బాబోయ్ కంపు
- చెత్త..చెత్తగా మారిన సిటీ
- సమ్మె విరమించని పారిశుద్ధ్య సిబ్బంది
- తీవ్రమవుతున్న సమస్య
- ఆందోళనలో నగరవాసులు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ చెత్తకుప్పగా మారింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరం దుర్గంధభరితమయింది. ఏడు రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారాయి. కాలనీలు కంపుకొడుతున్నాయి. రోగాలు ప్రబలుతున్నాయి. కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టంచేస్తున్నారు. సోమవారంతో కార్మికుల సమ్మె రెండవ వారంలోకి చేరుకోనుంది. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆదివారం పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం చేసి కార్మికులు నిరసన తెలిపారు.
పాతనగరంలో దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టగా...పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూసారంబాగ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ప్రజా ప్రతినిధులకు లక్షల్లో జీతాలు పెంచిన సర్కార్ రాత్రింబవళ్లు కష్టపడుతున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించిందన్నారు. కుత్భుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద కూడా కార్మికులు దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు. సనత్‌నగర్, అమీర్‌పేట్, బల్కంపేట్, శివార్లలోని యాప్రాల్ తదితర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, దుర్గంధంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కాగా రహమత్‌నగర్ డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు మహిళా కూలీలతో చెత్తను తరలిస్తుండగా.. రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బంది వారితో గొడవకు దిగారు. కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సదరు మహిళల చీపురు కట్టలని రెగ్యులర్ కార్మికులు తగులబెట్టారు. దీంతో కొద్దిసేపు ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ప్రత్యామ్నాయంగా..
కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం జీహెచ్‌ఎంసీకి చెందిన 466 వాహనాల్లో 1815 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరో 300 స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్లు నగరంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాయన్నారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో కార్మికులు సమ్మె విరమించాలని కోరారు.