మాట్లాడుతున్న జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి
అనంతపురం: గ్రూప్–1 ద్వారా నియమితులైన ఎంపీడీఓలకు, పంచాయతీ రాజ్ ఉద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాతికేళ్ల తర్వాత పదోన్నతులకు మార్గం సుగమంచేసింది. దీంతో పంచాయతీ రాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం స్థానిక జెడ్పీ సమావేశ హాలులో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయిందన్నారు.
ఎంపీడీఓ మొదలుకొని దిగువ స్థాయిలోని పన్నెండు కేడర్లకు చెందిన ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. పదోన్నతులు ఇవ్వడం ద్వారా జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డివిజనల్ అభివృద్ధి అధికారులు వంటి వివిధ రకాల పోస్టులు రెగ్యులర్ బేసిస్‌లో భర్తీ కానున్నాయన్నారు. పదోన్నతుల విషయంలో న్యాయం చేసిన ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఏఓ విజయప్రసాద్, ఎంపీడీఓల సంఘం కార్యదర్శి దివాకర్, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, షేక్షావలి, ఈఓఆర్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
పాతికేళ్లకు పదోన్నతులు
పంచాయతీ రాజ్ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాయలసీమ జోన్ (అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు) పరిధిలోని 21 మందికి పదోన్నతులు కల్పిస్తూ ఎస్‌ఈ భాగ్యరాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతులు పొందిన వారు ...
అనంతపురం జిల్లాలో ఇద్దరు జేటీఓలకు ఏటీఓలుగా, పదిమంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను జేటీఓలుగా, కర్నూలు జిల్లాలో ఏటీఓ నుంచి టీఓగా ఒకరు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా ఒకరు, చిత్తూరు జిల్లాలో ఏటీఓ నుంచి టీఓగా ఒకరు, వైఎస్సార్ జిల్లాలో జేటీఓ నుంచి ఏటీఓగా ఇద్దరు, వర్క్ ఇన్‌స్పెక్టర్ నుంచి జేటీఓగా ముగ్గురు, సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా ఒకరికి పదోన్నతి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment