కలుషిత ఆహారంతో యువతి మృతి? | Contaminated food in a woman? | Sakshi
Sakshi News home page

కలుషిత ఆహారంతో యువతి మృతి?

Published Thu, Apr 3 2014 12:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

కలుషిత ఆహారంతో యువతి మృతి? - Sakshi

కలుషిత ఆహారంతో యువతి మృతి?

  •     మరో 23 మందికి అస్వస్థత
  •      వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం
  •      బేక్‌వెల్ బేకరీని సీజ్ చేసిన ఏఎంహెచ్‌ఓ
  •      పోలీసుల అదుపులో దుకాణం యజమాని
  •  సంతోష్‌నగర్/నల్లకుంట, న్యూస్‌లైన్: ఓ బేకరీలో పాడైపోయిన బర్గర్లు తిన్న ఘటనలో యువతి మృతి చెందగా... మరో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పాతబస్తీ హఫీజ్‌బాబా నగర్‌లో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన బుధవారం ఓ బాధితుడు ఫిర్యాదు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది.

    కంచన్‌బాగ్ పోలీసుల కథనం ప్రకారం.. హఫీజ్ బాబానగర్‌లోని ఉమర్ హోటల్ పక్కన ఉన్న బేక్‌వెల్ బేకర్స్ దుకాణంలో మూడు రోజుల క్రితం సుమారు 50 మంది బర్గర్లు కొనుగోలు చేసి తిన్నారు. వీరిలో 24 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంధువులు వీరిని వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో యాకుత్‌పురాకు చెందిన ఖతీజాబేగం(20) ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.

    ఆమె కలుషిత ఆహారం వల్ల మృతి చెందిందా లేక ఇతర కారణాల వల్లా అన్నది తెలియ రాలేదు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా బాధితుల్లో బార్కాస్‌కు చెందిన కరీమున్నిసా(32), చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన మహ్మద్ హమీద్(18), అజీజ్ (36), మహ్మద్ ఇబ్రహీం (18) మహ్మద్ అలీముద్దీన్ (18), గౌసియా బేగం (18), రోషన్‌బేగం (21), మొహియుద్దీన్ గౌసియా బేగం(20), మహ్మద్ ఇస్మాయిల్ (18) నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వీరిలో గౌసియా బేగం(21), మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బార్కాస్ ఆసుపత్రిలో 8మంది, ఒవైసీ ఆసుపత్రిలో మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు.
     
    బేకరీని సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

     
    దక్షిణ మండలం సర్కిల్-4 ఏఎంహెచ్‌వో వెంకటరమణ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ రెడ్డిల బృందం బేక్‌వెల్ బేకర్స్ తినుబండారాలను పరిశీలించి స్వాధీనం చేసుకొన్నారు. దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ విషయమై జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం సర్కిల్-4 ఏఎంహెచ్‌వో  వెంకటరమణతో పాటు బార్కాస్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బేకర్స్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.  
     
    బేకరీ వద్ద ఉద్రిక్తత
     
    హఫీజ్‌బాబానగర్‌లోని బేకర్స్ బేకరీలో పిజ్జాలు తిన్న వినియోగదారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఒకరు మృతి చెందారన్న వార్త దాహనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున బేకరి వద్దకు చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
     
    బేకరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి
     
    కాగా ఈ బేకరీలో బర్గర్లు, పిజ్జాలు తిని తామంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యామని అరుంధతి కాలనీకి చెందిన నవీన్, మహేష్, మహ్మద్ అలీం, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అరవింద్‌లతో పాటు పలువురు న్యూస్‌లైన్‌కు వెల్లడించారు. బేకరీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
     
    అందరికీ మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం
     
    ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతక గురై ఫీవర్ ఆస్పత్రిలో చేరిన రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. శంకర్ తెలిపారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement