సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9,355 పంచాయతీరాజ్ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. నియామక ప్రక్రియకు శాఖాపరమైన ఎంపిక కమిటీ (డీఎస్సీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో నం.77 విడుదల చేశారు. కొత్త జిల్లాల స్థానికత ఆధారంగానే పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నారు. ప్రతి జిల్లాకు రోస్టర్ ప్రారంభిస్తారు.
మార్గదర్శకాలు ఇవే
♦ నోటిఫికేషన్ విడుదలైన 10 రోజుల్లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
♦ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
♦ జనరల్ అభ్యర్థులకు వయసు 18–39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు ఐదేళ్లు.. వికలాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
♦ హైదరాబాద్ అర్బన్ జిల్లా మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో నివసించే వారు ఆయా కొత్త జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టులను అన్ రిజర్వ్‌డ్‌గా పరిగణిస్తారు.
♦ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల మెరిట్ లిస్టు తయారు చేస్తారు. పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఒక్కో పేపరుకు 150 మార్కులు, మూడు గంటల వ్యవధి ఉంటుంది.
♦ మొదటి పేపరులో జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, రెండో పేపరులో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018, పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక పాలన, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలు, ప్రభుత్వ పథకాలపై నుంచి ప్రశ్నలొస్తాయి.
♦ ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పుడు సమాధానానికి 1/3 మార్కు కోత ఉంటుంది.
♦ పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.250.
♦ పరీక్ష అనంతరం కొత్త జిల్లాల వారీగా తయారు చేసిన మెరిట్ లిస్టును పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి, అక్కడి నుంచి కలెక్టర్లకు పంపుతారు. కలెక్టర్లు రోస్టర్ పద్ధతి ప్రకారం నియామకాలు జరుపుతారు.
శాఖాపరమైన ఎంపిక కమిటీ ఇదే!
కమిటీకి పంచాయతీరాజ్ కమిషనర్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్, పంచాయతీరాజ్ అదనపు కార్యదర్శి, సెర్ప్ సీఈవో, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయ శాఖల ప్రతినిధులు (డిప్యూటీ సెక్రటరీ హోదా కు తక్కువ కానివారు) సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్ కమిషనర్ నియమించే డిప్యూటీ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment