బూతుల పండుగ భలే ఇష్టం | interacting with bhupal reddy | Sakshi
Sakshi News home page

బూతుల పండుగ భలే ఇష్టం

Published Sun, Jul 20 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

బూతుల పండుగ భలే ఇష్టం

బూతుల పండుగ భలే ఇష్టం

జ్ఞాపకం

చింతలతోపు భయంతో బడికి వెళ్లాలంటే గాభరా.. కాముని దహనం నాడు కోపమున్నవాళ్లను ఇష్టంగా తిట్టడం.. నూర్‌మహల్ థియేటర్‌కు వచ్చిన సినిమాను వదలకుండా చూడటం.. వీహెచ్‌తో గొడవ, స్నేహితులతో కలిసి ఆట.. బతుకమ్మ పూలకోసం వేట..
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భూపాల్‌రెడ్డికి నగరం మిగిల్చిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
 
నేను పుట్టి పెరిగింది అంబర్‌పేటలోనే. 1963 సంవత్సరం.. అప్పటికి నాకు పదేళ్లనుకుంటా. స్నేహితులతో కలిసి కాముడి దహనంలో పాల్గొనేది. అందరం కలిసి తీసుకొచ్చిన కట్టెలను ఒకచోట పోగేసి కాముడికి నిప్పు పెట్టి దహనం చేసేవాళ్లం. ఆ రోజును కాముడి దహనం అనే కంటే బూతుల పండుగ అంటే సరిగ్గా నప్పుతుంది.

ఆ రోజు ఎవరినైనా నోటికి వచ్చిన బూతులు తిట్టేవాళ్లం. మస్తు మజాగా అనిపించేది. నేనైతే నాకు పడని వాళ్లను ఇష్టమొచ్చినట్టు తిట్టడాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకుంటాను. అంబర్‌పేట ప్లే గ్రౌండ్, చిన్‌తోట, గుంటంలో చార్‌పత్తార్, ఫుట్‌బాల్, కింగ్ ఆట, లోన్‌పాట, తుండుం ఆట, క్రికెట్, గిల్లిదండ చిన్ననాటి మిత్రులతో కలిసి ఆడటం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిది. మూసీ కట్టను ఆనుకొని ఉన్న నూర్‌మహల్ థియేటర్‌కు వచ్చిన ప్రతి సినిమాను చూసేవాణ్ని.
 
భయపడేవాడిని
అబిడ్స్‌లోని చాదర్‌ఘాట్ హైస్కూల్‌లో చదువు. రోజూ సైకిల్ మీదచింతలతోపు (ప్రస్తుత చిక్కడపల్లి) ప్రాంతం దాటి వెళ్లాలి. మొత్తం బురద. చింతచెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ మార్గం నుంచి అబిడ్స్‌కు వెళ్లాలంటే చాలా భయమనిపించేది. ఇప్పుడు ఎంత వెదికినా చెట్లు కనవడవు.

మరిచిపోలేనిదిఅంబర్‌పేటలోని నెహ్రూ పాల్‌టెక్నిక్ కళాశాలను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వచ్చారు. ఆయనను దగ్గర నుంచి చూసి సంబరపడ్డా.అదో మరిచిపోలేని జ్ఞాపకం. మా నాన్న రామిరెడ్డి అవినీతి నిరోధక విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అప్పట్లో వారు వ్యవహరించే తీరు. ఇప్పటితో పోల్చలేం.రూ.650కే పెళ్లి వంటసరుకులు1963 సంవత్సరంలో మా సోదరి పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు ఇసామియా బజార్‌లోని ఓ కొట్టులో పెళ్లి వంటసామగ్రి తీసుకొన్నాం. వెయ్యి మంది వంటకు కావాల్సిన సామగ్రి 650 రూపాయలకే వచ్చాయి.
 
బతుకమ్మ మస్తు అనిపించేది

ఎంగిలిపువ్వు నుంచి సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు ఘనంగా జరిగేవి. బతుకమ్మను తయారు చేసేందుకు పూలు తెచ్చేందుకు స్నేహితులతో కలిసి అంబర్‌పేటలో ఉన్న మూసీనది కట్ట మీదకు వెళ్లేవాడిని. తీగమల్లె, మల్లెపూలు, ఇప్పపువ్వు, కాడ పువ్వు, గుణుగు, తంగేడు పూలను కోసేవాళ్లం. అంబర్‌పేటలో మా బతుకమ్మే పెద్దదిగా ఉండాలని అందరికన్నా ఎక్కువపూలు తెచ్చేది నేను. వీటికి తోడు ఇంట్లో విరబూసిన బంతి పువ్వులు ఉండేవి. తెచ్చిన పువ్వులకు రంగు వేసి ఆకర్షణీయంగా తయారు చేసేది అమ్మ.
 
బతుకమ్మకుంట మాయమైంది
బతుకమ్మ పాటలు వింటుంటే తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేది. పాటలు పాడేందుకు ఆడవాళ్లు  పోటీపడేవారు. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మలను కుంటలో నిమజ్జనం చేసేందుకు స్నేహితులతో పోటీ పడేవాడిని. అందరి కన్నా ఎక్కువ లోతులోకి తీసుకెళ్లి మా బతుకమ్మను నిమజ్జనం చేసిన రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతుంటాయి. మూసీ పరీవాహక ప్రాంతాలు కబ్జా అయ్యాయి. బతుకమ్మ కుంట మాయమైపోయింది. ఎటు చూసినా కాంక్రీట్ భవనాలే!
 ..:: వాంకె శ్రీనివాస్
 
వీహెచ్‌తో గొడవ..
అంబర్‌పేటలోని హనుమాన్ వీధిలో మేం ఉండేవాళ్లం. 1975 సంవత్సరం అనుకుంటా. ఆ పక్క గల్లీలోనే జననాట్యమండలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడే వీహెచ్ కూడా హనుమాన్ వీధిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మా కార్యక్రమంలో గద్దర్‌తో పాటు జననాట్య మండలి సభ్యులు, జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. కాంగ్రెస్ సభకు అప్పటి ఆరోగ్యమంత్రి రాచమల్లు హాజరయ్యారు. అయితే వాళ్లు ఆశించిన స్థాయిలో ప్రజలు పోలే దు.  దీంతో వీహెచ్ కోపంతో నాతో గొడవకు దిగారు. అయినా నేనేమీ బెదరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement