సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ వ్యవహారంలో మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకుంది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానాన్ని, వీరిద్దరి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన తీర్పు అమలును 2 నెలల పాటు ధర్మాసనం నిలిపేసింది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ కార్యదర్శి వి.నిరంజన్‌రావుకు కోర్టు ధిక్కారం కింద ఫామ్–1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలును సైతం నిలుపుదల చేసింది.
కోర్టు ధిక్కార వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లలో జరిగిన 61 రోజుల ఆలస్యాన్ని కూడా మన్నించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ను బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు ఈ ఏడాది ఏప్రిల్ 17న తీర్పునిచ్చారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ పన్నెండు మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌కు విచారణార్హత లేదంటూ ధర్మాసనం దానిని కొట్టేసింది. అయితే కోర్టు తీర్పు మేరకు తమ పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో చేర్చలేదని, దీనికి గాను కోర్టు ధిక్కారం అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులను శిక్షించాలంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనేందుకు ప్రాథ మిక ఆధారాలున్నాయంటూ వారిద్దరికీ ఫామ్–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు.
అలాగే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల భద్రతను పునరుద్ధరించనందుకు డీజీపీతో పాటు నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలకు ధిక్కార నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్పీకర్ మధుసూదనాచారికి సైతం షోకాజ్ నోటీసులిచ్చారు. జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఇరువురు కార్యదర్శులు కూడా ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలు చేశారు.
ఇయర్ ఫోన్లు విసరలేదని ఎమ్మెల్యేలు చెప్పడం లేదు..
అసెంబ్లీ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించే సమయంలో జరిగిన వివాదం తాలూకు వీడియో ఫుటేజీ కోర్టు ముందు సమర్పించకపోవడాన్నే సింగిల్ జడ్జి ప్రధాన అంశంగా పరిగణించారని, ఇది సరికాదన్నారు. ఇరువురు ఎమ్మెల్యేలు కూడా ఇయర్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారని, దీంతో వారిద్దరినీ బహిష్కరిస్తూ శాసనసభ తీర్మానం చేసిందని, ఆ తరువాత వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు.
ఘటన జరిగిన మార్చి 12న గానీ, బహిష్కరణ జరిగిన 13న గానీ ఇరువురు ఎమ్మెల్యేలు మౌనంగా ఉండి ఆ తరువాత వినతిపత్రం సమర్పించారన్నారు. మండలి చైర్మన్‌పై ఇయర్ ఫోన్లు విసరలేదని ఇరువురు ఎమ్మెల్యేలు చెప్పడం లేదని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందన్న సింగిల్ జడ్జి తీర్పు సరికాదన్నారు.
బహిష్కరణ విషయంలో న్యాయ సమీక్షకు అవకాశం లేదన్న ఉద్దేశంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. అందుకే 61 రోజుల జాప్యం జరిగిందని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం సంగతి తరువాత తేలుస్తామని, ఈ అప్పీళ్లపై విచారణ జరిపే పరిధి ఉందో లేదో చెప్పాలని స్పష్టం చేసింది. తమ అప్పీళ్లకు విచారణార్హత ఉందని రోహత్గీ తెలిపారు. సభ తీర్మానంపై న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు.
న్యాయ సమీక్షకు ఆస్కారం లేదు..
న్యాయశాఖ కార్యదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది హరేన్ రావెల్ వాదనలు వినిపిస్తూ, సభ నిర్వహణ పూర్తిగా స్పీకర్ పరిధిలోని వ్యవహారమన్నారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయం స్పీకర్‌ది కాదని, మొత్తం సభే తీర్మానం చేసిందని ఆయన వివరించారు. సభ తీర్మానం విషయంలో న్యాయ సమీక్షకు ఆస్కారం లేదన్నారు.
కోర్టు తీర్పు అమలుకు
ప్రయత్నిస్తున్నామని చెప్పి...
కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బహిష్కరణ తరువాత పిటిషనర్లకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అప్పీళ్ల దాఖలులో జరిగిన జాప్యంపై వాదనలు వినిపించకుండా సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పునిచ్చినప్పుడు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరించిన కార్యదర్శులు, కోర్టు ధిక్కార నోటీసుల జారీతో ఈ అప్పీళ్లు జారీ చేశారన్నారు. అంతేకాక సింగిల్ జడ్జి ముందు ఇరు కార్యదర్శులు కూడా కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ పని చేయకుండా ఈ అప్పీళ్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
లోతుగా విచారణ అవసరం
ధర్మాసనం జోక్యం చేసుకుని, 12 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణార్హ త లేదంటూ కొట్టేసిందే తప్ప, కేసు పూర్వాపరాల ఆధారంగా కాదని తెలిపింది. ఇప్పుడు ఇరువురు కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లకు విచారణార్హత లేదనడం సరికాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది.
అప్పీళ్ల దాఖలులో జరిగిన 61 రోజుల ఆలస్యానికి కారణం ఉందని అభిప్రాయపడింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల బహిష్కరణ తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ జడ్జి ముందు కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుతో సహా తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది.
Comments
Please login to add a commentAdd a comment