సూదిమొనపై ఎయిడ్స్‌ భూతం | Over 800 students in Tripura infected with HIV | Sakshi
Sakshi News home page

సూదిమొనపై ఎయిడ్స్‌ భూతం

Published Fri, Jul 12 2024 5:57 AM | Last Updated on Fri, Jul 12 2024 5:57 AM

Over 800 students in Tripura infected with HIV

త్రిపురలో 800 మంది విద్యార్థులకు పాజిటివ్‌  

47 మందిని కబళించిన హెచ్‌ఐవీ 

మాదకద్రవ్యాల వాడకం మాటున విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి 

చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్‌ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్‌ఐవీ వైరస్‌ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 

800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్‌భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. 

పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్‌ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి.  

విద్యార్థుల్లో డ్రగ్స్‌ విచ్చలవిడి వినియోగం 
‘‘త్రిపురలో ఏటా వందల హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్‌ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్‌ ద్వారా డ్రగ్స్‌ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్‌ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్‌ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 

2015–2020 కాలంలో ఇంజెక్షన్‌ ద్వారా డ్రగ్స్‌ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్‌ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పాజిటివ్‌ రేట్‌ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్‌ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్‌ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌ డాక్టర్‌ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్‌ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్‌ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది.  

అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం 
నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్‌ సాహా సర్కార్‌ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్‌ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్‌ ట్రీట్‌మెంట్‌(ఏఆర్‌టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్‌టీ. 

శరీరంలో వైరస్‌ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్‌టీ ద్వారా రక్తంలో వైరస్‌ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్‌ మరింత ముదరకుండా ఏఆర్‌టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్‌ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్‌టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి.                               

43 రెట్లు ఎక్కువ 
శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్‌ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్‌ ద్వారా ఎయిడ్స్‌ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్‌ ద్వారా డ్రగ్స్‌ తీసుకుని ఎయిడ్స్‌ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్‌ ద్వారా డ్రగ్స్‌ తీసుకుని ఎయిడ్స్‌ కోరల్లో చిక్కుకున్నారు.  

సంపన్నుల పిల్లలే ఎక్కువ 
మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్‌ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు.  

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement