లంచావతారుల్లో ఏసీబీ గుబులు | Corruption Officials Fear on ACB Rides Medchal | Sakshi
Sakshi News home page

లబ్‌ డబ్బు

Published Fri, Nov 8 2019 12:15 PM | Last Updated on Fri, Nov 8 2019 12:15 PM

Corruption Officials Fear on ACB Rides Medchal - Sakshi

డీపీఓ రవికుమార్‌ ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఏసీబీ చేస్తున్న దాడులు అవినీతి అధికారులు, ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మేడ్చల్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పలు శాఖల కార్యాలయాల్లో వరుసగా ఏసీబీ దాడులు చేస్తుండడంతో కలెక్టరేట్‌కు అవినీతి మచ్చ తప్పదని ఉద్యల్లోను కలవరపెడుతోంది. తాజాగా గురువారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో  రూ.లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ.. ఏసీబీకి పట్టుబడ్డారు. గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్‌ భేరి ఈశ్వర్‌ 2014 ఏప్రిల్‌ నుంచి 2019 జూన్‌ వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల ఆడిట్‌ రిపోర్టును క్లియర్‌ చేసేందుకు రూ.15 లక్షలు ఇవ్వాలని డీపీఓ రవికుమార్‌ డిమాండ్‌ చేయగా, ఇరువురి మధ్య రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా ఈశ్వర్‌ నుంచి డీపీఓ అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడాది కాలంలో పలువురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన సంఘటనలు ఉన్నాయి. 

ఇటీవల సెప్టెంబర్‌ నెలలో బాచుపల్లి మండలం తహశీల్దార్‌ యాదగిరి స్థానిక బిల్డర్‌ నుంచి ప్లాట్ల(భూమి) విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.  
ఆగస్టులో జిల్లా కో–ఆపరేటివ్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, మేనేజర్‌ ఓ సొసైటీకి సంబంధించి అడిట్‌ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు.  
జూన్‌లో బాచుపల్లి మండలంలో భూమి పట్టా జారీకి ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అప్పటి డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీదేవి ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యారు.  
ఈ ఏడాది మే నెలలో మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సైతం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.  
మేలోనే దుండిగల్‌ మున్సిపాలిటీకి చెందిన మేనేజర్‌ గోవిదరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ క్రిష్ణారెడ్డి సహా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇద్దరు బిల్‌ కలెక్టర్లు.. ఒక కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్డు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం విషయంలో పెండింగ్‌ బిల్లు ఇవ్వటానికి మేనేజర్‌ గోవిందరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ క్రిష్ణారెడ్డి లంచం తీసుకోవడంతో వారిని కలెక్టర్‌ సైతం సస్పెండ్‌ చేశారు.  
కీసర మండలం చీర్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 219లోని నాలుగు ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలను అడ్డుకోవటంలో నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శాంతిపై కూడా కలెక్టర్‌ వేటు వేశారు.  
గతంలో అంటే 2017లో డీఈఓ ఉషారాణి అవినీతికి పాల్పడిందన్న అభియోగాల నేపథ్యంలో సస్పెన్షన్స్‌కు గురయ్యారు.

జిల్లాలో పలువురు అధికారులు, ఉద్యోగుల అవినీతి, అక్రమాల బాగోతం ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఉద్యోగవర్గాల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, పౌర సరఫరాలు, నీటిపారుదల, పీఆర్, ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్, గనులు, భూగర్భ వనరులు, ఆర్టీఓ, ఎక్సైజ్‌ శాఖల్లో పనిచేస్తున్న పలువురు అవినీతి ఉద్యోగుల లెక్కలు సైతం ఇప్పుడు ఏసీబీ చేతిలో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మరోపక్క మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి సంఘటనల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో పాతుకుపోయిన అవినీతి ఉద్యోగుల పనిట్టడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఆయా అధికారులు, ఉద్యోగులకు భయం పట్టుకుంది.

కొంపల్లిలో సైతం సోదాలు
కుత్బుల్లాపూర్‌: కీసర కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ ఇంట్లో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. కొంపల్లిలోని లక్ష్మీ గణపతి నిలయం అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ నెం.205లో ఉంటున్న రవికుమార్‌ నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేసి చేసి పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో పాటు పలు డాంక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. కాగా, రవికుమార్‌ భార్య సంధ్యారాణి దూలపల్లిలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఈమె వాడుతున్న కారును సైతం ఏసీబీ తనిఖీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement