రూ.8 లక్షల నగదుతో పట్టుబడిన రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి
సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి కూడా..
‘నిషేధిత భూమి’వ్యవహారంలో లంచం డిమాండ్
పక్కా పథకంతో పట్టుకున్న అవినీతి నిరోధక విభాగం
చంచల్‌గూడ జైలుకు తరలింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి 14 గుంటల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఇటీవల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ విషయాన్ని కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇ–సెక్షన్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారు. విషయం అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.8 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు స్కెచ్చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మదన్‌మోహన్‌రెడ్డిని గుర్రంగూడ ఎక్స్‌రోడ్‌కు ముత్యంరెడ్డి పిలిపించాడు.
మాటు వేసి..
సీనియర్ అసిస్టెంట్ తన స్విఫ్ట్ డిజైర్ టీఎస్ 08ఎఫ్‌ఆర్ 1134 కారులో అక్కడికి చేరుకోగా ముత్యంరెడ్డి రూ.8 లక్షల నగదుతో కూడిన సంచిని అందజేశాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు మదన్‌మోహన్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతను అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు చెప్పడంతో అతనితో భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించారు. నగదు తీసుకుని ఓఆర్‌ఆర్ పెద్ద అంబర్‌పేట్ ఎగ్జిట్ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు.
ప్రభుత్వ ఇన్నోవా కారు (టీఎస్ 07జీకే0459)లో రాత్రి 10.41 గంటలకు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మదన్‌మోహన్ తన కారులో ఉన్న నగదును భూపాల్‌రెడ్డి వాహనంలో పెట్టారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భూపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌కు తీసుకొచ్చి విచారించారు. తెల్లారేవరకు అక్కడే ఉంచారు. కీలక ఫైళ్లను స్వా«దీనం చేసుకున్నారు.
రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాదీనం
హయత్‌నగర్ పరిధిలోని తట్టిఅన్నారం వద్ద ఇందు అరణ్య విల్లాస్‌లో ఉంటున్న భూపాల్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఐదుగురిని పట్టించిన ముత్యంరెడ్డి
గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డి గతంలో తుర్కయాంజాల్‌కు చెందిన ఓ వీఆర్‌వో, మున్సిపల్ పరిధిలోని బిల్ కలెక్టర్‌తో పాటు ఓ ఎస్‌ఐని కూడా వివిధ కేసుల్లో ఏసీబీకి పట్టించడం గమనార్హం. కాగా ఇప్పుడు ఏకంగా ఓ అదనపు కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను కూడా పట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment