ఆ రెండు కాలేజీలపై మక్కువ ఎందుకో..? | college | Sakshi
Sakshi News home page

ఆ రెండు కాలేజీలపై మక్కువ ఎందుకో..?

Published Fri, Mar 6 2015 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

college

శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈనెల 11 నుంచి నిర్వహించనున్న డిగ్రీ పరీక్షల్లో వర్సిటీ అధికారులు 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం రెండు కళాశాలలకు మాత్రమే సెల్ఫ్ సెంటర్లను కేటాయించడంతో నాలుగు రోజులుగా విద్యార్థి సంఘాలకు, యూనివర్సిటీ అధికారులకు వివాదం తలెత్తింది. వర్సిటీ పరిధిలోని 120 కళాశాలల్లో కేవలం రెండు కళాశాలలకు సెల్ఫ్ సెంటర్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని విద్యార్థి సంఘాలు, మిగతా కళాశాలల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నా.. వర్సిటీ అధికారులు నోరు విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 రాయికల్‌లోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలంలోని గాయత్రి డిగ్రీ కళాశాలకు సెల్ఫ్ సెంటర్లు అలాట్ చేశారు. గాయత్రి కళాశాలలో గతేడాది వార్షిక పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరిగిందని ఆరోపిస్తూ మండలంలోని వేరొక కళాశాల లిఖితపూర్వకంగా మంత్రి కేటీఆర్‌కు విన్నవించింది.
 
 ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం జరిగిన సప్లమెంటరీ డిగ్రీ పరీక్షలకు సదరు కళాశాల సెంటర్‌ను వర్సిటీ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ వార్షిక పరీక్షలకు మళ్లీ సెల్ఫ్ సెంటర్‌ను ఇవ్వడంతో ఇటు విద్యార్థి సంఘాలు, ఇతర డిగ్రీ కళాశాలల నిర్వాహకులు వర్సిటీ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. గురువారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయిబాబా ఆధ్వర్యంలో వీసీ చాంబర్ ముందు బైఠాయించడంతో వర్సిటీ అధికారులు సంప్రదింపులు జరిపారు. సెంటర్ల కేటాయింపుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, విద్యార్థుల సంఖ్య  ఆధారంగానే సెంటర్లను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. పారదర్శకతను నిరూపించుకోవడానికి వర్సిటీ అధికారులతో విద్యార్థి సంఘ నాయకులు, మీడియా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించిన ఆనంతరం సెంటర్ల రద్దు విషయాన్ని ఆలోచిస్తామన్నారు. గురువారం సాయంత్రమే వర్సిటీ అధికారులు ఆయా సెంటర్ల పర్యవేక్షణకు వస్తామని చెప్పడంతో ఏబీవీపీ నాయకులు ఆయా సెంటర్స్‌కు చేరుకున్నారు. రాత్రి వరకు వర్సిటీ అధికారులు ఎవరూ రాయికల్, ఎల్లారెడ్డిపేట మండలాలకు రాకపోవడంతో అసలేం జరిగిందని అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించారు. క్షేత్రస్థాయి పర్యటనకు అధికారులు రాలేదని, సదరు కళాశాల యజమాన్యాలనే పరిపాలన విభాగానికి పిలుపించుకొని మంతనాలు జరిపినట్లు విద్యార్థి నాయకులు ఆరోపించారు. పారదర్శకత నిరూపించుకుంటామన్న వర్సిటీ అధికారులు ఎందుకిలా చేశారని పరీక్షల నియంత్రణ బోర్డు అధికారి భరత్‌ను సంప్రదించగా.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేసినట్లు ఆరోపించారు.
 
 బేషరతుగా రద్దు చేయాలి
 రాయికల్, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని డిగ్రీ కళాశాలల సెల్ఫ్ సెంటర్లను వర్సిటీ అధికారులు బేషరతుగా రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడు సాయిబాబా హెచ్చరించారు. ఆమ్యామ్యాలకు తలొగ్గి వర్సిటీ అధికారులు సెల్ఫ్ సెంటర్లు ఇచ్చారని ఆరోపించారు. ఆరునెలల నుంచి మాస్‌కాపీయింగ్, సెల్ఫ్ సెంటర్లు, విద్యా ప్రమాణాల విషయంలో వీసీ వీరారెడ్డికి, ఇతర అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement