
ఘనత 'గౌరవం' గుర్తింపు
స్ఫూర్తి సారథులకు సాక్షి సలామ్
ఘనతకు గౌరవం, గుర్తింపు.. ‘సాక్షి’ అవార్డు! సమాజంలోని వివిధ రంగాలలో అత్యుత్తమమైన సేవలు అందిస్తున్న వారికి ఏటా ఇస్తున్నట్లే
ఈ ఏడాది కూడా సాక్షి మీడియా గ్రూపు.. ‘ఎక్సలెన్స్’ అవార్డులు ప్రదానం చేసింది. ఆ స్ఫూర్తి సారథులలో కొందరి విజయగాథలు మీ కోసం.
తెలుగు శిఖరం: దాసరి నారాయణరావు
దాసరి... ఓ దార్శనికుడు. నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రామికుడు. సమాజంలో సమస్యలపై సినిమాల ద్వారా బాణాలు సంధించిన సైనికుడు. మాటలతో మనకు మంచి బోధించిన మార్గదర్శకుడు. ఎందరో (ఏకలవ్య) శిష్యులు, దర్శకులకు గురువుగా నిలిచిన నిలువెత్తు శిఖరం. ప్రతిభావంతులు ఎందరికో నీడ ఇచ్చిన ‘దర్శక’ శిఖరం. దాసరి ప్రయాణం నవతరం దర్శకులకు పాఠం. ఆయన దర్శకుడు మాత్రమే కాదు మాటల రచయిత, పాటల రచయిత కూడా. 150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి సుమారు 250 చిత్రాలకు మాటలు, అనేక సినిమాల్లో పాటలు రాశారు. దాసరి ప్రతిభ అంత వరకేనా? కాదండోయ్! ఆయన నటుడు, నిర్మాత కూడా. తెలుగుకు మాత్రమే దాసరి పరిమితం కాలేదు. హిందీలోనూ దర్శకునిగా సత్తా చాటారు. తమిళ, కన్నడ సినిమాల్లో నటునిగా మెరిశారు. దాసరిది ఘనచరిత్ర... ప్రతిభకు చేయూత ఇచ్చిన చరిత.
శిఖరం దేనికీ తలొంచి ఎరగదు. కానీ ‘దర్శక’ శిఖరం దాసరి ఒక్కదాని ఒక్కదాని ముందు ఎప్పుడూ తలొంచారు. దర్శకునిగా ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచి ఆ ఒక్కదాని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ ఒక్కటి... కథ, సినిమా కథ. తాను రాసిన కథ ఎవర్ని కోరితే వాళ్లతోనే సినిమాలు తీసిన దర్శకుడు దాసరి. తొలి సినిమా ‘తాతా మనవడు’ నుంచి మొదలుపెడితే తాజా ‘ఎర్ర బస్సు’ వరకు ఆయన దారి మార్చుకోలేదు. రెండు తరాల అగ్ర నటులతో, హీరోలతో పని చేశారాయన. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలతో పాటు తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు తీశారు. స్టార్ దర్శకునిగా పేరొచ్చిన తర్వాత కొత్త నటీనటులతో, తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమాలు తీయడానికి వెనుకాడలేదు. కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు.
తొలి సినిమా ‘తాతా మనవడు’లో ‘అనుబంధం అత్మీయత అంతా ఓ బూటకం’ అంటూ కన్నకొడుకు నిరాదరణకు గురైన తల్లిదండ్రల ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు. స్వర్గం–నరకం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను వంటి సినిమాల్లో ప్రేక్షకుల హృదయపు లోతుల్లో తడిని తట్టి లేపారు. దాసరి ఫ్యామిలీ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ‘తాండ్ర పాపారాయుడు‘, ‘బొబ్బిలి పులి‘, ‘సర్దార్ పాపారాయుడు‘ వంటి కమర్షియల్ సినిమాలతో గర్జించారు. ‘ప్రేమాభిషేకం‘, ‘మజ్ను‘ సినిమాల్లో ప్రేమను ప్రేక్షకులకు చూపారు. ‘ఒసేయ్ రాములమ్మ’లో సమాజంలో అసమానతలను ఎత్తి చూపారు. ఈ సినిమాలు దాసరి తీసిన ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ ఇలా ఎన్నో ఎన్నెన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారాయన. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు సలాం చేశాయి.
నేపథ్యం: ‘దర్శకరత్న’ దాసరి 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. బి.ఎ. చదివారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పోటీల్లో పాల్గొన్నారు. బహుమతులు గెలుచుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకునిగా దాసరి లిమ్కా వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. మేఘ సందేశం (1983), తాండ్ర పాపారాయుడు (1986), సూరిగాడు (1992), కంటే కూతుర్నే కను (2000) వంటి చిత్రాలు దర్శకుడిగా దాసరికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఆశాజ్యోతి’, ‘ఆజ్ కా ఎమ్మెల్యే’, ‘రామ్ అవతార్’ చిత్రాలలో రాజేశ్ ఖన్నాను దాసరి విలక్షణమైన భిన్న పాత్రల్లో చూపించారు. నటులు మోహన్‌బాబు, ఆర్.నారాయణమూర్తి, దర్శకులు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి ఇంకా పలువురు సాంకేతిక నిపుణుల్ని దాసరే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
రాజకీయాలు: దాసరి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు.
మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ (ఫిమేల్): హారిక
ఆమె చిన్నప్పుడు నిద్రపోతే కలలన్నీ బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉండేవి. రెక్కల గుర్రాల కన్నా రూక్, బిషప్‌ల కదలికల పట్లే కళ్లు విప్పార్చి చూసేది. రాకుమారి కథల కంటే యుద్ధ వ్యూహమంటేనే ఆసక్తి కనబర్చేది. అందుకే పదమూడేళ్లకే చెస్‌లో గ్రాండ్ మాస్టర్ అయింది. ఎస్... ద్రోణవల్లి హారిక గురించే ఇప్పుడు చెప్పింది. చదరంగాన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్న ఈ అమ్మాయి కల, కథ, కల్పన, వాస్తవం.. అన్నీ చదరంగమే! ఆ ఆటలో గెలుపు అనేది ఆమెకు సర్వసాధారణం అయిపోయింది. ట్రోఫీలు, టోర్నీలు.. చాంపియన్‌షిప్స్ జీవితంలో భాగమయ్యాయి..
1991లో గుంటూరులో పుట్టింది హారిక. నిజానికి హారిక అక్కను చెస్ ప్లేయర్ చేయాలనేది ఆమె తండ్రి ఆశ, ఆశయం. రోజూ అక్కకు తోడుగా చెస్ క్లాసెస్‌కు వెళ్తుండేది హారిక. వెళ్లడమే కాదు ఆ స్టెప్స్‌నూ అంతే వేగంగా గ్రహించింది. చిన్న కూతురి ఆసక్తి గమనించిన తండ్రి హారికనూ ప్రోత్సహించడం మొదలుపెట్టడం. చెస్ అంటే ప్రాణమైపోయింది ఆ పిల్లకు. దాంతో ఏడేళ్లకే చదువును పక్కన పెట్టి అండర్ నైన్, అండర్ టెన్ చాంపియన్ టోర్నీల్లో పాల్గొంది. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయింది. విశ్వనాథన్ ఆనంద్, క్రామ్నిక్, జుడిట్ పోల్గర్‌లు ఆమె రోల్ మోడల్స్. పబ్లిసిటీకి దూరంగా సింప్లిసిటీని ఇష్టపడే హారిక ఇప్పటి వరకు 16 నేషనల్ మెడల్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. 2004లో ఉమన్ గ్రాండ్‌మాస్టర్ గెల్చుకుంది. 2007లో ఇంటర్నేషనల్ మాస్టర్, 2011లో గ్రాండ్‌మాస్టర్ సాధించింది. అర్జున అవార్డునూ అందుకుంది. ‘ఎవరి నుంచయినా స్ఫూర్తి పొందొచ్చు’ అని చెప్పే హారికకు ఇంటి వంట అంటే చాలా ఇష్టం.
► హారికను చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా తాము ప్రోత్సహిస్తూనే ఉన్నాం. తనకు ఏది కావాలో అది ఇస్తూనే అండగా ఉన్నాం. ఇప్పుడు చెస్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని మమ్మల్ని తలెత్తుకునేలా చేసింది. మా అమ్మాయిని గుర్తించి ’సాక్షి’ అవార్డు ఇవ్వడం ఆనందదాయకంగా ఉంది.
- రమేష్, స్వర్ణలు , హారిక తల్లిదండ్రులు
ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ సర్వీస్: కాగిత భాస్కర్‌రావు
తన కాళ్ల మీద తాను నిలబడితే గొప్పేం లేదు. కాని ఇతరులను నిలబెడితేనే గొప్ప. అది చేసి చూపించారు కాగిత భాస్కరరావు. విధి తన పట్ల చూసిన చిన్నచూపును ఇతరుల జాలిగా మలచుకోలేదు. సవాల్‌గా తీసుకున్నారు. మదర్ థెరిసా మాటలతో స్ఫూర్తి పొందారు. భారతి వికలాంగుల సేవా సమితిని స్థాపించారు. ఫిజికల్లీ చాలెంజ్డ్‌కి సేవలందిస్తున్నారు.
కాగిత భాస్కరరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం గొల్లగూడెం. కాగిత దాసయ్య, దీనమ్మ తల్లిదండ్రులు. 1965, జూన్ 15న పుట్టారు. పుట్టిన రెండేళ్లకు రెండు కాళ్లకు పోలియో సోకింది. నిరుపేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల మధ్యే పెరిగి కష్టపడి ఇంటర్మీడియేట్ వరకు చదివి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు భాస్కరరావు. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా వైకల్యం వెక్కిరించింది. చివరకు రైల్వేస్‌లో ఉద్యోగం దొరికింది. గుంటూరులో నియామకం. పుస్తకాలు చదవడమంటే ఆసక్తి ఉన్న భాస్కరరావు ఒకసారి మదర్‌థెరిసా గురించి చదువుతున్నారు. ఆమె చెప్పిన ‘ప్రార్థించే పెదవులు కన్నా సేవలందించే చేతులు మిన్న’ అన్న మాట ఆయనను చాలా ప్రభావితం చేసింది. ఏదైనా చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఏ ఊతమూ అందని తనలాంటి వాళ్లెందరో మెదిలారు. ‘భారతి వికలాంగుల సేవా సమితి’ని ఏర్పాటు చేశారు. వికలాంగుల సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలనే నిశ్చయంతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు.
వీళ్ల కోసం గొల్లగూడెంలోనే ఓ బడిని ప్రారంభించారు. స్పెషల్ వొకేషన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. భారతీ వికలాంగుల సేవా సమితి లాంకో ఫౌండేషన్ సహాయంతో ఇప్పటి వరకు దాదాపు 2000 ఆర్టిఫీషియల్ లెగ్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, క్రచెస్‌ను అందించింది. స్కూల్ ద్వారా కంప్యూటర్ ట్రైనింగ్, డిజిటల్ క్లాసెస్‌ను నిర్వహిస్తోంది. వీళ్ల కోసం ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ కెరీర్‌గైడెన్స్ సెంటర్‌నూ నిర్వహిస్తోంది. ఉచితంగా హాస్టల్ వసతీ కల్పిస్తోంది. అంతేకాదు మెడికల్ క్యాంప్స్‌ను పెడుతోంది. చాలెంజ్డ్ పీపుల్ కోసం సామూహిక వివాహాలూ జరిపిస్తోంది. చలివేంద్రాలు పెడుతోంది. విథి అనాథల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్నీ చేపడుతోంది. తన సేవలను ఇంతటితో ఆపలేదు. 2016లో పిల్లల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల కోసం ఓల్డేజ్ హోమ్‌ను స్థాపించారు భాస్కర రావు. ‘నా చివరి శ్వాస వరకూ ఇదే పనిలో ఉంటాను’ అని చెప్తారు కాగిత భాస్కర రావు.
►వికలాంగుడికి ఈ సమాజంలో ఏదీ కష్టం కాదనేది నా ధృడసంకల్పం. ఆ సంకల్పంతోనే నేను సామాజిక సేవలోకి వచ్చాను. ఈ రోజు ’సాక్షి’ ఇచ్చిన ఈ అవార్డు నాలో మరింత బలాన్ని, నమ్మకాన్ని, ప్రోత్సాహాన్ని చేకూర్చుతుంది.
ఇంకా సాధించాల్సింది చాలా ఉంది.
ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్: బన్ను ఆరోగ్య సేవా సమితి
జయశంకర్ జిల్లాలోని ఏటూరునాగారంలో నెలకొని ఉన్న బన్ను హాస్పిటల్స్ తన చుట్టుపక్కల ఉన్న ఐదు మండలాల్లోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూపొందింది. సుదూర ప్రాంతాల్లో వైద్యం అందని ప్రజలకు ఉచిత మొబైల్ క్లినిక్‌ల ద్వారా సంచారవాహనాలను పంపించి చికిత్స అందిస్తోంది. ఈ సంస్థ నెలకొని ఉన్న ప్రాంతం నుంచి 100 కి.మీ. పరిధిలో రెండు లక్షల మంది ప్రజలలో చాలా మందికి ఉచితంగానూ, మరికొంత మందికి చాలా చవకగానూ ఆరోగ్య సేవలు అందించడం మొదలైంది. మునుపు ఈ ప్రాంతాల వారు వైద్యచికిత్స కోసం వెళ్లాలంటే ఏన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ సేవల వల్ల గతంలో ఎంతో దూరం ప్రాయాణించాల్సి వచ్చే ఇక్కడి గర్భిణులు ఇప్పుడు రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి వైద్య సేవలకు దగ్గరయ్యారు.
గతంలో రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వేలాది మంది పిల్లలకు మంచి వైద్యం చేరువయ్యింది. సమాజంలోని అణగారిని వర్గాల వారెందరికో వైద్యసదుపాయాలు చేరువయ్యాయి. ఈ సంస్థ నిర్వహించే స్పెషల్ స్కూల్ కారణంగా మానసిక వికాసం సరిగా లేని చాలా మంది పిల్లలకు మూడేళ్ల నుంచి విద్య, జీవన శిక్షణలు లభిస్తున్నాయి. బన్ను గార్మెంట్స్ పేరిట నిర్వహిస్తున్న సంస్థ ద్వారా స్వయం ఉపాధి, నైపుణ్యాల శిక్షణలు లభ్యమవుతున్నాయి. ఇక తన బన్ను హాస్పిటల్ సేవల ద్వారా గత ఏడాది ఈ సంస్థ 19,500 మందికి పైగా ఔట్‌పేషెంట్స్‌కూ, 4,200 మంది ఇన్‌పేషెంట్స్‌కూ తన సేవలు అందించింది. ఈ సంస్థ నిర్వహించిన వివిధ మెడికల్ క్యాంప్‌ల ద్వారా 8,500 మందికి పైగా పేషెంట్లు ఉచిత ల్యాబ్ పరీక్షల సౌకర్యంతో పాటు ఉచిత వైద్య సౌకర్యాలను పొందారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడూ, ఛైర్మన్ అయిన డాక్టర్ చరణ్‌జిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. ఉచిత సదుపాయాలతో పాటు సబ్సిడీ ప్రాతిపదికన నడుస్తున్న ఈ సంస్థ చేస్తున్న వ్యయంలో లోటును డాక్టర్ చరణ్‌జిత్ రెడ్డి భర్తీ చేస్తూ ఈ సంస్థను నడిపిస్తున్నారు.
► బన్ను ఆరోగ్యసేవా సమితి మానసిక వికలాంగులకు ప్రత్యేక శిక్షణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్యసేవలు మూడేళ్లుగా అందిస్తుంది. మాతాశిశు మరణాలను అరికట్టేందుకు తగిన కషి చేస్తుంది. మా సేవలకు కేవలం గుర్తింపు ఈ అవార్డు అనే అనుకోవడం లేదు, ఇంకా మేము సేవలను పెంచేందుకు, ఆ అవార్డు మాలో మరింత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నింపింది. – సరిత, బన్ను ఆరోగ్యసేవా సమితి
మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ (మేల్): సాకేత్
రాముడి పేరు పెట్టుకున్న సాకేత్ రాకెట్ కూడా రాముడి విల్లంత పవర్‌ఫుల్. రామబాణం ఎలా తిరుగులేనిదో సాకెత్ రాకెట్ సర్వీస్ కూడా అంతే తిరుగులేనిది. ఆ ప్రత్యేకతే గ్రాండ్‌శ్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ బరిలో నిలబెట్టింది సాకేత్‌ని. గ్రాండ్‌శ్లామ్‌కు వెళ్లిన తొలి తెలుగు ఆటగాడిగా టెన్నిస్ చరిత్రలో పేరు నమోదు చేసింది. సాకేత్ పుట్టింది 1987, అక్టోబర్ 19న ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లాలోని ఉయ్యూరులో. పెరిగింది విశాఖపట్టణంలో. ప్రస్తుతం ఉంటున్నది అమెరికా కనెక్టికట్‌లోని గ్రీన్‌విచ్ సిటీలో. వీళ్లదేమీ ఆటల నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఆ ఇంట్లో సాకేతే మొదటి ఆటగాడు. ఆటలంటే కొడుకుకున్న ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు అతనిని ప్రోత్సహించారు. అలా సాకేత్ తన పదకొండవయేట టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు.
విశాఖపట్టణంలో జూనియర్స్ లీగ్‌లో ఆడడం మొదలుపెట్టాడు. సాకేత్ ఆటను ఇంకా సానబెట్టేందుకు అతని కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది. 2016లో యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్నాడు. అదే యేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల క్వాలిఫైయింగ్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఈ యేడాదిలోనే తన కెరీర్‌లోనే బెస్ట్ సింగిల్స్ సాధించాడు. ప్రపంచ 137 వ ర్యాంక్‌ను పొందాడు. ఇదే యేడాది డేవిస్ కప్ సెమీ ఫైనల్‌లో ఉత్తర కొరియా ఆటగాడి మీద విజయం సాధించాడు. 2016 సెప్టెంబర్‌లో వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో స్పెయిన్ టీమ్‌తో తలపడ్డాడు. ఏటీపీ చాలెంజర్ ఈవెంట్‌లో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. 2006లో అమెరికాలోని అలబామా యూనివర్శిటీ సాకేత్‌కు టెన్నిస్ స్కాలర్‌షిప్ ఇచ్చింది. అక్కడ చేరి అలబామా తరపున లోయర్ ఆర్డర్ సింగిల్స్, డబుల్స్ ఆడడం మొదలుపెట్టాడు. అతిత్వరలోనే ఆ జట్టులో నెంబర్ ఒన్ ఆటగాడయ్యాడు. ఓ వైపు టోర్నీల్లో పాల్గొంటూనే అమెరికాలోనే ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో డబుల్ డిగ్రీ పూర్తి చేశాడు. ‘అలబామా.. నాకు కొత్త జీవితాన్నిచ్చింది. అక్కడ నన్ను నేను వెదుక్కున్నాను. ఓ వ్యక్తిగా ఎదిగాను’ అని చెప్తాడు సాకేత్.
► చాలా సంతోషంగా ఉంది. ’సాక్షి’ స్పోర్ట్స్‌కి చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. స్పోర్ట్స్ కవరేజ్ బాగా ఇవ్వడంతో పాటు ఆటగాళ్లకు అవార్డులను ఇవ్వడం కూడా బాగుంది. ఈ విధంగా అంతర్జాతీయంగా ఈఎస్‌పీఎన్, జాతీయంగా టైమ్స్ వాళ్లు ఇలా అవార్డులు ఇస్తుంటారు. ’సాక్షి’ మూడేళ్లుగా క్రీడాకారులకు అవార్డులను ఇస్తూ గౌరవిస్తోంది. ఈ అవార్డులు, ప్రోత్సాహం చూసి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారు.
బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: రవీందర్ అగర్వాల్
డ్యూక్ బిస్కట్ టేస్ట్ చూసే ఉంటారు. చాలా తక్కువ పెట్టుబడితో మొదలైన ఆ కంపెని టర్నోవర్ ఇప్పుడు ఎంతో తెలుసా? అక్షరాలా వెయ్యి కోట్లు. ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటని కంపెనీ యజమాని రవీందర్ అగ్రవాల్‌ని అడిగితే.. ‘ఫ్యామిలీ వాల్యూస్’ అంటాడు. ‘మా అన్నదమ్ములే నాకు అండ. నా భార్యే నా స్ట్రెంగ్త్. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబం. పదహారు మందిమి ఉంటాం. ప్రతి రోజూ కలిసే భోంచేస్తాం. మంచిచెడులు అన్నీ చర్చిస్తాం. ఈ వాతావరణమే నా విజయరహస్యం’ అని వివరిస్తాడు. చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. అప్పటికి అతని తల్లి వయసు 35 ఏళ్లు. చిన్న పచారీ కొట్టు తప్ప ఆర్థికాధారమేమీ లేదు. రోజూ ఉదయం నాలుగింటి నుంచి రాత్రి పదింటి వరకు పనిచేస్తేనే ఆ ఇంట్లో ఉన్న ఏడుగురు పిల్లలకు తిండి పెట్టగలిగేది. రవీందర్‌కు యుక్త వయస్సు వచ్చాక ఓ పదేళ్లు రకరకాల వ్యాపారాలు చేసి ఇంటి ఆర్థికభారంలో వాటా పంచుకోవాలనుకున్నాడు. కాని కాలం కలిసిరాలేదు.
అప్పుడు తన శక్తిని, మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేసుకున్నాడు. ఫుడ్ ఇండస్ట్రీలో భవిష్యత్ కనిపించింది. 1995లో హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో అయిదువేల రూపాయల పెట్టుబడితో బిస్కట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అది ఈ రోజు ఎంత పాపులర్ అయిందంటే 60 దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసేంతగా. ఎంత సక్సెస్ అయిందంటే బిస్కట్స్ నుంచి కుకీస్, వేఫర్స్, టాఫీస్ మొదలు మొత్తం 150 రకాలు పదార్థాల తయారీకి విస్తరించేంతగా. ఇంకో ప్రత్యేకతా చెప్పుకోవాలి. ఇందులో సింహభాగం స్త్రీలే ఉద్యోగులు. ‘మా అమ్మ, నానమ్మల ప్రభావం నా మీద ఉండడమే దీనికి కారణం. అదీగాక ఫుడ్‌కి స్త్రీలు ఎమోషనల్‌గా అటాచ్ అవుతారు. నాణ్యత, శుభ్రత విషయంలో రాజీ పడరు’ అని అంటారు రవీందర్.
► మన దేశంలో ఫుడ్ బిజినెస్‌కు చాలా అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు పోటీ కూడా ఉంది. ఈ వ్యాపారంలో మాదంటూ ఓ బ్రాండ్‌ను నిలబెట్టుకోగలిగాం. మా శ్రమను గుర్తించి ’సాక్షి’ అందిస్తున్న ఈ అవార్డు నా జీవితంలో చాలా అపురూపమైనది. ఈ క్షణాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను.
ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్: వందేమాతరం
విద్య పూర్తిగా వ్యాపారమయమైన ఈ రోజులలో నిరుపేదవర్గాలకు చెందిన పిల్లలకు విద్యాసౌకర్యాలను అందించేందుకు ఉద్దేశించిన సంస్థ వందేమాతరం ఫౌండేషన్. చదువు అంటే ఏమిటో తెలియని తల్లిదండ్రులకు విద్య, దాని అవసరంపై అవగాహన కల్పిస్తుంది ఈ సంస్థ. మారుమూలల్లో ఉన్న ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చేందుకు ఈ సంస్థ కార్యకలాపాలు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లు స్వయం సమృద్ధితో మరింత బలోపేతం అయ్యేందుకు కూడా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థ నిర్వహిస్తున్న ‘అక్షరాభ్యాసం’ అనే కార్యక్రమం గత పదేళ్లలో వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 1,93,500 మందికి పైగా విద్యార్థులను పాఠశాల దూరం కాకుండా ఉండేందుకు తోడ్పడింది.
ఈ సంస్థ నిర్వహించే ‘రక్షాబంధన్’ కార్యక్రమంలో పిల్లలు దాదాపు 48.2 లక్షల మంది పెద్దలకు రక్షాబంధనం కట్టి స్కూలుకు వెళ్లే వయసులో ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోబోమంటూ వారందరిచేతా ప్రమాణం చేయించారు.ఈ సంస్థ నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందినవారిలో దాదాపు 680 మంది ఐఐటీలకు, 1500 మంది వివిధ పెద్దకాలేజీలలో ఫ్రీ సీట్లకు యోగ్యత పొందారు.చదువును మధ్యలోనే మానేసే ఎంతో మంది ఆడపిల్లలకు కిశోరి విద్యా వికాసం (కేవీవీ) అనే కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
∙తెలంగాణ రాష్ట్రంలో చదువుపై అమితమైన ఆసక్తి, చాలా ఉత్సాహవంతులైన ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలను ‘కలాం 100’ అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి వారికి అవసరమైన ఐఐటీ, మెడిసిన్ లేదా ఇతర కాంపిటీటివ్ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణను అందజేసేస్తున్నది ఈ సంస్థ. ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఎంపిక చేసిన పిల్లలకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం పాటు శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో ఆడపిల్లలకు రుద్రమ అనే కార్యక్రమం ద్వారా, మగపిల్లలకు ప్రజ్ఞాధామం పేరిట వసతి సౌకర్యం అందిస్తున్నారు. అనాథలు లేదా తల్లిదండ్రులో ఎవరో ఒకరు మాత్రమే ఉన్న సింగిల్ పేరెంట్ పిల్లలకూ వసతి అందిస్తున్నారు.
► సామాజిక న్యాయం, సమానత్వం, ఆర్థిక స్వాతంత్రం విద్య ద్వారానే లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకున్న వారికి నాణ్యమైన విద్యను అందించడానికి వందేమాతరం ఫౌండేషన్ కృషి చేస్తుంది. బంగారు తెలంగాణ భవిష్యత్ బడి పునాదుల మీదనే ఆధారపడి ఉంది. ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– రవీంద్ర
తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్: పీవీ సింధు
బాడ్మింటన్‌లో ఒక సంచలనం. మనదేశపు ఆశా కిరణం. తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు! మొన్నటి ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకొని ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారతీయ వనితగా చరిత్ర సృష్టించింది. తన విజయంతో మనదేశ సత్తా చాటింది. కీర్తిని ప్రపంచానికి విస్తరింపజేసింది. సింధు 1995, జూలై 5న హైదరాబాద్‌లో పుట్టింది. తల్లిదండ్రులు పీవీ రమణ, పి. విజయ ఇద్దరూ ఆటల నేపథ్యం ఉన్నవారే. 2000లో పీవీ రమణ అర్జున అవార్డునూ అందుకున్నారు. కూతురిని అత్యున్నత క్రీడాకారిణిగా చేయడానికి అహర్నిశలూ శ్రమించారు. తల్లిదండ్రుల కలను సాకారం చేసింది సింధు. బీఎఫ్‌డబ్ల్యూ ర్యాకింగ్స్‌లో టాప్ 20లో నిలబడడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పుల్లెల గోపీచంద్ శిక్షణలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం వరల్డ్ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతోంది. పీవీ సింధు వెలుగుతున్న వర్తమానం. కాబట్టి ఎంత చెప్పినా తక్కువే. జైత్రయాత్ర సాగిస్తున్న ఈ క్రీడాకారిణì బయోపిక్ కూడా రాబోతోంది.
► నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులు. నేను ఆడే ప్రతిసారీ నన్ను మీడియా ఎంతో ప్రోత్సహించింది. మీడియా ప్రోత్సాహం వల్లనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను గుర్తించి, నాకు ఆదరణగా నిలిచాయి. ఈ రోజు ’సాక్షి’ నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.
యంగ్ అచీవర్ స్పోర్ట్స్: మహ్మద్ సిరాజ్
నిన్నటి దాకా అనామకుడిగా ఉన్న సిరాజ్‌ను క్రికెట్ బంతి తారల్లో నిలబెట్టింది. ఈ అతి సాధారణ యువకుడు ఇప్పుడు సెలబ్రెటీ. ఐపీఎల్ మ్యాచ్‌లో చాన్స్ కొట్టేశాడు! తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. మసాబ్‌ట్యాంక్‌లోని ఖాజానగర్ ఇరుకు వీధిలో నివాసం. క్రికెట్ బాల్ కూడా కొనలేని పరిస్థితి. పాత టెన్నిస్‌బాల్‌తో క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇతడు బ్యాట్, బాల్ పట్టుకోగానే వాటిని వదిలేసే దాకా వాళ్లమ్మ సిరాజ్‌ను తరిమేది. అవి అన్నంపెట్టేవి కావు. కడుపు నింపే పని చేయమని పోరేది. అమ్మ మాట కాదనలేక.. తనకిష్టమైన కాదు... ప్రాణమైన బాల్, బ్యాట్‌ను వదల్లేక వదల్లేక వదిలేవాడు. ఎవరికంటా కనపడకుండా జాగ్రత్తగా దాచుకునేవాడు.
నాన్నకు ఆర్థిక సహాయం చేయడానికి స్ప్రే పేయింటర్‌గా మారాడు. బలవంతంగా ఆ పనిచేస్తున్నాడే కాని ఆ పని బాల్ విసిరినంత ఆనందాన్నిచ్చేది కాదు. ఒకసారి సిరాజ్ బాలింగ్ చేస్తుంటే కోచ్ అడ్నాన్ చూశాడు. ఎలాంటి శిక్షణ లేకపోయినా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో చేస్తున్న ఆ పిల్లాడి బౌలింగ్ ఆయన్ని అబ్బురపరిచింది. అంతే ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. లీగ్ మ్యాచెస్‌లో 59 వికెట్లు తీశాడు సిరాజ్. ఆ టాలెంట్ హైదరాబాద్ క్రికెట్ సెలెక్టర్స్‌ను ఆకర్షించింది. అండర్ 23 టీమ్‌లో చాన్స్ వచ్చింది. 29 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ సీజన్‌లో 41 వికెట్లు తీసి మూడోస్థానంలో నిలిచాడు. ఇండియా టీమ్‌కి సెలెక్ట్ అయ్యే అవకాశం కల్పించింది అది. అప్పుడే ఐపీఎల్ కంట్లోనూ పడ్డాడు సిరాజ్. జైత్రయాత్ర సాగిస్తున్నాడు. ఐపీఎల్ సీజన్ 10లో ఈ కుర్రాడి టాలెంట్ వాల్యూ రెండు కోట్ల 60 లక్షలు. కేవలం ప్రతిభే సిరాజ్‌ను ఈ స్థాయికి చేర్చింది. ‘ప్రస్తుతం నా కోరిక ఒక్కటే.. ఐపీఎల్‌లో వచ్చిన డబ్బుతో మా అమ్మానాన్నకు మంచి ఇల్లు కొనివ్వాలి’ అంటాడు వినమ్రంగా! ఆల్ ది బెస్ట్ సిరాజ్!!
► మా తండ్రి ఓ ఆటోడ్రైవర్. మా అన్నకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని గమనించిన మా నాన్న అన్నను ప్రోత్సహిస్తూ ఆదరణగా ఉన్నాడు. ఈ రోజు అన్న సిరాజ్ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడంటే నాన్న స్ఫూర్తే. సిరాజ్ టాలెంట్‌ను గుర్తించి ’సాక్షి’ అవార్డును ఇవ్వడం గర్వంగా ఉంది.
– మహ్మద్ ఇస్మాయిల్, సిరాజ్ అన్నయ్య
జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్: నాయక్
‘అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు’ అని అడిగిన చిన్మయితో ‘రెండు రోజుల్లో వచ్చేస్తాడమ్మా’ అని చెప్పింది తల్లి అనిత. కానీ ఆమెకు అప్పుడు తెలియదు ఒకరోజు ముందే విగతజీవిగా తన భర్త వస్తాడని. జమ్మూకాశ్మీర్‌లోని కుంపరాస్ పంజగ్రామ్ ఆర్మీ క్యాంప్‌పై ఏప్రిల్ 27 తెల్లవారు జామున టెర్రరిస్టులు దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్, రాజస్థాన్‌కు చెందిన సబ్ బూప్‌సింగ్ గుజ్జార్‌లతో పాటు విశాఖపట్నం నగర పరిధిలోని ఆసవానిపాలెం గ్రామానికి చెందిన బివి రమణ అసువులు బాశాడు. భర్త వెంకట రమణను విధి వేరు చేయడంతో భార్య అనిత జీవితం ఒక్కసారిగా చీకటైపోయింది. అయినప్పటికీ దేశం కోసం తన భర్త ప్రాణాలు అర్పించాడన్న ఆత్మసంతృప్తి తానూ తన పిల్లలూ కలిసి దేశానికి ఇంకా ఏదయినా చేయాలన్న తపన ఆమెలో ఉన్నాయి.
ఆమె రమణ జ్ఞాపకాలు పంచుకుంటూ– ‘‘ముందు రోజు రాత్రే ఫోన్ చేశారు. తనకు రిలీవ్ దొరకనుందని, దొరికిన వెంటనే రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. ఆయన వస్తున్నారన్న మాట మాలో ఎంతో ఆనందాన్ని నింపింది. పిల్లలు నాన్న వస్తున్నారని తెలిసి సంబరపడిపోయారు. ఆ రాత్రంతా నిద్ర కూడా పోలేదు. నాకయితే తెల్లవారగానే ఏదో అలజడి. మనసు కీడు శంకిస్తోంది. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఉదయం 10.30కి మావయ్య ఫోన్ చేశారు. రమణకు ఏవో దెబ్బలు తగిలాయట, హాస్పిటల్‌లో ఉన్నాడంట అని. ఆ మాటలకే నాకు గుండె ఆగిపోయినంత పనైంది. ఆయనకు ఏదైనా జరగకూడనిది జరిగితే అన్న ఆలోచనకే నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అందరూ ఏం కాదులే అని ధైర్యం చెబుతున్నా తెలియని భయంతో గుండె బరువెక్కుతోంది. నేను ఏమైపోతానోనని నన్ను మానసికంగా సిద్ధం చేసి అప్పుడు చెప్పారు. విన్నాక ప్రపంచం శూన్యంగా కనిపించింది.
అయినా మనసు పొరల్లో గర్వంగా కూడా ఉంది. నా భర్త దేశం కోసం ప్రాణాలిచ్చాడు. మాతృభూమి రుణం తీర్చుకుని వీరుడిలా మరణించాడు. ఆయన పంచిన జ్ఞాపకాలతో ఆయనిచ్చిన పిల్లలను పెంచి ప్రయోజకులను చేసి ఆయనలా గొప్పవాళ్లను చేస్తాను. పాప మూడవ తరగతి, బాబు ఒకటవ తరగతి చదువుతున్నారు. ఇకపై వాళ్లే నా లోకం. ఏడాదిలో రెండు నెలలే ఇంటి దగ్గర ఉంటాను. మిగతా అన్ని రోజులూ నువ్వే పిల్లల్ని, అమ్మానాన్నలను చూసుకోవాలి. ’ అంటూ మా పెళ్లి చూపుల్లోనే ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను’’ అన్నారామె.
► మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అయినా సరే అవకాశం వస్తే నేను కూడా ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా ఆర్మీలోనే పని చేస్తున్నా. వెంకటరమణ దేశం కోసం చేసిన సేవలను గుర్తించి, ఆయనకు సాక్షి ఎక్స్‌లెన్సీ జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు లభించడం తృప్తిగా ఉంది.
– కోటేశ్వరరావు (బి వెంకటరమణ సోదరుడు )
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్: కైకాల సత్యనారాయణ
నవరసాలు పలికించగల నటుడికి ఏ పాత్ర అయితే ఏంటి? ఇచ్చిన పాత్రలో ఇమిడిపోవడమే మంచి నటుడి లక్షణం అని నిరూపించారు కైకాల సత్యనారాయణ. అందుకే తెలుగు సినిమా లోకం ఆయన్ను ‘నవసర నటనా సార్వభౌమ’ బిరుదుతో సత్కరించింది. 700కు పైగా చిత్రాల్లో కైకాల పలు భిన్నమైన పాత్రలను పోషించారు. ఆయన వెండితెర ప్రయాణం పలు మలుపులతో ముందుకు సాగింది. హీరోగా కెరీర్ ప్రారంభించి, విలన్‌గా టర్న్ తీసుకుని తర్వాత పాజిటివ్ పాత్రల వైపు మళ్లారు కైకాల.
నేపథ్యం: సత్యనారాయణ అసలు పేరు లక్ష్మీ నారాయణ. కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో 1935, జూలై 25న జన్మించారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చదివారు. చిన్నప్పట్నుంచీ ఆయనకు నటన అంటే ఆసక్తి. నైన్త్ ఫారమ్‌లో ఉన్నప్పుడు ‘ప్రేమలీల’ అనే నాటకంలో చేసిన పాత్రకు గోల్డ్ మెడల్ అందుకున్నారు. డిగ్రీ చదివే రోజుల్లో కొందరు స్నేహితులతో కలసి నాటక సమాజం ఆరంభించి నాటకల్లో హీరో వేషాలు వేశారు. ప్రేక్షకులంతా కైకాలను ‘రామారావు తమ్ముడు’ అనేవారు. ఆయన కనిపిస్తే చప్పట్లు, ఈలలే. స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమాల్లో నటించాలని 1956లో మద్రాస్ వెళ్లారు.
‘సిపాయి కూతురు’లో అప్పటి స్టార్ హీరోయిన్ జమున సరసన హీరోగా ఫస్ట్ ఛాన్స్. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో విఠలాచార్య సలహాతో విలన్‌గా టర్న్ తీసుకున్నారు. ‘కనకదుర్గ పూజామహిమ’ విలన్‌గా కైకాల మొదటి సినిమా. ఎన్టీఆర్ హీరోగా నటించి, నిర్మించిన ‘ఉమ్మడి కుటుంబం’లో పాజిటివ్ రోల్ చేసి ఏ పాత్రకైనా సత్యనారాయణ సూటవుతాడనే పేరు తెచ్చుకున్నారు. కైకాలకు బాగా పేరు తీసుకొచ్చిన పాత్ర యముడు పాత్ర. ఎన్టీఆర్ ‘యమగోల’, చిరంజీవి ‘యముడికి మొగుడు’, అలీ ‘యమలీల’ చిత్రాల్లో యముడిగా నటించి నాటి, నేటి ప్రేక్షకులను అలరించారు. రమ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ‘కొందమసింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి చిత్రాలు నిర్మించారు.
► 57 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను. అవార్డుకు ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు. నేను సినిమాల్లో చేస్తూనే పరిశ్రమ అభివృద్ధిలో భాగం పంచుకున్నాను. కళాతపస్వి విశ్వనాథ్‌గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ‘శారద’ నా జీవితాన్ని మార్చేసింది. అప్పటివరకు విలన్, రేపిస్ట్ పాత్రల్లో కనిపించిన నేను ‘శారద’లో పాజిటివ్ క్యారెక్టర్ చేశా. అందులో నా నటనను చూసి ఎంతోమంది తెలుగింటి ఆడపడుచులు మెచ్చుకుంటూ ఉత్తరాలు రాశారు.
యంగ్ అచీవర్ – సోషల్ సర్వీస్ : యాకూబ్ బీ
తన పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కనపెట్టేది యాకూబ్ బీ. సహాయం చేయడానికి సంపద కాదు ఆ మనసుంటే చాలు అని నమ్మిందామె. అందుకే సహృదయ ఓల్డేజ్ హోమ్ పెట్టి 300 మంది అనాథవృద్ధులకు ఆశ్రయం కల్పించింది. వరంగల్ జిల్లా, వర్థన్నపేట మండలం యెల్లందు వాళ్లూరు. పిల్లల చదువుకోసం 1999లో యాకూబ్ బీ కుటుంబం హన్మకొండకు వెళ్లి స్థిరపడింది. అక్కడ పండు వయసులో కడుపున పుట్టిన వాళ్ల ఆదరణకు నోచుకోక.. అయిన వాళ్ల ఆప్యాయతా కరువై... వీ«థుల్లో.. రోడ్ల మీద జీవనం వెళ్లదీస్తున్న వృద్ధులను చూసి చలించి పోయింది యాకూబ్ బీ.
ఒక ఆశ్రమంలాంటిది పెట్టి ఇలాంటి అనాథ వృద్ధులెందరికో సహాయం చేయొచ్చు కదా అనుకుంది. ఆ ఆలోచనను భర్తతోనూ పంచుకుంది. భార్య మనసు తెలిసిన మహబూబ్ కాదనలేదు. ప్రోత్సహించాడు. ఆ ప్రయాణానికి తోడయ్యాడు. అలా యాకూబ్ బీ ‘సహృదయ ఓల్డేజ్‌హోమ్’కు పురుడుపోసింది. ముందు ఇద్దరు వృద్ధులతో మొదలై మూడు వందల మంది దాకా వెళ్లింది. ఆ హోమ్.. వారికి ఇంటి కంటే ఎక్కువ స్వేచ్ఛా స్వాతంత్య్రాలనిచ్చింది. పిడికెడు అన్నంపెట్టడమే కాదు.. వాళ్ల ఆరోగ్యాన్నీ చూసింది. వైద్య పరీక్షలు చేయించి మందులు ఇప్పించింది. సొంత తల్లిదండ్రులకన్నా ఎక్కువగా చూసుకుంది. ఆ సేవకు కులం, మతం తేడాను అంటనివ్వలేదు. ఆ మంచితనం ఆ నోటా ఈ నోటా పాకి.. అనాథ వృద్ధులు ఆమె ఇంటి దారి పట్టడం మొదలుపెట్టారు. ఎంత మంది వచ్చినా ఆ ఆశ్రమం ద్వారం తెరుచుకునే ఉంటుంది. ఆశ్రమంలోకి వచ్చిన వాళ్లు మహాప్రస్థానం వరకూ అక్కడే ఉంటారు. అయితే కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ల తాలూకు వాళ్లకు కబురు పంపింది యాకూబ్ బీ. ఎవరూ రాలేదు. వచ్చిన వాళ్లు ఆ పార్థివకాయాలను ఇంటికి తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు. అయిన వాళ్ల చర్య యాకూబ్ బీని కలచివేసింది.
బిడ్డగా తనే వాళ్ల అంత్యక్రియలు జరిపించడానికి ముందుకొచ్చింది. అంతిమ సంస్కారాలను మాత్రం వాళ్లవాళ్ల మతాచారాల ప్రకారమే జరిపి ఆ ఆత్మలకు శాంతిచేకూర్చాలనుకుంది. అందుకే హిందువులు చనిపోతే కుండ పట్టుకొని తలకొరివి పెడుతుంది. ముస్లింలు, క్రిస్టియన్లు అయితే వాళ్ల మతాచారాలప్రకారమే అంతిమకార్యక్రమం జరిపిస్తుంది. వృద్ధాప్యంతో ఇప్పటివరకు ఆమె ఆశ్రమంలో చనిపోయిన 56 మందికి అంత్యక్రియలు చేసింది తన భర్త సహాయంతో. ‘త్వరలోనే మా ఆశ్రమంలోనే ఒక ఆసుపత్రిని మొదలుపెట్టాలనుకుంటున్నాం. ఆ హాస్పిటల్‌లో మా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకే కాక చుట్టుపక్కల ఉన్న వృద్ధులకూ ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇప్పించాలనుకుంటున్నాం. అనాథ వృద్ధులైనా చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను మేం తీసుకుంటాం!’అని చెప్తోంది యాకూబ్ బీ.
► ఏ వృద్ధులూ అనాథలుగా మిగలకూడదనేది నా లక్ష్యం. నలుగురు వృద్ధులతో మొదలైన సహృదయ ఆశ్రమంలో నేడు 200 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారు మరణిస్తే మత సాంప్రదాయాల ప్రకారం కర్మకాండలు కూడా నిర్వహిస్తుంటాం. ఈ ధైర్యం, ఈ దృక్పథం సేవ నుంచి అలవడినవే. దీనిని గుర్తించిన ’సాక్షి’కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎక్స్‌లన్స్ ఇన్ ఫార్మింగ్: గడ్డం జగదీశ్వర్ రెడ్డి
జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని రాంపూర్ నివాసి గడ్డం జగదీశ్వర్ రెడ్డి. 1972, ఫిబ్రవరి 23న పుట్టారు. గడ్డం లక్ష్మి, గడ్డం రాజారెడ్డి తల్లిదండ్రులు. బీస్సీ మ్యాథ్స్ చేశారు. డిగ్రీ అయిపోగానే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. 2002లో ఉద్యోగరీత్యా మలేషియా వెళ్లారు. 2004లో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. ఆ తర్వాత 2007లో స్వదేశం తిరిగొచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు. 2010లో సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తూ జీఎల్‌ఆర్ అగ్రి ఫార్మ్స్‌ను ప్రారంభించారు. 50మంది ఉత్తమ రైతుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు.
► నేను చేస్తున్నది గో ఆధారిత వ్యవసాయం, దాని వలన లభిçస్తున్న ఫలసాయం అనేకమంది రైతులకు తెలిపే అవకాశం ఇస్తోంది ఈ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రధానోత్సవం. ప్రభుత్వం నుంచి ఎదురుచూపులు లేకుండా రైతులు స్వతంత్రంగా ఉండటానికి, ఆర్థికంగా మెరుగ్గా ఫలితాలను రాబట్టడానికి నా అనుభవం తోటి రైతులతో పంచుకునేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే.
తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్: టామ్ చిట్టా
కడప జిల్లాకు చెందిన టామ్ చిట్టా ప్రస్తుతం యూఎస్‌లోని షికాగోలో నివాసం ఉంటున్నారు. ఆయన గత 35 ఏళ్లుగా సామాజిక సేవలను అందిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ గీత కూడా ఎన్నో సామాజిక సేవా కార్యకలాపాలలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఆ దంపతులిద్దరూ ‘ఫౌండేషన్ ఫర్ చిల్డ్రెన్’ (ఎఫ్‌ఎన్‌సీ) అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. తమ సేవా కార్యకలాపాల కోసం వారు ఈ సంస్థకు ఏటా రూ. 8 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు.
∙
ఎఫ్‌ఎన్‌సీ వారు తాము ఎంపిక చేసిన పేద విద్యార్థుల చదువు కోసం ఒక్కొక్కరికి ఏటా రూ. 14,000 స్కాలర్‌షిప్ అందజేస్తున్నారు. ఇలా తమ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపు 2,500 మంది అత్యంత నిరుపేద విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు టామ్ చిట్టా తోడ్పడ్డారు.ప్రతి ఏటా 10,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూలు పుస్తకాలను అందజేస్తున్నారు.గ్రహణం మొర్రి ఉన్న పిల్లల్లో ఉన్న అవకరాన్ని సరిచేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ద్వారా ఇప్పటికి 400 మంది పిల్లలకు శస్త్రచికిత్స చేయించి ఆ సమస్య నుంచి దూరం చేశారు టామ్ చిట్టా దంపతులు. ఇందుకోసం ఏటా ఒక ప్రత్యేకమైన డాక్టర్ల బృందం అమెరికా నుంచి వచ్చి ఈ శస్త్రచికిత్సలు చేస్తుంది. వృద్ధులు, వైకల్యంతో బాధపడే వారికి వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.
► తెలుగు ఎన్‌ఆర్‌ఐ అఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీతలు డా. గీతా ఎరువా, టామ్ చిట్టా తరుపున అవార్డు అందుకోవటం సంతోషంగా ఉంది. గీత గత పదిహేనేళ్లుగా మానవతా దక్పథంతో వికలాంగులు, అనాథలకు సాయం చేస్తున్నారు. 2,500 మంది పిల్లలకు అండగా నిలిచారు. ఆ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిన సాక్షికి గ్రూప్‌కు నా కృతజ్ఞతలు.
– సంజయ్, షెఫ్
యంగ్ అచీవర్–ఎడ్యుకేషన్: మోహన్ అభ్యాస్
నిరుపేద కుటుంబం. అమ్మ గృహిణి. నాన్న సమోసాలు అమ్ముతాడు. ఆ ఇంటి విద్యార్థి జేఈఈ 2017లో 6వ ర్యాంకు సాధించాడు! అతడి పేరు మోహన్ అభ్యాస్. 16 ఏళ్ల అభ్యాస్ ఈ ఏడాది జాయింట్ ఎంట్రెన్స్ ఇంజినీరింగ్‌లో అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచిన తొలి వందమంది ర్యాంకర్లలో ఒకడిగా కాదు, తొలి పది మంది ర్యాంకర్‌లలో ఒకడిగా నిలిచాడు. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలలో కలిపి 30 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు వందలోపు ర్యాంకు సంపాదించారు. ఆ ముప్పైమందిలో ముందు వరుసలో అభ్యాస్ ఉన్నాడు! అభ్యాస్‌ది హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి. తల్లి కళ. తండ్రి సుబ్బారావు. కొడుక్కి ర్యాంక్ రావడంతో కొండెక్కినంత ఆనందంగా ఉన్నారు వాళ్లు. అభ్యాస్‌కు 360కి 345 మార్కులు వచ్చాయి. ఆలిండియాలో ఆరో ర్యాంక్, దక్షిణ భారతంలో అతడే నెంబర్ వన్. మద్రాస్ ఐఐటిలో ఇంజినీరింగ్ (ఫిజిక్స్) చేయాలని అభ్యాస్ అభిలాష. శాస్త్రవేత్త కావాలన్నది ఆకాంక్ష.
► చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టంతో, పట్టుదలతో చదువుతూ ర్యాంకులు సాధిస్తూ వచ్చాను. ఈ రోజు నన్ను ఇంతమంది పొగుడుతున్నప్పటికీ నాకు ఆనందంగా లేదు. నేను నా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. చిన్నతనంలోనే ‘సాక్షి’ నన్ను గుర్తించి అవార్డును ప్రధానం చేయడం చాలా సంతోషం.
దర్శక శిఖరం దాసరి...
సాక్షి ఎక్సలెన్స్ అవార్డు వేడుకల్లో అందరితో పాటు నేనూ పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. నా కెరీర్ ఆరంభంలో అవార్డు వస్తే చాలా సంతోషపడేవాణ్ణి. ఎనలేని శక్తి వచ్చేది. నా ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనం అని భావించేవాణ్ణి. కెరీర్‌లో పైకొచ్చే కళాకారులకు అవార్డులు ఇవ్వడం వల్ల వ్యక్తులుగా వాళ్లను బలోపేతం చేసినట్టవుతుంది. ఈ ప్రోత్సాహాన్ని ఆసరాగా చేసుకుని కళాకారులందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకరత్న దాసరి గారికి ‘తెలుగు శిఖరం’అవార్డు ఇవ్వడం ఎంతో సముచితం. అది అభినందించదగ్గ విషయం. ఆయనో ‘దర్శక శిఖరం’. ప్రస్తుతం దాసరి హాస్పటల్‌లో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ‘సాక్షి’వాళ్లు ఈ అవార్డును ఆయనకు అందజేయాలని కోరుకుంటున్నాను. అలాగే, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అందుకున్న నటుడు ౖMðకాల సత్యనారాయణ గారికి అభినందనలు. వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన ఆయన కూడా అవార్డుకు పూర్తి అర్హుడు. ఎస్వీ రంగారావు తర్వాత మహానటుడు అనిపించుకున్న వ్యక్తి ఆయన. ‘సాక్షి’ఈ కార్యక్రమాన్ని ఏటా ఇలాగే విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నా. కళాకారులను ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి అభినందనలు. ఈ వేదికపై ‘సాక్షి’చైర్‌పర్సన్ వై.ఎస్.భారతి గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది.
– మెగాస్టార్ చిరంజీవి
కైకాల ఏ పాత్రైనా చేయగలరు...
పది మందిని కొట్టి.. హీరోయిన్లను రేప్ చేసే పాత్రలు సత్యనారాయణ చేశారు. నా సినిమాలో మాత్రం ఓ వైవిధ్యమైన పాత్ర చేశారు. సత్యనారాయణ ఆ పాత్ర చేశాక చాలామంది ఆడపడుచులు ఆయనకు చాలా ఉత్తరాలు రాశారు. ఆయన ఏ పాత్రలో అయినా నటించగలరు. ‘సిరిసిరి మువ్వ’నుంచి ‘శుభలేఖ’వరకూ ఆయన అన్నీ వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆయన నటన మరువలేనిది.
– కళాతపస్వి కె.విశ్వనాథ్
సరైనోడు బిగ్గెస్ట్ హిట్
‘సరైనోడు’చిత్రానికి మూడు అవార్డులు రావడం ఆనందంగా ఉంది. నా బ్యానర్‌లో ‘సరైనోడు’బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బోయపాటి శీను ఇంకా అటువంటి సినిమాలు చేయాలి. నిజానికి చిరంజీవితో 150వ చిత్రం నేను తీయాల్సి ఉంది. కానీ, బోయపాటి కథ తయారు చేయడంలో బిజీగా ఉండటంతో నేను 152కు జరగాల్సి వచ్చింది. బోయపాటి లాంటి డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీకి కావాలి. ‘బాహుబలి’సినిమా తెలుగు పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిలిపింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్నచూపు ఉండేది. ఈ చిత్రంతో ఇప్పుడది పటాపంచలు అయిపోయింది. రాజమౌళి అండ్ టీంకి కంగ్రాట్స్ చెప్పే అదృష్టం మాకు కలిగింది.
– అల్లు అరవింద్, సినీ నిర్మాత
ఆ పాట చాలా ఇష్టం...
చిరంజీవిగారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఆయన నటించిన తెలుగు సినిమాలను హిందీలో అనువదించేవారు. అప్పుడు మా అమ్మ, నేను చూసేవాళ్లం. వాటిలో ఆయన, శ్రీదేవి నటించిన ఓ పాట తక్ తక్ అని ఉంటుంది. అది చాలా ఇష్టం (‘జగదేకవీరుడు అతిలోక సుందరి’సినిమాలో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ...’పాట గురించి). ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నా పాత్రకు అవార్డు రావడం సంతోషంగా ఉంది.
– లావణ్యా త్రిపాఠి, నటి
ఎంతో ఆనందంగా ఉంది...
చిరంజీవిగారితో వాళ్లింట్లో కూర్చుని ఓ సందర్భంలో 45 నిమిషాలు మాట్లాడా. అదే నా అదృష్టం. ఏదైనా అవార్డు వేడుకలో అన్నయ్య చేతుల మీదుగా అవార్డు తీసుకుంటే బాగుంటుందనుకున్నా. ఆ దేవుడు ‘సాక్షి’మీడియా ద్వారా ఆ అవకాశం ఇచ్చాడు. ఈ రోజు మదర్స్‌డే. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు 32 పక్కటెముకలు విరిగినంత బాధ తల్లికి కలుగుతుందని ఓ వార్త చదివా. అది చదివిన తర్వాత... అంత బాధ పడుతూ నన్నెందుకు కన్నావమ్మా అనిపించింది. ఈ రోజు మా అమ్మ ఎక్కడున్నా... ఆవిడ ఆశీసులు నాకు ఉంటాయని ఆశిస్తున్నా.
– పృథ్వీ, హాస్య నటుడు
ఓ మధుర జ్ఞాపకం...
ఇంతమంది పెద్దలున్న ఈ వేదికపై నేను నిలబడడం, మాట్లాడడం నా అదృష్టం. హీరోగా నా రెండో సినిమా ‘ద్వారక’’మోషన్ పోస్టర్ చిరంజీవి సార్ చేతుల మీదుగా విడుదలైంది. ఆ ఆనంద క్షణాలను నేనెప్పటికీ మరిచిపోలేను. హీరోగా నా మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’చిత్రానికి ఆయన చేతుల నుంచి అవార్డు అందుకోవడం నా జీవితంలో మరో తీయని జ్ఞాపకం.
– విజయ్ దేవరకొండ, హీరో
తొలి సినిమాకు అవార్డు...
దర్శకునిగా నా తొలి సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన హీరో నాగార్జునగారు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు.
– కల్యాణ్‌కృష్ణ, సినీ దర్శకుడు
ఎన్నో అవార్డులకు సమానం...
మదర్స్‌డే రోజు ఈ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఇది పేరుకు ఒక అవార్డే అయినా చిరంజీవిగారి చేతులమీదుగా తీసుకోవడం అనేక అవార్డులకు సమానం. దర్శకుడు సుకుమార్‌గారికి ధన్యవాదాలు. ఈ పాటను మా నాన్నగారు సత్యమూర్తిగారికి అంకితం చేస్తున్నా.
– సాగర్, గాయకుడు
ఈ పురస్కారం ఎంతో సంతృప్తినిచ్చింది: కైకాల
‘సాక్షి’ పురస్కారం తనకు ఎనలేని సంతృప్తిని కలిగించిందని కైకాల సత్యనారాయణ అన్నారు. ‘‘యాభై ఏళ్ల సినీ జీవితంలో నా నటనను, సినీరంగానికి చేసిన సేవలను గుర్తించి ‘సాక్షి’ యాజమాన్యం జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం ఎనలేని సంతృప్తి కలిగించింది. శివాజీ గణేషన్, సుభాష్‌ఘయ్ వంటి వారి మన్ననలు పొందడం నా కెరీర్‌లో సాధించిన విజయం. విభిన్న రకాల పాత్రలతో సుమారు 800 చిత్రాలతో ప్రేక్షకులను రంజింపజేశాం. ఈ పురస్కారాన్ని కళాతపస్వి విశ్వనాథ్ చేతుల మీదుగా అందుకోవడం నా అదృష్టం. ఆయన సినిమాల్లో నేను ఎన్నో పాత్రల్లో నటించా..’’ అని గుర్తుచేసుకున్నారు.
ఈ ఏడాది నాలుగు శుభాలు...
ఎక్సలెన్స్ అంటేనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. వారిలో నన్ను ఎంపిక చేసి ఈ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. బెస్ట్ పెర్‌ఫార్మర్‌గా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఈ ఏడాది నాలుగు శుభాలు జరిగాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు రావడం, ‘బాహుబలి 2’తో తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలియడం. నాలుగోది చిరంజీవిగారు ‘ఖైదీ నంబర్ 150’ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం. ఇటువంటి అద్భుతాలు మరిన్ని జరగాలి. ‘సరైనోడు’చిత్రానికి ఈ అవార్డు వచ్చింది. నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ నాపైన ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. చిరంజీవిగారి చేతులమీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇంతమంది పెద్దల మధ్యలో ఈ అవార్డు తీసుకోవడానికి అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– బోయపాటి శీను, సినీ దర్శకుడు
అవార్డు ఫొటో రోజూ చూసుకొంటా...
కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలి. చిరంజీవిగారి చేతులమీదుగా అవార్డు తీసుకోవాలన్నది నా కల. అది ఈ రోజు నిజమైంది. చిరంజీవిగారి చేతులమీదుగా అవార్డు తీసుకున్న ఫొటోను నేను నిద్రలేచాక రోజూ చూసుకోవాలి. ఈ అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పవన్ కల్యాణ్‌గారితో నా సినిమా మొదలైంది. ఇప్పుడు మెగాస్టార్ చిరు చేతులమీదుగా అవార్డు తీసుకోవడంతో ముగిసింది.
– సప్తగిరి, హాస్య నటుడు
పట్టరాని ఆనందం...
ఇంతమంది మహామహుల మధ్య అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ‘జగదేకవీరుడు’నా ఐడల్ చిరంజీవిగారి చేతులమీదుగా ఈ అవార్డు తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రికి, సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు.
– మాళవిక, గాయని
వారికీ భాగస్వామ్యం...
ప్రకృతిమీద పాట రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివగారికి ధన్యవాదాలు. ఎవరి నోటి నుంచి ఈ పాట రావాలో వారి నోటి నుంచే వచ్చింది. ఈ పాటకు వచ్చే అవార్డులో ఎన్టీఆర్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌కు భాగస్వామ్యం ఉంది. ప్రణామం.. ప్రణామం అనే మంగళకరమైన పదంతో ఈ పాట మొదలు పెట్టి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశా.
– రామజోగయ్య శాస్త్రి,పాటల రచయిత
సాక్షి చక్కటి కార్యక్రమం చేస్తోంది...
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి అవార్డులివ్వడం మంచి కార్యక్రమం. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఈ అవార్డులు మరెంతో మందికి స్ఫూర్తి నింపుతాయి. ఈ ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
– శైలేందర్‌కుమార్ జోషి,ఇరిగేషన్ అండ్ కాడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ
అవార్డులు గర్వకారణం...
వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి సాక్షి అవార్డులు ఇవ్వడం మంచి పరిణామం. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా మోహన్ అభ్యాస్ ఆలిండియా జేఈఈ మెయిన్స్‌లో ఆరో ర్యాంక్ సాధించడం అభినందనీయం. అతడి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం అమోఘం. ఈ అవార్డులు గర్వకారణం.
– నవీన్ మిట్టల్,సమాచార శాఖ కమిషనర్
ప్రతిభావంతులు వెలుగులోకి...
గుంటూరు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వారి తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడింది. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఈ పురస్కారాల ప్రదానోత్సవ వేదికపై వారిని కలవడం సంతోషాన్నిచ్చింది. సాక్షి ఇస్తున్న ఈ అవార్డుల వల్ల చాలా మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ఇటువంటి చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్న సాక్షికి అభినందనలు.
– బుర్రా వెంకటేశం, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
అభినందనీయం...
ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం అభినందనీయం. నగరానికి చెందిన మహ్మద్ సిరాజ్ సన్‌రైజర్స్ జట్టు తరుఫున ఐపీఎల్‌లో రాణించడం గర్వకారణం. అవార్డుకు అన్ని విధాలా అతడు అర్హుడు.
– జయేశ్‌రంజన్,ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
సాక్షికి కృతజ్ఞతలు...
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాకేత్‌కు సాక్షి ఎక్సలెన్స్ అవార్డునివ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే... నేను కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని. రోజూ ప్రాక్టీస్ చేస్తుంటా. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించి అవార్డులతో ప్రోత్సహించడం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
– జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
తల్లిదండ్రుల కలను నిజం చేయాలి...
తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. పిల్లల అభీష్టానికి అండగా నిలుస్తారు. అలాగే తల్లిదండ్రులు కన్న కలలను నిజం చెయ్యాల్సిన బాధ్యత పిల్లలపైనా ఉంది. ఈ ఎక్సలెన్స్ అవార్డు ప్రతిభకే కాదు... కష్టానికి కూడా గుర్తింపు.
– వినోద్ అగర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అదృష్టంగా భావిస్తున్నా...
విజయం... ప్రతిభకు అర్హత కాదు. అదొక కష్టం. పట్టుదల, అంకితభావంతో కూడుకున్నది. విద్యారంగంలో విశేష సేవలందించిన వందేమాతరం ఫౌండేషన్‌కు నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నా.
– అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్)
న్యాయనిర్ణేతగా రావడం నా అదృష్టం...
సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల కోసం వచ్చిన ఎంట్రీలను పరిశీలించడం, వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేయడం గొప్ప అనుభూతి. జ్యూరీ కమిటీలో నాకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
– డాక్టర్ ప్రణతిరెడ్డి, క్లినికల్ డైరెక్టర్,మెటర్నల్ అండ్ మెడిసిన్, రెయిన్‌బో హాస్పిటల్
ప్రతిభ.. సేవకు గుర్తింపు...
‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేయడం చాలా క్లిష్టమయింది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, కేవలం సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తున్న వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశాం. ప్రతిభ, సామాజిక సేవను గుర్తించి ప్రోత్సహించడమే ఈ పురస్కారాల లక్ష్యం.
– కె.రామచంద్రమూర్తి,సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్
జానపద అంశానికి నృత్యం...
‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం నాకు జీవితాంతం ఓ తీపి గుర్తుగా ఉండిపోతుంది. ప్రతిసారీ అమ్మ దీపికారెడ్డితో కలసి నర్తించేదాన్ని. కానీ జానపద అంశానికి తొలిసారి అమ్మ లేకుండా నాట్యం చేశా. అది కూడా ప్రకృతి సంబంధిత అంశం కావడం ఎంతో సంతృప్తినిచ్చింది.
– శ్లోకారెడ్డి, కూచిపూడి నర్తకి