– డిగ్రీ రెండో సెమిస్టర్ హిందీ ప్రశ్నాపత్రంలో సిలబస్‌లో లేని ప్రశ్నలు
– పరీక్షను వాయిదా వేసిన పరీక్షల విభాగం అధికారులు
ఎస్కేయూ : డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రశ్న పత్రాల్లో తరచూ తప్పులు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
హిందీ పరీక్ష వాయిదా :
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. పోయిట్రీ మూడో సెమిస్టర్‌లోనూ, ప్రోసన్ రెండో సెమిస్టర్‌లో సిలబస్‌ను ఖరారు చేశారు. అయితే రెండూ కలిపిన సిలబస్‌తో కూడిన ప్రశ్నపత్రాన్ని తాజాగా మంగళవారం జరిగిన పరీక్షలో విద్యార్థులకు అందజేయడంతో గందరగోళం నెలకొంది. పాఠ్యాంశాలకు విరుద్ధంగా ప్రశ్నలు రావడంతో విద్యార్థులకు దిక్కుతోచలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్షను మే 6న నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
గతంలోనూ ఇదే తంతు
ఇయర్లీ ఎగ్జామ్స్ (సాంవత్సరిక పరీక్షలు)ల్లోనూ ఇవే తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10న జరిగిన డిగ్రీ ఫైనలియర్ స్టాటిస్టిక్స్ ప్రశ్నప్రతంలో పూర్తీగా గణితం సిలబస్‌ను ఇచ్చారు. ఈ నెల 12న జరిగిన పేపర్–4 ప్రశ్నాపత్రం బదులు, మూడో పేపర్‌ను ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన కూడా నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షల్లో అయినా .. ఈ తప్పిదాలకు చోటు చేసుకోకుండా సజావుగా జరుగుతాయని భావించిన నేపథ్యంలో మళ్లీ తప్పులు పునరావృతం అయ్యాయి. సెమిస్టర్ పరీక్ష ప్రారంభంలోనే ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో (ఈ నెల 15న జరిగిన పరీక్ష) 15 మార్కులు సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. దీంతో విద్యార్థులు పూర్తీగా నష్టపోతున్నారు.
కాలం చెల్లిన విధానాలు
ప్రశ్నాపత్రం రూపకల్పనలో కాలం చెల్లిన విధానాలు అనుసరిస్తుండడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశ్నాప్రతం రూపకల్పన అనంతరం సంబంధిత సబ్జెక్టు బోర్డ్ ఆఫ్ స్టడీస్ , పరీక్షల డీన్ సమక్షంలో పరిశీలన జరగాలి. అనంతరం ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్‌కు పంపాలి. ఇలాంటి సాంప్రదాయం కొన్ని వర్సిటీలలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ అధ్యాపకుడు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని నేరుగా ప్రెస్‌కు పంపుతుండటంతో ప్రశ్నాపత్రాల్లో తప్పులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పశ్నాపత్రం తయారు చేసిన వారిదే తప్పు
సెమిస్టర్ పరీక్షలో సాంవత్సరిక సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. ఇది పూర్తీగా ప్రశ్నాపత్రం తయారు చేసిన వారి తప్పిదమే. అందుకే పరీక్షను వాయిదా వేశాము. తిరిగి 6న హిందీ పరీక్ష నిర్వహిస్తాం.
– ఆచార్య రెడ్డివెంకటరాజు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్