ఎయిడ్స్ దంపతుల బహిష్కరణ
కలెక్టర్‌కు ఫిర్యాదు
టీనగర్: ఇంటి స్థలం ఇవ్వాలని ఆజ్ఞాపించినా తమకు గ్రామ నిర్వాహక అధికారి ఆ దిశ గా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ చెంగల్పట్టు సమీపంలోని ఎయిడ్స్ బాధిత దంపతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెంగల్పట్టు సమీపంలోని తిరుమణి పంచాయితీలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్న రాధాకన్నన్( 45), కాంత( 40) లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా తనకు ఎయిడ్స్ సోకిందనే విషయాన్ని పక్కన బెట్టి 20 ఏళ్ల క్రితం కాంతను ఒక యువకుడు వివాహం చేసుకున్నాడు. దీంతో కాంతకు ఎయిడ్స్ సంక్రమించింది. వివాహమైన కొద్ది రోజుల్లోనే ఆ యువకుడు మృతిచెందడంతో బాధితురాలు ఒక స్వచ్చంధ సంస్థలో పనిచేస్తూ వచ్చింది.
ఈమెకు అదే సంస్థలో పనిచేస్తున్న రాధాకన్నన్‌తో మరలా వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె ఐదవ తరగతి, చిన్న కుమార్తె మూడవ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో రాధాకన్నన్ తన కుటుంబంతో ఏడేళ్ల క్రితం చెంగల్పట్టు తిరుమణి పంచాయితీలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఒక పొరంబోకు స్థలంలో గుడిసె వేసుకుని జీవిస్తూ వచ్చారు. వీరిని పంచాయితీ అధ్యక్షుడు, గ్రామ ప్రజలు ఊరి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. వీరి ఇంటికి మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
దీనిపై రాధాకన్నన్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తర్వాత రాధాకన్నన్ తనకు, భార్యకు ఎయిడ్స్ ఉన్నందున నివసిస్తున్న స్థలానికి పట్టా ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో న్యాయవాది పట్టా అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అయితే గ్రామ నిర్వాహక అధికారి ఆ స్థలం వైద్య కళాశాలకు సొంతమని తెలిపి నిరాకరించారు. దీంతో ఆయన కాంచీపురం జిల్లా కలెక్టర్ గజలక్ష్మిని కలిసి పిటిషన్ అందజేశారు. దీని గురించి కలెక్టర్ విచారణ జరుపుతున్నారు.