► నిర్లక్ష్యపు పనులపై సీరియస్
► అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి రంగం సిద్ధం
► మానేరు రివర్‌ఫ్రంట్‌కు స్థలం గుర్తించాలని ఆదేశం
► నగరానికి ఓఎస్‌డీ నియామకానికి చర్యలు
► హాజరైన మంత్రి ఈటల, ఎంపీ వినోద్,ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ, మేయర్
► నేడు జిల్లా అధికారులతో సమావేశం
► మారనున్న కరీంనగర్ దశ
కరీంనగర్: ఉద్యమాల పురిటిగడ్డ.. టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన కరీంనగర్ జిల్లాపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మరోమారు దృష్టి సారించారు. జిల్లాకేంద్రాన్ని ఉత్తర తెలంగాణకే తలమాణికంగా చేయాలన్న తపనతో కోట్లాదిగా నిధులు వెచ్చిస్తున్నారు. అయితే అధికారుల సమన్వయం లోపంతో కోట్లు వెచ్చిస్తున్నా.. మూడేళ్లుగా అభివృద్ధి నత్తకునడక నేర్పినట్లే సాగుతోంది. జిల్లాకేంద్రంలో జరుగుతున్న నిర్లక్ష్యపు పనులపై సీఎం సీరియస్ అయ్యారు. బుధవారం జిల్లా అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
కరీంనగర్ మానేరు రివర్‌ఫ్రంట్ పనులను ప్రారంభించేందుకు సీఎంతో అపాయింట్‌మెంట్ కోసం మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టాటా కన్సల్టెన్సీ బృందం మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించారు. మూడేళ్లు గడిచినా పనుల ప్రగతి ఆశాజనకంగా లేకపోవడం, కరీంనగర్ సిటీని డెవలప్‌చేయాలన్న తన కోరిక నెరవేరకపోవడంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. వెంటనే శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్‌ను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌కు ప్రత్యేకంగా ఆఫీసర్ స్పెషల్‌డ్యూటీ (ఓఎస్‌డీ)ని నియమిస్తామని తెలిపారు.
ఓఎస్‌డీగా డీఎఫ్‌వో ఆంజనేయులును కేటాయించనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. నగరంలో ప్లాంటేషన్ పెంచేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని చెప్పిన ఆయన.. వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మానేరు రివర్‌ఫ్రంట్ ఏర్పాటు కోసం మానేరు చుట్టూ ఉన్న స్థలం, నగర పరిధిలో ఉన్న స్థలం ఎంత ఉంది..? అనేది స్పష్టంగా డాక్యుమెంట్లతో తీసుకురావాలని కలెక్టర్‌కు సూచించారు. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ సమస్య, ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు రెండేళ్లుగా అధికారుల సమన్వయలోపంతో ముందుకు కదలకపోవడం, ఇతర అభివృద్ధి పనులపై కూలంకశంగా చర్చించనున్నారు.
కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామన్నారు. జిల్లా సమీక్షకు పోలీస్ కమిషనర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్ అధికారులు, ఎలక్ట్రికల్ ఎస్‌ఈతో పాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెలే, ఎమ్మెల్సీ, మేయర్ హాజరుకానున్నారు. కరీంనగర్ దశను మార్చేందుకు సీఎం ఏర్పాటు చేస్తున్న సమీక్షరోజంతా జరగనున్నట్లు తెలిసింది. కరీంనగర్‌పై ప్రేమతో చేపడుతున్న ఈ సమీక్ష ద్వారా నగరానికి సీఎం వరాలజల్లు కురిపించడం ఖాయమని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఏదిఏమైనా కరీంనగర్‌పై సీఎం సమీక్ష తర్వాత అభివృద్ది పనుల్లో వేగం పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.