Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు | Year Ender 2024 know the Big Mistakes Made in the Past Year | Sakshi
Sakshi News home page

Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు

Published Sun, Dec 29 2024 8:00 AM | Last Updated on Sun, Dec 29 2024 9:26 AM

Year Ender 2024 know the Big Mistakes Made in the Past Year

కొద్ది రోజుల్లో 2024 ముగిసి 2025 రాబోతుంది. 2024 మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వాటిని ఇ‍ప్పుడొకసారి గుర్తు చేసుకుంటే, భవిష్యత్‌లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడగలుగుతాం.  

1. వాటర్‌ హీటర్‌  షాక్‌తో మహిళ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఏడాది నవంబర్‌లో వాటర్‌ హీటర్‌  కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది.

తప్పు ఎక్కడ జరిగింది?
కరెంట్‌ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో పాటు నీళ్లలో చేయి వేయడం ఆ మహిళ తప్పిదమే. ఫలితంగా ఆమె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.

గ్రహించాల్సిన విషయం
వాటర్‌ హీటర్‌ వినియోగించాక స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. హీటర్‌ రాడ్‌ను నీటిలో నుండి తీసివేయాలి. ఆ తర్వాతనే ఆ వేడి నీటిని వినియోగించాలి

2. రూమ్ హీటర్ కారణంగా వృద్ధురాలు మృతి 
2024, నవంబర్‌లో యూపీలోని మీరట్‌లోని ఒక ఇంటిలోని బెడ్‌రూమ్‌లో ఒక వృద్ధ మహిళ మృతదేహం కనిపించింది. ఆమె రూమ్ హీటర్ ఆన్ చేసి పడుకుంది.

జరిగిన తప్పిదం ఏమిటి?
ఆ వృద్ధురాలు హీటర్ స్విచ్ ఆన్ చేసి, గది తలుపులు వేసుకుని పడుకుంది. రూమ్ హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడడంతో దానినే ఆమె పీల్చుకుంది. ఫలితంగా ఆమె మరణించింది.

గ్రహించాల్సిన విషయం
గదిలోని హీటర్‌ ఆన్‌చేసి, తలుపులు వేసుకుని ఎప్పుడూ నిద్రపోకూడదు. హీటర్‌ను  రెండు గంటల కంటే ఎక్కువసేపు ఆన్‌లో ఉంచకూడదు.

3. ప్రెషర్ కుక్కర్‌ పేలి బాలికకు గాయాలు
ఈ ఏడాది జూలైలో యూపీలోని శ్రావస్తి జిల్లాలో ప్రెషర్ కుక్కర్ పేలడంతో 11 ఏళ్ల బాలిక గాయపడింది.

ఏమి తప్పు జరిగింది?
ప్రెషర్ కుక్కర్‌లో పేలుడు సంభవించడానికి కారణం రబ్బరు సరిగా అమర్చకపోవడం లేదా విజిల్ పాడైపోవడం కారణమై ఉంటుంది.

నేర్చుకోవాల్సిన విషయం
కుక్కర్‌ని ఉపయోగించే ముందు  రబ్బరు, విజిల్, సేఫ్టీ వాల్వ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

4. గీజర్ కారణంగా నవ వివాహిత మృతి
2024 నవంబర్‌లో యూపీలోని బరేలీలో కొత్తగా పెళ్లయిన ఓ మహిళ బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌లో ఉంచి స్నానం చేస్తోంది. అదేసమయంలో ఉన్నట్టుండి గీజర్ పేలిపోయింది.

ఏం తప్పు జరిగింది?
చాలాకాలంగా ఆ గీజర్‌కు సర్వీస్‌ చేయించలేదు.

నేర్చుకోవాల్సినది
గీజర్‌ను చాలాకాలంపాటు వినియోగించకుండా ఉంటే, దానిని సర్వీస్‌ చేయించిన తరువాతనే వినియోగించాలి.

5. గ్యాస్ సిలిండర్ పేలుడు
2024, మార్చిలో పట్నాలో ఓ పెళ్లి వేడుకలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి.

ఏం తప్పు జరిగింది?
గ్యాస్‌ సిలిండర్‌ పేలిన సందర్భాల్లో సరైన నిర్వహణ లేకపోవడమే కారణం.

నేర్చుకోవలసినది ఏమిటి?
సిలిండర్‌ను ఎప్పుడూ నిలబెట్టి ఉంచాలి. దానిని పడుకోబెట్టి ఉంచకూడదు. దాని వాల్వ్‌ ఎప్పుడూ పైకి ఉండాలి. అలాగే సిలిండర్‌ను గాలి తగిలే ప్రాంతంలో ఉంచాలి. కిటికీలు, తలుపులు మూసివున్న ప్రాంతంలో ఉంచకూడదు.

6. మొబైల్ ఛార్జర్ కారణంగా బాలిక మృతి
తెలంగాణలో విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె మొబైల్ ఛార్జర్‌ని ఆన్‌లో ఉంచి ఫోను వినియోగించింది. ఫలితంగా ఆమె విద్యుత్‌ షాక్‌నకు గురయ్యింది.

ఏం తప్పు జరిగింది?
విద్యుత్‌ ఛార్జర్‌ను విద్యుత్‌ సాకెట్‌లో పెట్టి, ఫోను వినియోగించడం వలన అది విద్యుత్ షాక్‌కు దారితీస్తుంది.

మనం నేర్చుకోవల్సినది ఏమిటి?
ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచి ఎప్పుడూ ఉపయోగించకూడదు.

7. పవర్ బ్యాంక్ కారణంగా చెలరేగిన మంటలు
ఈ ఏడాది అమెరికాలోని ఒక ఇంటిలో ఒక శునకం పవర్ బ్యాంక్ నమలడంతో  దాని నుంచి మంటలు చెలరేగాయి.

ఏం తప్పు జరిగింది?
చాలా పవర్ బ్యాంకులు ఓవర్ హీట్ అయినప్పుడు పేలే అవకాశం ఉంది.

మనం నేర్చుకోవలసినది
పవర్ బ్యాంక్‌ను చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.

8. డీజే సౌండ్‌కు చిన్నారి మృతి
ఈ ఏడాది భోపాల్‌లో డీజే శబ్దానికి ఓ చిన్నారి మృతి చెందింది.

ఏం తప్పు జరిగింది?
డీజే నుంచి వచ్చే ధ్వని మనిషి వినికిడి సామర్థ్యం కంటే 300 రెట్లు ఎక్కువ.

దీని నుంచి నేర్చుకోవలసినది
ఎల్లప్పుడూ లౌడ్ స్పీకర్లకు అత్యంత సమీపంలో  నిలబడకూడదు.  అటువంటి సందర్బాల్లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్‌లను ఉపయోగించాలి.

9. జాబ్ ఆఫర్ పేరుతో మోసం
ఈ ఏడాది నవంబర్‌లో పంజాబ్‌లోని మొహాలీలో టెలిగ్రామ్‌లో జాబ్‌ ఆఫర్‌ పేరుతో ఒక ముఠా మోసానికి పాల్పడింది. ఓ యువకుడి నుంచి రూ.2.45 లక్షలకు పైగా మొత్తాన్ని వసూలు చేసింది.

ఏం తప్పు జరిగింది?
ఆ యువకుడు ఆ జాబ్‌ ఆఫర్‌ను గుడ్డిగా నమ్మాడు. వాళ్లు అడిగినంత మొత్తం చెల్లించాడు.

దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం
ఉద్యోగం పేరుతో ఎవరైనా మీ నుండి డబ్బు డిమాండ్ చేస్తుంటే, అటువంటి ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.

10. కారు లాక్ కావడంతో మూడేళ్ల బాలిక మృతి
2024 నవంబర్‌లో యూపీలోని మీరట్‌కు చెందిన మూడేళ్ల బాలిక ఒక కారులో నాలుగు గంటలపాటు లాక్‌ అయిపోయింది. ఫలితంగా ఊపిరాడక ఆ చిన్నారి మృతిచెందింది.

ఏం తప్పు జరిగింది?
కారు డోరు లాక్‌ కావడంతో దానిలోని ఆక్సిజన్ లెవల్ తగ్గింది. కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగింది. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందింది.

నేర్చుకోవలసిన అంశం
కారులో పిల్లలను ఉంచి బయటకు వెళ్ల కూడదని గుర్తించాలి.

ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement