- పన్సారే సంతాప సభలో వామపక్ష నేతల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఎన్డీఏ పాలనలో ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి ముప్పు ఏర్పడిందని పది వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించినందుకు, ప్రశ్నించినందుకు ప్రాణాలు తీసే దుర్మార్గ పరిస్థితులు దేశంలో నెలకొంటున్నాయని ఆవేదన వెలిబుచ్చాయి. కార్మిక నాయకుడు, మూఢవిశ్వాసాల వ్యతిరేక ఉద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు గోవింద్ పన్సారే(మహారాష్ట్ర) దారుణ హత్యకు నిరసనగా మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో సభ నిర్వహించారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితోపాటు వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకట్రామయ్య(న్యూడెమోక్రసీ), గోవర్దన్(చంద్రన్న వర్గం), బండ సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), జానకీరాములు(ఆర్‌ఎస్‌పీ), భూతం వీరన్న(సీపీఐ ఎంఎల్), ఉదయకిరణ్(లిబరేషన్), సుధీర్(ఎస్‌యూసీఐ) తదితరులు పాల్గొన్నారు. సురవరం మాట్లాడుతూ.. 33 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ లౌకికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేదిశగా అడుగువేస్తోందని ధ్వజమెత్తారు. తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిపై దాడులు చేస్తోందనడానికి పన్సారే హత్యే నిదర్శనమన్నారు.