ఒంగోలు మెట్రో: పీజీ పరీక్షలు వారం రోజులు ముందుకు జరిపి నిర్వాకం ప్రదర్శించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు ఇప్పుడు ఏకంగా డిగ్రీ పరీక్షలు రాస్తుండగానే రద్దు చేసి మరో సంచలనానికి కారణమయ్యారు. కరోనా కష్టకాలంలో అసలే రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలూ పడి కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ అధికారుల తీరు కన్నీరు పెట్టించింది. ఏకాగ్రతతో పరీక్ష రాస్తున్న సమయంలో కేంద్రాల నిర్వాహకులు ఓఎంఆర్ షీట్‌లు లాగేసుకుంటుంటే చేష్టలుడిగి చూడటం విద్యార్థుల వంతైంది. యూనివర్సిటీ పరీక్షాధికారుల తప్పిదం వల్ల జిల్లాలో వేలాది మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు తీవ్ర అవస్ధలు పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్న పరీక్షలనైనా ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన అధికారులు తీవ్ర అలసత్వంతో నిర్వహిస్తూ పరీక్షల ప్రక్రియనే అపహాస్యం చేశారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. (అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు)
పశ్చిమ ప్రకాశంలో గంట గడిచాక..
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు కరోనా కారణంగా ఆగిపోగా, తిరిగి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రీ–షెడ్యూల్ చేశారు. గత వారంలో డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థులకు గత వారం పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15 సోమవారం బీకాం విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్, బీఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్ష నిర్వస్తున్నారు. జిల్లాలో చీరాల, కంభం, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు తదితర పదికి పైగా కేంద్రాల్లో వేలాదిమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
కరోనా కారణంగా రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలు పడి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులు యథాతధంగా పరీక్ష రాస్తుండగా, ఆయా కేంద్రాల నిర్వాహకులు పరీక్ష రద్దయిందంటూ జవాబు పత్రాలు లాక్కుంటుండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. కంభం, గిద్దలూరు, మార్కాపురం తదితర కేంద్రాల్లో విద్యార్థులు సగానికి పైబడి పరీక్షను పూర్తి చేశారు. ఇక ఒంగోలులోని పలు కేంద్రాల్లో విద్యార్థులు గంటకు పైగా పరీక్ష రాసేశారు. ఒంగోలులో నోడల్ కాలేజీ నుంచి పరీక్ష రద్దయిందంటూ సమాచారం వచ్చిందని పేపర్లు లాగేసుకున్నారు. దీంతో విస్తుపోవటం విద్యార్థుల వంతయింది.
మారని అధికారుల తీరు..
జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఒంగోలులో ఒక పరిపాలనా కార్యాలయం పెట్టమని, ఎప్పటికప్పుడు తగిన విధంగా సమాచారం ఇవ్వమని దశాబ్దాలుగా జిల్లా విద్యార్థులు, యాజమాన్యాలు ఎంత మెరపెట్టుకుంటున్నప్పటికీ, నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో ఎంపిక చేసిన నోడల్ కాలేజీలు సైతం యూనివర్సిటీకే లేదు. తమకెందుకు బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక డిగ్రీ విద్యను పట్టించుకోవాల్సిన రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎప్పుడో చుట్టపుచూపుగా తప్ప జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుత పరీక్షల నిర్వహణలో అయితే పరీక్షల పరిశీకులు, స్క్వాడ్ మెంబర్లుగా ప్రభుత్వ, ఎయిడెడ్ లెక్చరర్లుని నియమించాల్సిన అధికారులు తమకు తెల్సిన ఒకరిద్దరు ప్రవేటు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకున్నారు.
కనిపించని సమన్వయం..
జిల్లాలో 200 డిగ్రీ కళాశాలలు, 60కి పైగా పీజీ కళాశాలలు, మరో 60 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతియేటా పాతిక వేలమందికి పైగా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరి కోర్సుల నిర్వహణ, పరీక్షలు, మూల్యాంకనం తదితర అంశాల్లో జిల్లాకు చెందిన అధ్యాపకుల, యాజమాన్యాల సమన్వయం లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో జిల్లా నుంచి కనీసం ఒక్కరిని కూడా నియమించలేదు. తద్వా రా జిల్లాలోని డిగ్రీ, పీజీ, బీఈడీ విద్య నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కనీసం సవతితల్లి ప్రేమనైనా చూపడం లేదు. దీంతో విద్యా ర్థులు, కాలేజీల నిర్వాహకుల అవస్థలు వర్ణనాతీతం. ఇటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే సోమవారం పరీక్షను గంట ముందు రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. (శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్)
18న మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం
గుంటూరులో వర్షం కారణంగా సెప్టెంబర్ 15 సోమవారం రద్దు చేసిన పరీక్షను సెప్టెంబర్ 18న నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ పరీక్షల అదనపు నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, పరీక్షల సమన్వయకర్త కె.మధుబాబు తెలిపారు. ఇక రీ–షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న పరీక్షలను యథాతధంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు.
– ఎఎన్‌యూ పరీక్షల విభాగం
Comments
Please login to add a commentAdd a comment