హిందూ దేవతలను అవమానించారని..
హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్‌పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హిందూ దేవతలను కించపరిచేలా చిత్రీకరించిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. హిందూ దేవతలు తన జేహెచ్ సెలూన్‌లో క్షవరం చేయించుకుంటున్నట్లు ప్రకటనలు ఇచ్చిన జావేద్ హబీబ్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. సైదాబాద్ ఎస్‌ఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన న్యాయవాది కె కరుణసాగర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అడ్మిన్ ఎస్సై వెంకటేశ్వరరావు స్పందిస్తూ... ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థి కుమార్ సాగర్ కూడా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరిచి, తమ మనోభావాలను దెబ్బతీసిన జావేద్ హబీబ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన జనరల్ డైరీ(జీడీ)లో నమోదు చేశామని, న్యాయ సలహా తీసుకుంటున్నామని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ ఇన్స్‌పెక్టర్ ఎస్. చంద్రకాంత్ తెలిపారు.
కోల్‌కతా దినపత్రికలో తమ సంస్థ ఇచ్చిన వాణిజ్య ప్రకటనపై విమర్శలు రావడంతో జావేద్ హబీబ్ క్షమాపణ చెప్పారు. తమ అనుమతి లేకుండా భాగస్వామ్య సంస్థ ఈ ప్రకటన ఇచ్చిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కొంతమంది స్థానికులు ఈ ప్రకటన ఇచ్చారని, దీన్ని వెంటనే మీడియా నుంచి తొలగించామని జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రకటన కారణంగా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని వేడుకుంది.