Central Sahitya Academy
-
డాక్టర్ శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక డి.లిట్ ప్రదానం
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన డి.లిట్.(డాక్టర్ ఆఫ్ లెటర్స్) లభించింది. భారతీయ భాషలకు సాహిత్యానికి విశేషమైన సేవలు అందించినందుకు అదే విధంగా దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర సాహిత్య అకాడమీని అభివృద్ధి పథంలో నడిపించిన పరిపాలనా దక్షతకూ గుర్తింపుగా వారికి గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ ప్రదానం చేస్తున్నట్టు షహిద్ మహేంద్ర కర్మా విశ్వవిద్యాలయం, బస్తర్ ప్రకటించింది. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో గల విశ్వవిద్యాలయంలో 2024 మార్చ్ 5వ తేదీన జరిగిన గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానోత్సవంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు డి.లిట్. డిగ్రీ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శ్రీ వాస్తవ ఇతర ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సాహిత్య సేవా రంగంలో అత్యంత అరుదైన, ప్రతిష్టాకరమైన గౌరవ డి.లిట్. డిగ్రీని స్వీకరించిన సందర్భంగా కళా సాహిత్య రంగాలకు, పరిపాలనా రాజకీయ రంగాలకూ చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపారు. కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామానికి చెందిన కృత్తివెంటి శ్రీనివాసరావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిషులో డాక్టరేట్ చేశారు. పలు గ్రంధాలు వెలువరించారు. దేశ విదేశాల్లో వందలాది సాహిత్య కార్యక్రమాలలో ప్రసంగించారు. భారత సాంస్కృతిక శాఖకు చెందిన ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శి హోదాలో శ్రీనివాసరావు దాదాపు రెండు దశాబ్దాలుగా విశేషమైన సేవలందిస్తున్నారు. -
కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ రచయిత, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘విమర్శిని’ వ్యాస రచన అకాడమీ అవార్డుకు ఎంపికైంది. 2018 ఏడాదికిగానూ 24 గుర్తింపు పొందిన భాషల్లో ఉత్తమ రచన, కవితా సంపుటి, చిన్న కథల విభాగాల్లో అకాడమీ అవార్డులు ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన జ్యూరీ సమావేశంలో అవార్డుల ప్రకటనకు కార్యనిర్వాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు వివరాలను అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తెలుగు నుంచి కొలకలూరి ఇనాక్ రచించిన ‘విమర్శిని’వ్యాసరచనకు పురస్కా రం వరించింది. తమిళం నుంచి ఎస్.రామకృష్ణన్ రచించిన ‘సంచారం’నవల. సంస్కృతం నుంచి రమాకాంత్ శుక్లా రచించిన ‘మమా జనని’కవిత్వం, కన్నడ నుంచి కేజీ నాగరాజప్ప రచించిన ‘అనుస్త్రేని–యజమానికె’, హిందీ నుంచి చిత్రా ముడ్గల్ రచించిన ‘పోస్ట్ బాక్స్ నం.203–నాళ సొపరా’నవల, ఉర్దూ నుంచి రెహమాన్ అబ్బాస్ ‘రోహిణ్’నవలకు అవార్డులు దక్కాయి. మొత్తం 24 భాషల్లో పురస్కారాలను ప్రకటించారు. వీటికి ఎంపికైన వాటిలో 6 నవలలు, 6 చిన్న కథలు, 7 కవిత్వం, 3 సాహిత్య విమర్శలకు అవార్డులు దక్కాయి. పురస్కారాలకు ఎంపికైన వారికి జనవరి 29న ఢిల్లీలోని అకాడమీలో జరిగే కార్యక్రమంలో అవార్డుతోపాటు, రూ.లక్ష నగదు బహుమతి, కాంస్య జ్ఞాపిక ప్రదానం చేయనున్నారు. పలువురికి భాషా సమ్మాన్ పురస్కారాలు.. ప్రాచీన, మధ్యయుగ సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా పలువురికి భాషా సమ్మాన్ పురస్కారాలు వరించాయి. దక్షిణ భారత దేశంనుంచి ప్రముఖ కన్నడ రచయిత జి.వెంకటసుబ్బయ్య పురస్కారం దక్కింది. ఇతర ప్రాంతాల నుంచి డా.యోగేం ద్రనాథ్ శర్మ, డా.గగనేంద్రనాథ్ దాస్, డా.శైలజాలకు భాషా సమ్మాన్ పురస్కారాలు వరించాయి. గుర్తింపు పొందని భాషల నుంచి ఐదుగురికి పురస్కారాలు దక్కాయి. వైఎస్ జగన్ అభినందనలు: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన సాహితీ వేత్త ఇనాక్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సాహిత్య అకాడమీ పురస్కారం రావడం ఇనాక్ ప్రతిభ, నిబద్ధతకు దక్కిన గుర్తింపని ప్రశంసించారు. చాలా ఆనందంగా ఉంది.. తాజాగా తాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావడంపై ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం అద్భుతమన్నారు. అరుదైన అవకాశమనీ. చాలా సంతోషంగా ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఇనాక్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపి కైన ఇనాక్ బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆయన నటుడు, రచయిత, సాహితీవేత్త, పాలనాదక్షుడు, అధ్యాపకుడు, వ్యక్త. ప్రాచీన, ఆధు నిక సాహిత్యం రెండింటిపైనా మంచి పట్టు ఉంది. అతని రచనలు దళిత చైతన్యంతో కూడినవిగా పేరుగాంచాయి. ఆయన రాసిన ‘ఊర బావి’ప్రసిద్ధమైన గ్రంథంగా మన్నన లు అందుకొంది. ఇనాక్ రచనలు ఇంగ్లిషులోకీ అనువాదం ఆయ్యాయి. అతని రచనలను ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రభుత్వం చేర్చింది. అతనికి గతంలో పద్మశ్రీ అవార్డు, మూర్తిదేవి పురస్కారంతో పాటు పలు పురస్కారాలు వరించాయి.గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి వంటి ప్రదేశాల్లో తెలుగు ఆచార్యుడుగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగు తూ, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ ఉపకులపతిగా మంచి ఖ్యాతి గడించారు. పాలనా దక్షునిగా తన ముద్ర వేశారు. ఆయన 1988లో ‘మునివాహనుడు’కథాసంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. -
గ్రంథాలయోద్యమానికి వెన్నెముక
ఒక సాధారణ గ్రంథాలయ ఉద్యోగి జీతం కోసం ఉద్యోగం చేయడం కాకుండా విజ్ఞానానికి దోసిలి పట్టి, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే కొన్ని తరాలను ప్రభావితం చేయవచ్చు అనేందుకు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జీవితమే సాక్షి. కేంద్ర సాహిత్య అకాడమి, తెలుగు విభాగం సభ్యుడయిన డాక్టర్ వెలగా వెంకటప్పయ్య ఒకప్పుడు సాధారణ గ్రంథాల య ఉద్యోగి... చాలామందిలా జీతం కోసం ఉద్యోగం అనుకో లేదాయన... అందుబాటులో ఉన్న విజ్ఞానానికి దోసిలి పట్టా రు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకున్నారు. డాక్టరేటు పట్టా తీసుకున్నారు. కలం పట్టారు... వందల పుస్తకాలు రాశారు... సంకలనం చేశారు. 60 వేల పేజీల పైచిలుకు పుస్తకాలకు సంపాద కత్వం వహించగలిగారు. ఎందరినో రచయితలుగా తీర్చిదిద్దారు. గ్రంథాలయాల స్థాపనకు దారిచూపారు. నమూనా పౌరగ్రంథాలయ చట్టాన్ని రూపొందించారు. గ్రంథసూచీలు, అనుక్రమణికల తయారీలోనూ అందె వేశారు. వయోజనవిద్య, బాలసాహిత్యంలో విశేష కృషి చేశారు. అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి, వావిలాల గోపాలకృ ష్ణయ్య వంటి గ్రంథాలయోద్యమకారుల వారసుడయ్యా రు. పుస్తకానికి పెద్ద దిక్కు అనిపించుకున్నారు...నడిచే గ్రంథాలయం అన్నారు మరికొందరు. ఎన్నో గౌరవాలం దుకున్నారు. గ్రంథాలయ ఉద్యోగంతో ఎదిగి, గ్రంథాల యోద్యమానికి వెన్నెముకగా నిలవడం వెనుక వెలగా అకుంఠిత దీక్ష, అపారమైన శ్రమ ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి అయితానగర్‌లోని సామా న్య రైతు కుటుంబంలో 1932లో జన్మించిన వెంకటప్ప య్య జీవితం, శాఖా గ్రంథాలయంలో చిరుద్యోగంతో పుస్తకాలతో ముడిపడింది. కాలేజి విద్యాభ్యాసంలో ఉండ గానే 1956లో వచ్చిన ఉద్యోగంతో సంతృప్తిపడుతూ గ్రంథాలయ విజ్ఞానం, బాలసాహిత్యం, వయోజనవిద్య అధ్యయనం చేశారు. ఉన్నత చదువులు చదివారు. పీహెచ్డీ కూడా పూర్తిచేశారు. ‘తెలుగులో బాల సాహిత్య వికాసం- ఆంధ్రప్రదేశ్‌లో బా లల గ్రంథాలయాల ప్రగతి’పై ఆయన రాసిన పరిశోధన వ్యాసం, ఆ ఏడాది అత్యుత్తమంగా ఎంపికై బంగారుపత కం అందుకుంది. బదిలీలు అయినపుడల్లా అక్కడి రచయితలు, సాహితీవేత్తలు, ప్రముఖు లతో పరిచయం, పుస్తకాల అధ్యయ నం, ఆయన్ను రచనా వ్యాసంగంవైపు మళ్లించింది. ముం దుగా గ్రంథాలయ విభాగంపై దృష్టి పెట్టారు. అందులో ఆయన సృజించని శాఖ లేదంటే అతిశయోక్తి కాదు. గ్రం థాలయ వర్గీకరణ, గ్రంథాలయ సూచీకరణ ప్రయోగ దీపికలు ఎంతో ప్రయోజనకారిగా గుర్తింపు పొందాయి. తెలుగు పుస్తకాల అమరిక, నిర్వహణలో ఎదురవుతున్న చిక్కులను తొలగించటానికి విదేశాల్లోని గ్రంథాలయ, సమాచార శాస్త్రవేత్తల సూచనలను పరిశీలించి మన పరిస్థి తులకు అనుగుణంగా, ‘వర్గీకరణ నియమాలు’, ‘గ్రంథ కర్త గుర్తులు’, ‘విషయ శీర్షికలు’ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వ పౌర గ్రంథాలయశాఖ తెలుగుపుస్తకాల వర్గీకర ణ కు డ్యూయీ దశాంశ వర్గీకరణ విధానాన్ని సవరించి నూ తన జాబితాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. సోవియట్ రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై మాస్కో పర్యటనకు వెళ్లివచ్చాక ‘లెనిన్ గ్రంథాలయ విధానం’, ‘లైబ్రరీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది యూఎస్ఎస్ఆర్’ గ్రంథాన్ని వెలువరించి ఆ వ్యవస్థను తెలుగువారికి పరిచయం చేశారు. వెలగా రచించిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక, శాస్త్రీయ వాజ్ఞయ సూచిక, గ్రంథసూచికలు వివిధ రంగాలపై ఆయనకు గల విషయ పరిజ్ఞానానికి అద్దం పడతాయి. కాకతీయ యూనివర్సిటీకి సర్టిఫికెట్ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. పౌర గ్రంథాలయ చట్టాల పత్రాలను తెప్పించి ‘ఇండియన్ లైబ్రరీ లెజిస్లేషన్’ అనే గ్రం థాన్ని రెండు సంపుటాల్లో వెలువరించారు. ఉద్యోగ విరమణ అనంతరం రచ నా వ్యాసంగంలో మరింత మునిగిపో యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘం టువులు, తెలుగు ప్రముఖులు, బాల సాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొ చ్చారు. వీరి సంపాదకత్వంలో ఇప్పటికి 60 వేల పైచిలుకు పేజీల పుస్తకాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ సాహి త్య అకాడమీ, తెలుగు యూనివర్సిటీ అవార్డు, బాలల అకాడమీచే ‘బాలబంధు’, అయ్యంకి అవార్డు వంటివి ఎన్నో ఆయన్ను వరించాయి. ధర్మవరంలోని కళాజ్యోతి సంస్థ వెలగాపై గౌరవంతో పౌర గ్రంథాలయ సేవలోని ఉత్తమ గ్రంథపాలకులకు 1990 నుంచి ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. గుంటూరులోని ఒక వీధికి వెలగా పేరిట నామకరణం చేశారు. వెలగా జన్మదినం సందర్భంగా గత జూన్‌లో విజయనగరం జిల్లా తోటపల్లి, పార్వతీపురంలో 50 గ్రామీణ గ్రంథాలయాలను ఆయనచే ప్రారంభింపజే శారు. ఆయన నిర్వహించిన పదవులు లెక్కలేదు. బీపీ, షుగర్ వంటి రుగ్మతలేమీ లేకుండా కళ్లజోడుతోనూ పని లేకుండా గడుపుతూ కొత్తగా వేసిన పుస్తకావిష్కరణకు ప్రముఖులను ఆహ్వానించి ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటు రావటం, మరికొన్ని గంటల్లోనే ఆయన మృత్యు వాత పడటం పుస్తకప్రియులకే కాదు, ఆయన పరిచయ స్తులకు తీవ్ర విచారకరం. (డాక్టర్ వెలగా వెంకటప్పయ్యకు నివాళి) (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, తెనాలి) - బి.ఎల్. నారాయణ -
బూతుల పండుగ భలే ఇష్టం
జ్ఞాపకం చింతలతోపు భయంతో బడికి వెళ్లాలంటే గాభరా.. కాముని దహనం నాడు కోపమున్నవాళ్లను ఇష్టంగా తిట్టడం.. నూర్మహల్ థియేటర్‌కు వచ్చిన సినిమాను వదలకుండా చూడటం.. వీహెచ్‌తో గొడవ, స్నేహితులతో కలిసి ఆట.. బతుకమ్మ పూలకోసం వేట.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భూపాల్‌రెడ్డికి నగరం మిగిల్చిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. నేను పుట్టి పెరిగింది అంబర్‌పేటలోనే. 1963 సంవత్సరం.. అప్పటికి నాకు పదేళ్లనుకుంటా. స్నేహితులతో కలిసి కాముడి దహనంలో పాల్గొనేది. అందరం కలిసి తీసుకొచ్చిన కట్టెలను ఒకచోట పోగేసి కాముడికి నిప్పు పెట్టి దహనం చేసేవాళ్లం. ఆ రోజును కాముడి దహనం అనే కంటే బూతుల పండుగ అంటే సరిగ్గా నప్పుతుంది. ఆ రోజు ఎవరినైనా నోటికి వచ్చిన బూతులు తిట్టేవాళ్లం. మస్తు మజాగా అనిపించేది. నేనైతే నాకు పడని వాళ్లను ఇష్టమొచ్చినట్టు తిట్టడాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకుంటాను. అంబర్‌పేట ప్లే గ్రౌండ్, చిన్తోట, గుంటంలో చార్పత్తార్, ఫుట్‌బాల్, కింగ్ ఆట, లోన్పాట, తుండుం ఆట, క్రికెట్, గిల్లిదండ చిన్ననాటి మిత్రులతో కలిసి ఆడటం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిది. మూసీ కట్టను ఆనుకొని ఉన్న నూర్మహల్ థియేటర్‌కు వచ్చిన ప్రతి సినిమాను చూసేవాణ్ని. భయపడేవాడిని అబిడ్స్‌లోని చాదర్‌ఘాట్ హైస్కూల్లో చదువు. రోజూ సైకిల్ మీదచింతలతోపు (ప్రస్తుత చిక్కడపల్లి) ప్రాంతం దాటి వెళ్లాలి. మొత్తం బురద. చింతచెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ మార్గం నుంచి అబిడ్స్‌కు వెళ్లాలంటే చాలా భయమనిపించేది. ఇప్పుడు ఎంత వెదికినా చెట్లు కనవడవు. మరిచిపోలేనిదిఅంబర్పేటలోని నెహ్రూ పాల్టెక్నిక్ కళాశాలను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వచ్చారు. ఆయనను దగ్గర నుంచి చూసి సంబరపడ్డా.అదో మరిచిపోలేని జ్ఞాపకం. మా నాన్న రామిరెడ్డి అవినీతి నిరోధక విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అప్పట్లో వారు వ్యవహరించే తీరు. ఇప్పటితో పోల్చలేం.రూ.650కే పెళ్లి వంటసరుకులు1963 సంవత్సరంలో మా సోదరి పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు ఇసామియా బజార్‌లోని ఓ కొట్టులో పెళ్లి వంటసామగ్రి తీసుకొన్నాం. వెయ్యి మంది వంటకు కావాల్సిన సామగ్రి 650 రూపాయలకే వచ్చాయి. బతుకమ్మ మస్తు అనిపించేది ఎంగిలిపువ్వు నుంచి సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు ఘనంగా జరిగేవి. బతుకమ్మను తయారు చేసేందుకు పూలు తెచ్చేందుకు స్నేహితులతో కలిసి అంబర్‌పేటలో ఉన్న మూసీనది కట్ట మీదకు వెళ్లేవాడిని. తీగమల్లె, మల్లెపూలు, ఇప్పపువ్వు, కాడ పువ్వు, గుణుగు, తంగేడు పూలను కోసేవాళ్లం. అంబర్‌పేటలో మా బతుకమ్మే పెద్దదిగా ఉండాలని అందరికన్నా ఎక్కువపూలు తెచ్చేది నేను. వీటికి తోడు ఇంట్లో విరబూసిన బంతి పువ్వులు ఉండేవి. తెచ్చిన పువ్వులకు రంగు వేసి ఆకర్షణీయంగా తయారు చేసేది అమ్మ. బతుకమ్మకుంట మాయమైంది బతుకమ్మ పాటలు వింటుంటే తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేది. పాటలు పాడేందుకు ఆడవాళ్లు పోటీపడేవారు. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను కుంటలో నిమజ్జనం చేసేందుకు స్నేహితులతో పోటీ పడేవాడిని. అందరి కన్నా ఎక్కువ లోతులోకి తీసుకెళ్లి మా బతుకమ్మను నిమజ్జనం చేసిన రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతుంటాయి. మూసీ పరీవాహక ప్రాంతాలు కబ్జా అయ్యాయి. బతుకమ్మ కుంట మాయమైపోయింది. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలే! ..:: వాంకె శ్రీనివాస్ వీహెచ్‌తో గొడవ.. అంబర్‌పేటలోని హనుమాన్ వీధిలో మేం ఉండేవాళ్లం. 1975 సంవత్సరం అనుకుంటా. ఆ పక్క గల్లీలోనే జననాట్యమండలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడే వీహెచ్ కూడా హనుమాన్ వీధిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మా కార్యక్రమంలో గద్దర్‌తో పాటు జననాట్య మండలి సభ్యులు, జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. కాంగ్రెస్ సభకు అప్పటి ఆరోగ్యమంత్రి రాచమల్లు హాజరయ్యారు. అయితే వాళ్లు ఆశించిన స్థాయిలో ప్రజలు పోలే దు. దీంతో వీహెచ్ కోపంతో నాతో గొడవకు దిగారు. అయినా నేనేమీ బెదరలేదు. -
నేడు తాపీ ధర్మారావు జయంతి
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును, మరెన్నో సాహిత్య అవార్డులను సంపాందించుకున్న తాపీ ధర్మారావు గారి జయంతి వేడుకలు నేడు. ‘తాతాజీ’గా ముద్దుగా పిలుచుకునే ఈయన అందరికీ సుపరిచితులే. గౌరవ పురస్కాలు : శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు. ఇతర విషయాలు : ‘తాతాజీ’ గా అందరికీ సుపరిచితులు. ఈయన గిడుగు రామమూర్తి పంతులు గారి శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్మెంట్లలో పలు ఉద్యోగాలు చేశారు. ఈయన తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. తరువాత అనేక రచనలు చేశారు. మాలపిల్ల (1938) సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1943లో జరిగిన మొదటి అభ్యుదయ రచయితల సమావేశానికి అధ్యక్షత వహించారు. రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంఘసంస్కర్తగా ప్రసిద్ధులు. ‘పాతపాళీ’, ‘కొత్తపాళీ’, ‘దేవాలయంపై బూతుబొమ్మలెందుకు?’ మొదలైన గ్రంథాలను రచించిన హేతువాది. చేమకూర వెంకటకవి ‘విజయ విలాసాని’కి హృదయోల్లాస వ్యాఖ్యను రచించారు మరణం : 08-05-1973 పూర్తిపేరు : తాపీ ధర్మారావు నాయుడు జననం : 19-09-1887 జన్మస్థలం : ఒరిస్సాలోని బరంపురం తల్లిదండ్రులు : నరసమ్మ, డాక్టర్ అప్పన్న చదువు : బి.ఏ. (పచ్చయ్యప్ప కాలే జ్ , చెన్నై) తోబుట్టువులు : అన్నయ్య (నరసింగరావు), తమ్ముడు (తులసీరావు), చెల్లెళ్లు (వెంకటనరసమ్మ, తిరుపతమ్మ) వివాహం : 1902 భార్య : అన్నపూర్ణమ్మ పిల్లలు : కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య) పాటలు రాసిన తొలిచిత్రం : రైతుబిడ్డ (1939) ఆఖరిచిత్రం : భీష్మ (1962) పాటలు : సుమారు 250