పట్నాలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న రాఖీ శర్మ ఆ ఉద్యోగాన్ని వదిలేసి భర్త నడుపుతున్న రీహాబిలిటేషన్ సెంటర్‌ను తను స్వయంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 5 వేల మంది ఇరవై ఏళ్ల లోపు పిల్లలను డ్రగ్స్ బారి నుంచి విముక్తి పొందేలా చేసింది. ఖైదీలలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్స్ ఇస్తోంది. మహిళలు వ్యసనానికి ఎలా లోనవుతున్నారు, వారు ఆ వ్యసనాల నుంచి బయట పడటం ఎలా అనే అంశంపై పని చేస్తున్నాను’ అని వివరిస్తోంది రాఖీ. వ్యసనాలకు గురైన వారు వాటినుంచి బయటపడి తిరిగి సంతోషకరమైన జీవనాన్ని పొందేందుకు ఆమె చేస్తున్న స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం కీలక అంశాలు.
‘‘ఒకరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. విషయం విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళ బ్లేడ్‌తో ఒళ్లంతా కోసుకుంది. డ్రగ్స్ కారణంగా ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. మత్తు పదార్థాల నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. మహిళలు డీ–అడిక్షన్ సెంటర్లకు వెళ్లడం అనేది ఉందా.. అని నన్ను అడిగారు. మద్యపానం, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడిన వ్యక్తులు తమ అలవాటును వదిలించుకోవడానికి సహాయం చేయడం కూడా ఒక ముఖ్యమైన పని. నా మౌనం–పని ఈ రెండింటితో ఈ సెంటర్‌ను 22 ఏళ్లుగా నడుపుతున్నాను. వేలాదిమందిని మాదకద్రవ్య వ్యసనం బారి నుంచి బయటికి తీసుకువచ్చాను. ఒకప్పుడు తమ జీవితాలు అంధకారంలో ఉండి, అన్ని వైపులా నిరాశకు గురైన వారు ఇప్పుడు వారి కుటుంబాలతో జీవిస్తున్నందుకు సంతోషపడుతున్నాను.
► బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి..
పుట్టి పెరిగింది గురుగ్రామ్. కొన్నాళ్లు ఢిల్లీలోనే ఉన్నాను. జంషెడ్‌పూర్, కోల్‌కతాలలో చదువుకున్నాను. డాక్టర్ కావాలనుకున్నాను కాని బ్యాంక్ ఉద్యోగి అయిన నాన్న కోరిక మేరకు సీఏ చదివాను. పెళ్లయ్యాక పట్నా వచ్చాను. నేనూ బ్యాంకు ఉద్యోగం సంపాదించుకున్నాను. కానీ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఏకకాలంలో నిర్వహించడం అంత సులభం కాదని కొన్ని రోజుల్లోనే అర్థమయ్యింది. అప్పటికే మా వారు డీ–అడిక్షన్ సెంటర్ నడుపుతున్నారు. కొన్నిరోజులు గమనించిన తర్వాత, బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశాను. నిజానికి డీ–అడిక్షన్ సెంటర్ ఎలా పనిచేస్తుంది, మత్తు పదార్థాల నుంచి వ్యసనపరులను ఎలా బయట పడేయాలో ఏమాత్రం తెలియదు. కానీ క్రమంగా నేర్చుకున్నాను.
► కాల్చివేస్తానని బెదిరింపులు..
బీహార్‌లో డీ–అడిక్షన్ సెంటర్ నడపడం చాలా కష్టం. మాదకద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఎక్కువగా నేర నేపథ్యం ఉన్న వారు వస్తారు. మంచి కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్‌కు బానిసలైతే పరువు పోతుందనే భయంతో వారిని బీహార్ నుంచి వేరే చోటకు పంపేవారు. ఇక ఓల్డ్‌సిటీలో డీ అడిక్షన్ సెంటర్‌కు వచ్చిన వారిని నిలువరించడం పెద్ద సవాలుగా ఉండేది. అలాంటి వాళ్లు మా కేంద్రానికి వచ్చి కొడతామంటూ ఉద్రేకంతో వస్తుంటారు. ఆ సమయంలో వారిపై వారికి అదుపు ఉండదు. వారి అలవాట్లను అడ్డుకుంటే బెదిరింపులు ఉండేవి. ‘బయటకు వెళ్లాక చూడు.. నిన్ను కాల్చేస్తామ’నేవారు. కేంద్రాన్ని మూసివేస్తామని బెదిరింపులు. కానీ నేనేం తప్పు చేయట్లేదు. భయమెందుకు?
► జైలులో డ్రగ్స్ నుంచి మహిళా ఖైదీల వరకు...
పట్నాలోని బ్యూర్ జైల్లో ఖైదీల కోసం 10 ఏళ్లపాటు డీ–అడిక్షన్ క్యాంప్ నడిపాను. మహిళాఖైదీలతో ఈ క్యాంప్ స్టార్ట్ అయ్యింది. జైలులో ఓ బాలిక తన బట్టలు చింపుకుని బీభత్సం సృష్టించింది. అప్పుడు నన్ను పిలిచారు. ఆమెను చూడగానే ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని అర్థమైంది. తనకు డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఆమె అలా ప్రవర్తించింది. అప్పుడు ఇక్కడ ఖైదీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో జైలు ఐజీకి నివేదించాను. ఐజీ అభ్యర్థన మేరకు జైలులో మూడు రోజుల పాటు డీ–అడిక్షన్ క్యాంపు నిర్వహించారు. శిబిరంలో 1000 మందికి పైగా ఖైదీలు పాల్గొన్నారు. వందలాది మంది ఖైదీలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు.
► నిషేధం తర్వాత..
ఒక డ్రగ్ మానేస్తే మరో మందు వాడటం మొదలు పెడతారు. బీహార్‌లో మద్య నిషేధం తర్వాత ఈ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు ప్రజలు గంజాయి, ఇతర డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు మద్యం కంటే వారి వ్యసనం నుండి బయటపడటం చాలా కష్టం. నిషేధం కారణంగా, ప్రజలు డీ–అడిక్షన్ సెంటర్‌లకు రావడం మానేశారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ కోసం 15 ప్రత్యేక పడకలను అందించేందుకు కృషి చేశాం. ఆ తర్వాత ఈ విషయంలో వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చాం. 5 వేల మంది పిల్లలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు.
► మహిళల కోసం..
చాలా మంది మహిళలు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండానే డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేందుకు వస్తుంటారు. మహిళల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. చాలా మంది మహిళలు తమ గుర్తింపును దాచుకుంటారు, కొందరు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇక్కడకు వస్తారు.
ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం తెచ్చేవాడు. ఆమె తన బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉంటూ మద్యం సేవించి క్రమంగా దానికి బానిసయ్యింది. పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో ఆమె బిడ్డ చదువుకు దూరమయ్యాడు. దాంతో డీ–అడిక్షన్ సెంటర్‌కి వెళ్లి, కొన్ని సెషన్స్ తర్వాత నార్మల్‌గా మారింది.
అదేవిధంగా పట్నాలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్‌కు బానిసైంది. ఆమె ఎంబీఏ చేసింది. తల్లి చైనాలో, సోదరుడు అమెరికాలో ఉన్నారు. ఆమె వైవాహిక జీవితం బాగోలేదు. విడాకుల తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. డీ–అడిక్షన్ సెంటర్‌కు వచ్చేటప్పటికి ఆమె శరీరంపై చాలా కోతలు ఉన్నాయి. బ్లేడుతో తానే కోసుకుని ఆనందించేది. కొన్నినెలల చికిత్స తర్వాత ఆమె సాధారణ స్థితికి వచ్చింది.
బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యానికి బానిసయ్యాడు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నాడు. భార్య ప్రోద్బలంతో ఆ ఐఏఎస్ డీ–అడిక్షన్ సెంటర్‌లో చికిత్స తర్వాత తన వ్యసనాన్ని విడిచిపెట్టాడు. చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లు డీఅడిక్షన్ సెంటర్ కు వచ్చి డ్రగ్స్ అలవాటు నుండి విముక్తి పొందారు.’’ అంటూ తను చేస్తున్న సేవ గురించి వివరించే రాఖీశర్మ ఎందరికో స్ఫూర్తిదాయకం.
వీధిబాలలు, అనాథలు, వదిలివేయబడిన పిల్లలు ఎక్కువగా మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారు. అలాంటి పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాం. వీధి బాలల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. 30–35 మంది పిల్లలకు భోజనం, పానీయం, విద్య అన్ని ఏర్పాట్లు ఉన్న చోట ఈ కేంద్రానికి వసతి కల్పించే సామర్థ్యం కల్పించాం.
Comments
Please login to add a commentAdd a comment