
వీకెండ్ వచ్చింది.. ఎంజాయ్ చేయాలి. ఐదురోజులు పండగ సెలవులొచ్చాయి.. ఎక్కడికైనా సరదాగా వెళ్లాలి. సిటీలో తిరిగితిరిగీ విసుగొచ్చేసింది.. అందుకే దూరంగా ఎగిరిపోవాలి.. ఆనందంగా విహరించి రావాలి.
ఈ ఆలోచన వచ్చిందే తడవు సిటీవాసులు ఆచరణలో పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తున్నారు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారు.. అప్పటికప్పుడే ‘రెక్కలు’ çకట్టుకుపోతున్నారు. రెండు రోజులు సెలవుదొరికినా సరే సింగపూర్, మలేసియా, దుబాయ్ వంటి దేశాల్లో వాలిపోతున్నారు. విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లతో దిగువ మధ్య తరగతివారు సైతం పక్క రాష్ట్రాలకు విమానంలో వెళ్లొస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల పర్యాటక దృక్పథంలో సరికొత్త మార్పులు వచ్చేశాయి. రోజు రోజుకు దిగివస్తున్న ఫ్లైట్ చార్జీలతో మధ్యతరగతి ప్రజలు అంతర్జాతీయ ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజులు సెలవులొస్తే చాలు ఏ మలేషియా ట్రిప్పుకో, సింగపూర్ టూర్‌కో సన్నద్ధమవుతున్నారు. నగరవాసుల అభిరుచికి తగ్గట్లుగానే ట్రావెలింగ్ సంస్థలు సైతంఆకర్షణీయమైన ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ, అంతర్జాతీయ ట్రావెల్ ఆర్గనైజర్ కాక్స్ అండ్ కింగ్స్ వంటి సంస్థలు ఈ వింటర్‌లో ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు చక్కటి ప్యాకేజీలతో ముందుకు వస్తున్నాయి. మరోవైపు శని, ఆదివారాలు వంటి వీకెండ్స్‌లో ఎక్కువ శాతం మంది ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, పంచాగ్ని వంటి పొరుగు రాష్ట్రాల్లోనిప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం సిటీ నుంచి అంతర్జాతీయ పర్యాటక ప్రయాణాలు 20 శాతం వరకు, దేశీయ పర్యాటక ప్రయాణాలు 18 శాతం పెరిగినట్లు కాక్స్ అండ్ కింగ్స్‌లో సర్వేలో వెల్లడైంది.
ఆ ఐదు దేశాలకే ఎక్కువ డిమాండ్...
వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్తుండగా సందర్శనీయ స్థలాల కోసం ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రేలియాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వింటర్ హాలిడేస్‌లో ఈ ఐదు దేశాలకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ట్రావెలింగ్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఐఆర్‌సీటీసీ రూపొందించే ప్యాకేజీల్లోనూ దుబాయ్, అబుదాబి వంటి దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండడం గమనార్హం. ఈ ఐదు దేశాల తరువాత ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలను సైతం పర్యాటకంగా ఎంపిక చేసుకుంటున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 40 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో ఎక్కువ శాతం ఈ ఐదు దేశాలకు వెళ్లే వాళ్లు ఉండడం విశేషం. వింటర్ హాలిడేస్‌లో ఈ సంఖ్య మరో 10 వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.
డొమెస్టిక్ టూర్స్...
అంతర్జాతీయ ప్రయాణాలతో పాటు జాతీయ స్థాయి సందర్శన ప్రాంతాలకు సైతం ఫ్లైట్ ప్యాకేజీలకు డిమాండ్ బాగా పెరిగింది. కేరళ, అండమాన్, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ శాతం తరలి వెళ్తున్నారు. మహారాష్ట్రలోని పంచాగ్ని, కర్ణాటకలోని కూర్గ్, తమిళనాడలోని ఊటి, కొడైకెనాల్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు కాక్స్ అండ్ కింగ్స్ వెల్లడించింది. ఇక ప్రయాణికుల అభిరుచికి తగిన విధంగానే ట్రావెలింగ్ ఏజెన్సీలు ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. విమానప్రయాణంతో పాటు, రోడ్డు రవాణా, భోజనం, వసతి, సైట్‌సీయింగ్, తదితర అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాయి. యూరోప్ దేశాలకు రూ.లక్ష లోపే గ్రూపు ప్యాకేజీలను అందజేస్తున్నాయి.
ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు..
రైల్వే అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీ విమాన ప్రయాణాలను సైతం అందిస్తోంది. ‘పర్యాటక్ పర్వ్–2017’ లో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. వచ్చే జనవరి 26 నుంచి 4 రోజుల పాటు కొనసాగే దుబాయ్ టూర్‌లో భాగంగా ఒక ప్రయాణికుడికి రూ.59,814 ప్యాకేజీలో ఫ్లైట్ టిక్కెట్, వసతి, రోడ్డు రవాణా తదితర అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. వింటర్ టూర్‌లో భాగంగా వచ్చే నవంబర్ 17 నుంచి జనవరి 12వ తేదీ వరకు దశలవారీగా శబరి, కొచ్చిన్, గురువాయూర్ తదితర ప్రాంతాలకు ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఒక ప్రయాణికుడికి రూ.15,885 ప్యాకేజీలో అన్ని వసతులు కల్పిస్తారు. వచ్చే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు కొనసాగే సౌత్ గోవా టూర్ చార్జీ రూ.రూ.16,854 మాత్రమే. అహ్మదాబాద్, జూనాగఢ్, సాసన్‌గిర్ తదితర ప్రాంతాల సందర్శన కోసం మరో ప్యాకేజీని సిద్ధం చేశారు. ఇంలాంటి ప్యాకేజీలు మరెన్నో ఐఆర్‌సీటీసీ సిద్ధం చేసింది.
తరుచూ వెళ్తుంటా..
ఫ్లైట్ చార్జీలు ఇపుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు మంచి ప్యాకేజీలు అందజేస్తున్నాయి. ఇంటర్‌నేషనల్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా అందుబాటులో ఉండడంతో నేను కుటుంబంతో సహా రెగ్యులర్‌గా సింగపూర్, మలేషియా, దుబాయ్, గోవా, కొడైకెనాల్ ప్రాంతాలకు వెళ్తాను. – ప్రదీప్‌రెడ్డి
ఫ్లైట్ జర్నీ ఈజీ అయింది..
ఒకప్పటితో పోల్చుకొంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చాలా ఈజీ అయింది. గంటల తరబడి రైళ్లలో ప్రయాణం చేయడం కంటే ఫ్లైట్‌లో వెళ్లడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. గోవా, విశాఖ,ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు ట్రైన్ కంటే ఫ్లైట్ బెటర్. – నాగలక్ష్మి, లెక్చరర్
ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలకు బీమా కూడా ఉంది
పర్యాటకులకు అన్ని సదుపాయాలతో ప్యాకేజీలను అందజేస్తున్నాం. ఫ్లైట్ టిక్కెట్‌లతో పాటు, భోజనం, వసతి, రోడ్డు రవాణా, గైడ్స్ వంటి అన్ని సదుపాయాలు ఐఆర్‌సీటీసి అందజేస్తోంది. పైగా ప్రయాణికులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నాం. – సంజీవయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఐఆర్‌సీటీసీ
Comments
Please login to add a commentAdd a comment