గ్రంథాలయోద్యమానికి వెన్నెముక | Velaga venkatappayya is the backbone of Library movement | Sakshi
Sakshi News home page

గ్రంథాలయోద్యమానికి వెన్నెముక

Published Tue, Dec 30 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

గ్రంథాలయోద్యమానికి వెన్నెముక

గ్రంథాలయోద్యమానికి వెన్నెముక

ఒక సాధారణ గ్రంథాలయ ఉద్యోగి జీతం కోసం ఉద్యోగం చేయడం కాకుండా విజ్ఞానానికి దోసిలి పట్టి, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే కొన్ని తరాలను ప్రభావితం చేయవచ్చు అనేందుకు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జీవితమే సాక్షి. 
 
 కేంద్ర సాహిత్య అకాడమి, తెలుగు విభాగం సభ్యుడయిన డాక్టర్ వెలగా వెంకటప్పయ్య ఒకప్పుడు సాధారణ గ్రంథాల య ఉద్యోగి... చాలామందిలా జీతం కోసం ఉద్యోగం అనుకో లేదాయన... అందుబాటులో ఉన్న విజ్ఞానానికి దోసిలి పట్టా రు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకున్నారు. డాక్టరేటు పట్టా తీసుకున్నారు. కలం పట్టారు... వందల పుస్తకాలు రాశారు... సంకలనం చేశారు. 60 వేల పేజీల పైచిలుకు పుస్తకాలకు సంపాద కత్వం వహించగలిగారు. ఎందరినో రచయితలుగా తీర్చిదిద్దారు. గ్రంథాలయాల స్థాపనకు దారిచూపారు. నమూనా పౌరగ్రంథాలయ చట్టాన్ని రూపొందించారు. గ్రంథసూచీలు, అనుక్రమణికల తయారీలోనూ అందె వేశారు. వయోజనవిద్య, బాలసాహిత్యంలో విశేష కృషి చేశారు. అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి, వావిలాల గోపాలకృ ష్ణయ్య వంటి గ్రంథాలయోద్యమకారుల వారసుడయ్యా రు. పుస్తకానికి పెద్ద దిక్కు అనిపించుకున్నారు...నడిచే గ్రంథాలయం అన్నారు మరికొందరు. ఎన్నో గౌరవాలం దుకున్నారు. గ్రంథాలయ ఉద్యోగంతో ఎదిగి, గ్రంథాల యోద్యమానికి వెన్నెముకగా నిలవడం వెనుక వెలగా అకుంఠిత దీక్ష, అపారమైన శ్రమ ఉన్నాయి.
 
 గుంటూరు జిల్లా తెనాలి అయితానగర్‌లోని సామా న్య రైతు కుటుంబంలో 1932లో జన్మించిన వెంకటప్ప య్య జీవితం, శాఖా గ్రంథాలయంలో చిరుద్యోగంతో పుస్తకాలతో ముడిపడింది. కాలేజి విద్యాభ్యాసంలో ఉండ గానే 1956లో వచ్చిన ఉద్యోగంతో సంతృప్తిపడుతూ గ్రంథాలయ విజ్ఞానం, బాలసాహిత్యం, వయోజనవిద్య అధ్యయనం చేశారు. ఉన్నత చదువులు చదివారు. పీహెచ్‌డీ కూడా పూర్తిచేశారు. ‘తెలుగులో బాల సాహిత్య వికాసం- ఆంధ్రప్రదేశ్‌లో బా లల గ్రంథాలయాల ప్రగతి’పై ఆయన రాసిన పరిశోధన వ్యాసం, ఆ ఏడాది అత్యుత్తమంగా ఎంపికై  బంగారుపత కం అందుకుంది.
 
 బదిలీలు అయినపుడల్లా అక్కడి రచయితలు, సాహితీవేత్తలు, ప్రముఖు లతో పరిచయం, పుస్తకాల అధ్యయ నం, ఆయన్ను రచనా వ్యాసంగంవైపు మళ్లించింది. ముం దుగా గ్రంథాలయ విభాగంపై దృష్టి పెట్టారు. అందులో ఆయన సృజించని శాఖ లేదంటే అతిశయోక్తి కాదు. గ్రం థాలయ వర్గీకరణ, గ్రంథాలయ సూచీకరణ ప్రయోగ దీపికలు ఎంతో ప్రయోజనకారిగా గుర్తింపు పొందాయి. తెలుగు పుస్తకాల అమరిక, నిర్వహణలో ఎదురవుతున్న చిక్కులను తొలగించటానికి విదేశాల్లోని గ్రంథాలయ, సమాచార శాస్త్రవేత్తల సూచనలను పరిశీలించి మన పరిస్థి తులకు అనుగుణంగా, ‘వర్గీకరణ నియమాలు’, ‘గ్రంథ కర్త గుర్తులు’, ‘విషయ శీర్షికలు’ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్ర భుత్వ పౌర గ్రంథాలయశాఖ తెలుగుపుస్తకాల వర్గీకర ణ కు డ్యూయీ దశాంశ వర్గీకరణ విధానాన్ని సవరించి నూ తన జాబితాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు.
 
 సోవియట్ రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై మాస్కో పర్యటనకు వెళ్లివచ్చాక ‘లెనిన్ గ్రంథాలయ విధానం’, ‘లైబ్రరీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది యూఎస్‌ఎస్‌ఆర్’ గ్రంథాన్ని వెలువరించి ఆ వ్యవస్థను తెలుగువారికి పరిచయం చేశారు. వెలగా రచించిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక, శాస్త్రీయ వాజ్ఞయ సూచిక, గ్రంథసూచికలు వివిధ రంగాలపై ఆయనకు గల విషయ పరిజ్ఞానానికి అద్దం పడతాయి. కాకతీయ యూనివర్సిటీకి సర్టిఫికెట్ కోర్సుకు ఆరు పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. పౌర గ్రంథాలయ చట్టాల పత్రాలను తెప్పించి ‘ఇండియన్ లైబ్రరీ లెజిస్లేషన్’ అనే గ్రం థాన్ని రెండు సంపుటాల్లో వెలువరించారు.
 
 ఉద్యోగ విరమణ అనంతరం రచ నా వ్యాసంగంలో మరింత మునిగిపో యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘం టువులు, తెలుగు ప్రముఖులు, బాల సాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొ చ్చారు. వీరి సంపాదకత్వంలో ఇప్పటికి 60 వేల పైచిలుకు పేజీల పుస్తకాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ సాహి త్య అకాడమీ, తెలుగు యూనివర్సిటీ అవార్డు, బాలల అకాడమీచే ‘బాలబంధు’, అయ్యంకి అవార్డు వంటివి ఎన్నో ఆయన్ను వరించాయి.
 
ధర్మవరంలోని కళాజ్యోతి సంస్థ వెలగాపై గౌరవంతో పౌర గ్రంథాలయ సేవలోని ఉత్తమ గ్రంథపాలకులకు 1990 నుంచి ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. గుంటూరులోని ఒక వీధికి వెలగా పేరిట నామకరణం చేశారు. వెలగా జన్మదినం సందర్భంగా గత జూన్‌లో విజయనగరం జిల్లా తోటపల్లి, పార్వతీపురంలో 50 గ్రామీణ గ్రంథాలయాలను ఆయనచే ప్రారంభింపజే శారు. ఆయన నిర్వహించిన పదవులు లెక్కలేదు. బీపీ, షుగర్ వంటి రుగ్మతలేమీ లేకుండా కళ్లజోడుతోనూ పని లేకుండా గడుపుతూ కొత్తగా వేసిన పుస్తకావిష్కరణకు ప్రముఖులను ఆహ్వానించి ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటు రావటం, మరికొన్ని గంటల్లోనే ఆయన మృత్యు వాత పడటం పుస్తకప్రియులకే కాదు, ఆయన పరిచయ స్తులకు తీవ్ర విచారకరం.
 (డాక్టర్ వెలగా వెంకటప్పయ్యకు నివాళి)
 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, తెనాలి)
- బి.ఎల్. నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement