ఎయిడ్స్ మహమ్మారి బాధితుల్ని ఆదరించాలి
ఎయిడ్స్ డే కార్యక్రమాల్లో కలెక్టర్ హితవు
బాధిత చిన్నారులకు అల్పాహార విందు
వారి స్థితిని చూసి చలించిన అధికారులు
కాకినాడ క్రైం :ఎయిడ్స్ మహమ్మారి పీడితుల పట్ల నిర్లక్ష్యాన్ని, నిరాదరణను విడనాడాలని, తెలిసో తెలియకో తప్పు చేసి వ్యాధి బారిన పడిన వారిని ఆదరించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. సమాజానికి శాపంగా మారిన ఎయిడ్స్ వ్యాధిపై ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇంకా వ్యాధిగ్రస్తుల పట్ల నిరాదరణ కనిపించడం శోచనీయమన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ బంగ్లాలో వ్యాధిగ్రస్త చిన్నారులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. హాజరైన వందల మంది చిన్నారులను చూసి కలెక్టర్ చలించిపోయారు. తల్లిదండ్రులు లేక, ఆలనాపాలనా కరువై శుష్కించిన వారిని చూసి కలెక్టర్‌తో పాటు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చలించిపోయారు.
ఏ పాపం తెలియని ఇందరు చిన్నారులు వ్యాధి బారినపడడం విషాదకరమని కలెక్టర్ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లను నియంత్రించాలని సూచించారు. ‘జిల్లాలో 46,836 మంది వ్యాధిగ్రస్తులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాధి సోకిందని తెలిస్తే సమాజం చిన్న చూపు చూస్తుందనే భయంతో అనేక మంది బయటికి చెప్పుకోవడం లేదు. దీంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఏ పాపం ఎరుగని చిన్నారులు సైతం ఎయిడ్స్ బారిన పడి నరక యాతన అనుభవిస్తున్నారు. కొందరు మరణిస్తున్నారు. రంపచోడవరం ఏరియాలో ఎనిమిదేళ్ల బాలుడికి హెచ్‌ఐవీ సోకింది. ఆ బాలుడి తల్లిదండ్రులు మరణించారు. ఏజెన్సీ పర్యటనకు వెళ్లినపుడు ఆ బాలుడిని చూసి, హెచ్‌ఐవీ పేషెంట్ అని తెలిసి చాలా బాధపడ్డాను. ముసలి తాత దగ్గర ఉంటున్న ఆ బాబుకి ఏఆర్టీ చికిత్సనందించి, బాగోగులు చూడాల్సిందిగా అక్కడి వైద్యులకు సూచించాను’ అని చెప్పారు.
జిల్లాలో తగ్గిన వ్యాధి వ్యాప్తి
జిల్లాలో 2004-05లో 26.37 శాతంగా ఉన్న వ్యాధి వ్యాప్తి 2013-14లో 6.11 శాతంగా నమోదైందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో అధికారులు సఫలీకృతులయ్యారన్నారు. శారీరక సంబంధాల కారణంగానే 93 శాతం వ్యాధి సంక్రమిస్తోందన్నారు. వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రక్తమార్పిడితోనూ వ్యాధి సంక్రమిస్తున్నందున వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సోకే ప్రమాదంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పిల్లల్ని రక్షించడానికి మందులున్నాయని, ప్రతి గర్భిణికి విధిగా హెచ్‌ఐవీ టెస్ట్ చేయాలని కోరారు.
జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ ఎం.పవన్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది 73,211 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా 4,479 మందికి వ్యాధిసోకినట్లు నిర్ధారణైందన్నారు. గర్భిణుల్లో 60,342 మందిని పరీక్షించగా 171 మందికి వ్యాధి సోకినట్లు తేలిందన్నారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలలో 46,836 మంది వ్యాధిగ్రస్తులు నమోదు కాగా వ్యాధి తీవ్రతను తగ్గించి జీవితకాలాన్ని పెంచే ఏఆర్టీ మందులను 26,920 మంది వాడుతున్నారన్నారు. 350 మంది పిల్లలను ఐసీపీఎస్ పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఏజేసీ డి.మార్కండేయులు, ఎమ్మె ల్యే పిల్లి అనంతలక్ష్మి, రిలయన్స్ ప్రతినిధి రవిచంద్రన్, డాక్టర్ వాడ్రేవు రవి తదితరులు ప్రసంగించారు. చిన్నారులకు కలెక్టర్ నీతూప్రసాద్, ఇతర అధికారులు పౌష్టికాహారం పంపిణీ చేసి, అల్పాహారం తినిపించారు.