Panchayati Raj employees
-
థ్యాంక్యూ సీఎం జగన్ సర్: పంచాయతీ రాజ్ ఉద్యోగులు
అనంతపురం: గ్రూప్–1 ద్వారా నియమితులైన ఎంపీడీఓలకు, పంచాయతీ రాజ్ ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాతికేళ్ల తర్వాత పదోన్నతులకు మార్గం సుగమంచేసింది. దీంతో పంచాయతీ రాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం స్థానిక జెడ్పీ సమావేశ హాలులో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందన్నారు. ఎంపీడీఓ మొదలుకొని దిగువ స్థాయిలోని పన్నెండు కేడర్లకు చెందిన ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. పదోన్నతులు ఇవ్వడం ద్వారా జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డివిజనల్ అభివృద్ధి అధికారులు వంటి వివిధ రకాల పోస్టులు రెగ్యులర్ బేసిస్‌లో భర్తీ కానున్నాయన్నారు. పదోన్నతుల విషయంలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఏఓ విజయప్రసాద్, ఎంపీడీఓల సంఘం కార్యదర్శి దివాకర్, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, షేక్షావలి, ఈఓఆర్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు సౌజన్య తదితరులు పాల్గొన్నారు. పాతికేళ్లకు పదోన్నతులు పంచాయతీ రాజ్ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాయలసీమ జోన్ (అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు) పరిధిలోని 21 మందికి పదోన్నతులు కల్పిస్తూ ఎస్ఈ భాగ్యరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారు ... అనంతపురం జిల్లాలో ఇద్దరు జేటీఓలకు ఏటీఓలుగా, పదిమంది వర్క్ ఇన్స్పెక్టర్లను జేటీఓలుగా, కర్నూలు జిల్లాలో ఏటీఓ నుంచి టీఓగా ఒకరు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా ఒకరు, చిత్తూరు జిల్లాలో ఏటీఓ నుంచి టీఓగా ఒకరు, వైఎస్సార్ జిల్లాలో జేటీఓ నుంచి ఏటీఓగా ఇద్దరు, వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి జేటీఓగా ముగ్గురు, సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా ఒకరికి పదోన్నతి కల్పించారు. -
పంచాయతీ కార్యదర్శుల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9,355 పంచాయతీరాజ్ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. నియామక ప్రక్రియకు శాఖాపరమైన ఎంపిక కమిటీ (డీఎస్సీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో నం.77 విడుదల చేశారు. కొత్త జిల్లాల స్థానికత ఆధారంగానే పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నారు. ప్రతి జిల్లాకు రోస్టర్ ప్రారంభిస్తారు. మార్గదర్శకాలు ఇవే ♦ నోటిఫికేషన్ విడుదలైన 10 రోజుల్లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ♦ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ♦ జనరల్ అభ్యర్థులకు వయసు 18–39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు ఐదేళ్లు.. వికలాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ♦ హైదరాబాద్ అర్బన్ జిల్లా మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో నివసించే వారు ఆయా కొత్త జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టులను అన్ రిజర్వ్డ్గా పరిగణిస్తారు. ♦ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల మెరిట్ లిస్టు తయారు చేస్తారు. పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఒక్కో పేపరుకు 150 మార్కులు, మూడు గంటల వ్యవధి ఉంటుంది. ♦ మొదటి పేపరులో జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, రెండో పేపరులో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018, పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక పాలన, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలు, ప్రభుత్వ పథకాలపై నుంచి ప్రశ్నలొస్తాయి. ♦ ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పుడు సమాధానానికి 1/3 మార్కు కోత ఉంటుంది. ♦ పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.250. ♦ పరీక్ష అనంతరం కొత్త జిల్లాల వారీగా తయారు చేసిన మెరిట్ లిస్టును పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి, అక్కడి నుంచి కలెక్టర్లకు పంపుతారు. కలెక్టర్లు రోస్టర్ పద్ధతి ప్రకారం నియామకాలు జరుపుతారు. శాఖాపరమైన ఎంపిక కమిటీ ఇదే! కమిటీకి పంచాయతీరాజ్ కమిషనర్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్, పంచాయతీరాజ్ అదనపు కార్యదర్శి, సెర్ప్ సీఈవో, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయ శాఖల ప్రతినిధులు (డిప్యూటీ సెక్రటరీ హోదా కు తక్కువ కానివారు) సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్ కమిషనర్ నియమించే డిప్యూటీ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. -
‘పంచాయతీ’ ఉద్యోగుల బదిలీల్లో జాప్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలపై అస్పష్టత కొనసాగుతోంది. జూలైలో గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. మే ఆఖరు వరకు ఇది పూర్తయ్యే అవకాశముంది. అనంతరం జిల్లాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యలను తేల్చడం, గ్రామాల వారీగా రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. బీసీ ఓటర్ల గణన మధ్యలో ఉన్నందున ఈ శాఖ ఉద్యోగులకు ఇప్పుడే బదిలీలు ఉండవని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మే 25 నుంచే బదిలీల ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖలో దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు ఏవీ ఆ శాఖ ఉన్నతాధికారులకు చేరలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు వాయిదా పడినట్లేనని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే బదిలీలపైగానీ, వాయిదాపైగానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం
నిజామాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 36రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజమాబాద్‌లో పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ... తాము దుర్భర జీవితం అనుభవిస్తున్నామని... తమకు న్యాయం చేయాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 36 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కనీసం పట్టించుకో లేదనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. -
సమ్మె విరమించిన సీమాంధ్ర గెజిటెడ్,పంచాయతీ ఉద్యోగులు
హైదరాబాద్: సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆ ఉద్యోగుల నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించమని ముఖ్యమంత్రి వారిని కోరారు. అందుకు వారు అంగీకరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని సమ్మె విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల నేతలు చెప్పారు. అవసరమనుకుంటే మళ్లీ సమ్మె చేస్తామని వారు చెప్పారు.