నేడు మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్‌లో గంజాయి పొగ పబ్‌లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.
స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్‌లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.
చక్రవ్యూహ్ ప్రయోగం
చక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు.
అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్‌లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్‌లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.
కుతూహలం, సాంగత్యం
టీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్‌ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్‌ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్‌కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.
బయట పడేయాలి
డ్రగ్స్‌కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్‌మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.
నెగెటివ్ కుటుంబ వాతావరణం
టీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.
ఎలా గుర్తించాలి?
మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?
1. చాలా మూడీగా తయారవుతారు
2. సరిగా భోజనం చేయరు
3. సడన్‌గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు.
4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు
5. పొడి పెదిమలు
6. ఎర్రబడ్డ కళ్లు
7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం
8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం
9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు.
Comments
Please login to add a commentAdd a comment