
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలపై అస్పష్టత కొనసాగుతోంది. జూలైలో గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. మే ఆఖరు వరకు ఇది పూర్తయ్యే అవకాశముంది. అనంతరం జిల్లాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యలను తేల్చడం, గ్రామాల వారీగా రిజర్వేషన్లను నిర్ణయిస్తారు.
పంచాయతీరాజ్ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. బీసీ ఓటర్ల గణన మధ్యలో ఉన్నందున ఈ శాఖ ఉద్యోగులకు ఇప్పుడే బదిలీలు ఉండవని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మే 25 నుంచే బదిలీల ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖలో దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు ఏవీ ఆ శాఖ ఉన్నతాధికారులకు చేరలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు వాయిదా పడినట్లేనని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే బదిలీలపైగానీ, వాయిదాపైగానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment