కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం | Central sahitya academy award to Kolakaluri Inaq | Sakshi
Sakshi News home page

కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం

Published Thu, Dec 6 2018 2:01 AM | Last Updated on Thu, Dec 6 2018 2:01 AM

Central sahitya academy award to Kolakaluri Inaq - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘విమర్శిని’ వ్యాస రచన అకాడమీ అవార్డుకు ఎంపికైంది. 2018 ఏడాదికిగానూ 24 గుర్తింపు పొందిన భాషల్లో ఉత్తమ రచన, కవితా సంపుటి, చిన్న కథల విభాగాల్లో అకాడమీ అవార్డులు ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబార్‌ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన జ్యూరీ సమావేశంలో అవార్డుల ప్రకటనకు కార్యనిర్వాహక బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ మేరకు వివరాలను అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తెలుగు నుంచి కొలకలూరి ఇనాక్‌ రచించిన ‘విమర్శిని’వ్యాసరచనకు పురస్కా రం వరించింది. తమిళం నుంచి ఎస్‌.రామకృష్ణన్‌ రచించిన ‘సంచారం’నవల. సంస్కృతం నుంచి రమాకాంత్‌ శుక్లా రచించిన ‘మమా జనని’కవిత్వం, కన్నడ నుంచి కేజీ నాగరాజప్ప రచించిన ‘అనుస్త్రేని–యజమానికె’, హిందీ నుంచి చిత్రా ముడ్గల్‌ రచించిన ‘పోస్ట్‌ బాక్స్‌ నం.203–నాళ సొపరా’నవల, ఉర్దూ నుంచి రెహమాన్‌ అబ్బాస్‌ ‘రోహిణ్‌’నవలకు అవార్డులు దక్కాయి. మొత్తం 24 భాషల్లో పురస్కారాలను ప్రకటించారు. వీటికి ఎంపికైన వాటిలో 6 నవలలు, 6 చిన్న కథలు, 7 కవిత్వం, 3 సాహిత్య విమర్శలకు అవార్డులు దక్కాయి. పురస్కారాలకు ఎంపికైన వారికి జనవరి 29న ఢిల్లీలోని అకాడమీలో జరిగే కార్యక్రమంలో అవార్డుతోపాటు, రూ.లక్ష నగదు బహుమతి, కాంస్య జ్ఞాపిక ప్రదానం చేయనున్నారు.  

పలువురికి భాషా సమ్మాన్‌ పురస్కారాలు.. 
ప్రాచీన, మధ్యయుగ సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా పలువురికి భాషా సమ్మాన్‌ పురస్కారాలు వరించాయి. దక్షిణ భారత దేశంనుంచి ప్రముఖ కన్నడ రచయిత జి.వెంకటసుబ్బయ్య పురస్కారం దక్కింది. ఇతర ప్రాంతాల నుంచి డా.యోగేం ద్రనాథ్‌ శర్మ, డా.గగనేంద్రనాథ్‌ దాస్, డా.శైలజాలకు భాషా సమ్మాన్‌ పురస్కారాలు వరించాయి. గుర్తింపు పొందని భాషల నుంచి ఐదుగురికి పురస్కారాలు దక్కాయి.

వైఎస్‌ జగన్‌ అభినందనలు: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన సాహితీ వేత్త ఇనాక్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. సాహిత్య అకాడమీ పురస్కారం రావడం ఇనాక్‌ ప్రతిభ, నిబద్ధతకు దక్కిన గుర్తింపని ప్రశంసించారు.

చాలా ఆనందంగా ఉంది..
తాజాగా తాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావడంపై ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం అద్భుతమన్నారు. అరుదైన అవకాశమనీ. చాలా సంతోషంగా ఉందన్నారు. 

బహుముఖ ప్రజ్ఞాశాలి ఇనాక్‌ 
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపి కైన ఇనాక్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆయన నటుడు, రచయిత, సాహితీవేత్త, పాలనాదక్షుడు, అధ్యాపకుడు, వ్యక్త. ప్రాచీన, ఆధు నిక సాహిత్యం రెండింటిపైనా మంచి పట్టు ఉంది. అతని రచనలు దళిత చైతన్యంతో కూడినవిగా పేరుగాంచాయి. ఆయన రాసిన ‘ఊర బావి’ప్రసిద్ధమైన గ్రంథంగా మన్నన లు అందుకొంది. ఇనాక్‌ రచనలు ఇంగ్లిషులోకీ అనువాదం ఆయ్యాయి. అతని రచనలను ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా  ప్రభుత్వం చేర్చింది. అతనికి గతంలో పద్మశ్రీ అవార్డు, మూర్తిదేవి పురస్కారంతో పాటు పలు పురస్కారాలు వరించాయి.గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి వంటి ప్రదేశాల్లో తెలుగు ఆచార్యుడుగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగు తూ, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ ఉపకులపతిగా మంచి ఖ్యాతి గడించారు. పాలనా దక్షునిగా తన ముద్ర వేశారు. ఆయన 1988లో ‘మునివాహనుడు’కథాసంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement