
ఝుమ్మంది నాదం ...సయ్యంది పాదం..!
హోరెత్తిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల వేదిక
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ –2016 వేదిక సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగింది. ఆదివారం ఫిల్మ్‌నగర్ – జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ కూచిపూడి మువ్వల సవ్వడులతో ఘల్లుమంది. కళాకారుల నత్య విన్యాసాలు కనువిందు చేశాయి. తొలుత అంతర్జాతీయ కూచిపూడి నర్తకీ దీపికా రెడ్డి తన శిష్య బృందంతో ‘కూచిపూడి ... వందనం’నృత్య ప్రదర్శన చేశారు. నృత్యకారుల పాద మంజిర రవళులై ప్రేక్షక జగతని పులకింప చేసింది.
మంత్రముగ్దుల్ని చేసిన ప్లేట్ డ్యాన్స్..
కూచిపూడి వందనంలో భాగంగా ఇత్తడి పల్లెంపై తకిట... తకిట... విజయ గణపతి... వందే లోకపాలకం నృత్యం పులకింపజేసింది. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ తొలుత వినాయక స్తుతితో ప్రారంభమైన నృత్యం బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర అంశాలతో ముగిసాయి. ఈ అంశాలను పల్లెంపై దీపకా రెడ్డి చేసిన వివిధ రకాల భంగిమలు శిలాక్షరాలు అయ్యాయి. చప్పట్లతో ప్రాంగణం మారుమోగిపోయింది.
ఆలోచింపజేసిన జానపద సందేశం...
సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండో అంశంగా జానపద సందేశం నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రకృతిని ఎలా కాపాడాలి..? అనే ఇతివృత్తంగా జానపద సందేశమిస్తూ సాగిన నృత్యహోరు అందరినీ పరవశింపజేసింది. ఈ సందర్భంగా దీపికా రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకైన సాక్షి దినపత్రిక ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ గీతంతో ప్రారంభమైన కార్యక్రమం జ్యోతి ప్రకాశనం, కూచిపూడి వందన నృత్యం, అవార్డుల ప్రదానోత్సవంతో ముగిసింది.