
‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ ఎంట్రీల పరిశీలన పూర్తి
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు సాక్షి మీడియా గ్రూప్ అందించే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్–2016’ ఎంట్రీల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. వరుసగా మూడోసారి నిర్వహిస్తున్న ఈ పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 8 విభాగాల్లో వచ్చిన ఎంట్రీలను సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో గురువారం జ్యూరీ సభ్యులు పరిశీలించారు.
ఎక్సలెన్సీ ఇన్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్సీ ఇన్ హెల్త్‌కేర్, ఎక్సలెన్సీ ఇన్ సోషల్ డెవలప్‌మెంట్, ఎక్సలెన్సీ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్– లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్– స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్స్ ఆఫ్ ది ఇయర్– ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్స్ ఆఫ్ ది ఇయర్– సోషల్ సర్వీస్ ఎంట్రీలను... జ్యూరీ సభ్యులైన ఫ్యాప్సీ మాజీ అధ్యక్షుడు దేవేంద్ర సురాన, ఫ్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు, ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత శాంతాసిన్హా, ఐఐఐటీ శాస్త్రవేత్త శ్యాంసుందర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, డాక్టర్ ప్రణతిరెడ్డి పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... వివిధ రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులను గుర్తించి ఎక్సలెన్సీ అవార్డులు ఇస్తూ సాక్షి మీడియా చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. అనంతరం సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రాణిరెడ్డి... జ్యూరీ సభ్యులకు జ్ఞాపికలిచ్చి సత్కరించారు. త్వరలోనే ఈ అవార్డులను ప్రకటిస్తారు.