రితం కాంతను ఒక యువకుడు వివాహం చేసుకున్నాడు. దీంతో కాంతకు ఎయిడ్స్ సంక్రమించింది. వివాహమైన కొద్ది రోజుల్లోనే ఆ యువకుడు మృతిచెందడంతో బాధితురాలు ఒక స్వచ్చంధ సంస్థలో పనిచేస్తూ వచ్చింది. ఈమెకు అదే సంస్థలో పనిచేస్తున్న రాధాకన్నన్తో మరలా వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె ఐదవ తరగతి, చిన్న కుమార్తె మూడవ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో రాధాకన్నన్ తన కుటుంబంతో ఏడేళ్ల క్రితం చెంగల్పట్టు తిరుమణి పంచాయితీలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఒక పొరంబోకు స్థలంలో గుడిసె వేసుకుని జీవిస్తూ వచ్చారు. వీరిని పంచాయితీ అధ్యక్షుడు, గ్రామ ప్రజలు ఊరి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. వీరి ఇంటికి మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై రాధాకన్నన్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తర్వాత రాధాకన్నన్ తనకు, భార్యకు ఎయిడ్స్ ఉన్నందున నివసిస్తున్న స్థలానికి పట్టా ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో న్యాయవాది పట్టా అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అయితే గ్రామ నిర్వాహక అధికారి ఆ స్థలం వైద్య కళాశాలకు సొంతమని తెలిపి నిరాకరించారు. దీంతో ఆయన కాంచీపురం జిల్లా కలెక్టర్ గజలక్ష్మిని కలిసి పిటిషన్ అందజేశారు. దీని గురించి కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. -
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని..
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని.. వేధిస్తున్న కుల పెద్దలు పట్టించుకోని పోలీసులు.. ఎస్పీకి ఫిర్యాదు కరీంనగర్: కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కుల పెద్దలు ఆ కుటుంబానికి కుల బహిష్కరణ శిక్ష విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అడుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ కుటుంబం బుధవారం ఎస్పీ శివకుమార్‌ను కలిసి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అనంతరం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యురాలు ఏనుగుల లచ్చవ్వ చెప్పిన కథనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఏనుగుల లచ్చవ్వ కూతురు మమత రామన్నపేటకు చెందిన కొల్లూరు సురేందర్‌రెడ్డిని ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో దంపతులిద్దరు కలిసి మెలిసి కాపురం చేసుకుంటున్నారు. మమత కులానికి చెందిన పెద్దలు మాత్రం వీరి పెళ్లిని అంగీకరించలేదు. మమతను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానించారు. ఇటీవల మమతకు కొడుకు పుట్టడంతో లచ్చవ్వ ఇంటికొచ్చారు. కులం నుంచి బహిష్కరించాక మమతను ఎట్లా రానిచ్చావంటూ కుల పెద్దలు రూ.10 వేల ధరావత్ తీసుకుని పంచాయితీ నిర్వహించి రూ.4,250 జరిమానా విధించారు. మమతను మళ్లీ ఇంటికి రానిస్తే... లచ్చవ్వ కుటుంబాన్ని కూడా కులం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా.. కుల పెద్దల్లో ఒకరు లచ్చవ్వకు చెందిన ఎనిమిది గుంటల భూమిలో తనకు వాటా ఇవ్వాలని నిత్యం గొడవ పడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం లచ్చవ్వ కొడుకు మోహన్‌కు ప్రమాదం జరిగితే పరామర్శించేందుకు వెళ్లిన లచ్చవ్వ తల్లి గుండవ్వకు కూడా కుల పెద్దలు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ విషయమై నాలుగు రోజుల క్రితం వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా కుల పెద్దల వేధింపులు ఆగలేదని, దీంతో ఎస్పీని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నట్లు లచ్చవ్వ తెలిపింది. ఈ విషయమై వేములవాడ రూరల్ సీఐ మాధవిని సంపద్రించగా, లచ్చవ్వ ఫిర్యాదుపై ఎస్ఐ విచారణ జరుపుతున్నారని చెప్పారు. కుల పెద్దలు జరిమానా విధించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కుల పెద్దలను పిలిచి కూడా మాట్లాడామని, ఫిర్యాదు చేసిన లచ్చవ్వ ఆ తరువాత మళ్లీ తన దగ్గరకు రాలేదన్నారు.