‘మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలా..’ అని ఓ తెలుగు సినిమాలో సినీనటుడు రావుగోపాలరావు చెప్పినట్లు.. ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వెండితెరపై తళుక్కున మెరిసి తమలోని కళానైపుణ్యాన్ని చాటుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, కంచర్ల భూపాల్‌రెడ్డి నిజ జీవితంలో మాదిరిగానే సినిమాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా.. అద్దంకి దయాకర్ లీడర్‌గా పాత్రలు పోషించి తమ నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపై కనిపించిన మన నాయకులపై ప్రత్యేక కథనం..
సినిమాల్లోనూ లీడర్, ప్రజాప్రతినిధులుగా నటించిన అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నర్సింహులు, కంచర్ల భూపాల్‌రెడ్డి
తమ నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించిన నేతలు
అర్వపల్లి: సమకాలీన రాజకీయ అంశాలు, యథార్థ సంఘటనలు, ప్రేక్షకుల్లో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించేలా బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇండియా ఫైల్స్ చిత్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్‌చార్జ్, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన అద్దంకి దయాకర్ స్వీయ పాత్రలో నటిస్తున్నారు. నటి ఇంద్రజ కూడా ఇందులో నటిస్తోంది. భారతదేశంతో పాటు మొత్తం నాలుగు దేశాలకు సంబంధించిన భాషల్లో ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో రిలీజ్ కాగా డిసెంబర్‌లో సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ చివరిసారిగా నటించడంతో పాటు ఆయన చివరి పాట కూడా ఉంది. ఇండియాకు సంబంధించిన 10వేల సంవత్సరాల చరిత్రను క్లుప్తంగా ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఎమ్మెల్యేగా నటించి..
నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండకు చెందిన చిన్ని చరణ్ దర్శకత్వం వహించిన అదీ లెక్క సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు. ఈ సినిమా 2016లో విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించిన భూపాల్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం.
సినీ నిర్మాతగా యుగంధర్‌రావు
తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, సూర్యాపేట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక భర్త గుజ్జ యుగంధర్‌రావు బందూక్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా 2015 జూన్ 19న విడుదలయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment