విక్రయానికి వచ్చిన పత్తిలో సన్నగా ఉండే ఎర్రని పురుగులు పాకి..కాంటా కార్మికులు, పత్తి బస్తాలు మోసే హమాలీలు ఒళ్లంతా దురదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు.
జర ‘పత్తిం’చుకోండి..!
Published Mon, Mar 13 2017 12:23 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
► దూదిలో పురుగులు..పాకితే ఒళ్లంతా దురదలు
► ఖమ్మం మార్కెట్‌లో హమాలీల తిప్పలు
ఖమ్మం:
విక్రయానికి వచ్చిన పత్తిలో సన్నగా ఉండే ఎర్రని పురుగులు పాకి..కాంటా కార్మికులు, పత్తి బస్తాలు మోసే హమాలీలు ఒళ్లంతా దురదలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొన్ని రోజులుగా ఈ పరిస్థితి నెలకొని..దద్దుర్లతో పనిచేయలేక, ఎండక విపరీతమైన మంట పడుతూ..అధికారులు జర పట్టించుకోవాలని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కార్మికులు, హమాలీలు కోరుతున్నారు
.
బస్తాల్లోంచే పురుగులు...
పత్తిని రైతులు బస్తాల్లో నింపుకొని అమ్మకానికి తెస్తున్నారు. ఈ బస్తాలను కాంటాలు వేయడం, వాటిని లోడ్ చేయడం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మార్కెట్‌లో చేస్తుంటారు. కార్మికులు ఈ ప్రక్రియంతా దగ్గరుడి చేశాక..తిరిగి కుట్టడం, బస్తాల వెంట పడిన పత్తిని వేరడం వంటి పనులను హమాలీలు, కార్మికులు, స్వీపర్లు చేస్తుంటారు. పనులు చేసే సందర్భాల్లో ఈ బస్తాలపైనే కూర్చుంటారు. ఈ పత్తి బస్తాల నుంచి సన్నని, గులాబీ రంగులో ఉండే సూక్ష్మమైన పురుగు కార్మికులపై పాకి కుడుతోంది. కంటికి కూడా స్పష్టంగా కనిపించని విధంగా ఈ పురుగులు ఉంటున్నాయి. శరీరంపై పారటం, కుట్టడం కారణంగా దద్దుర్తు వస్తున్నాయి. కాంటాల సమయంలో బస్తాలను మోసే కార్మికులు, వాహనాలపై లోడ్ చేసే ట్రాలీ కార్మికులు, బస్తాల వెంట పని చేసే స్వీపర్లకు, దడవాయిలకు ఈ పురుగులు పారడం వలన అనారోగ్యం పాలవుతున్నా రు. వీపు, పొట్ట, భుజాలు, తలపై దద్దుర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో దురద, మంటతో అవస్థ పడుతున్నారు. భరించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రుల్లో చూయించుకొని ఆయింట్‌మెంట్లు, ట్యాబ్లెట్లు వాడుతున్నట్లు చెబుతున్నారు. రాత్రి వేళల్లో నిద్ర పట్టడం లేదని, ఒళ్లంతా మంటగా ఉంటోందని చెబుతున్నారు.
వైద్యశిబిరం ఏర్పాటుకు నిర్ణయం..
తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక సంఘ నాయకులు నున్నా మాధవరావు నేతృత్వంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని పలు విభాగాలకు చెందిన కార్మిక సంఘాల నాయకులు మార్కెట్ కమిటి ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాద్‌రావు ద్వారా చైర్మన్ ఆర్జేసీ కృష్ణ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యశిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం హెల్త్ క్యాంపు నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పాలకుర్తి ప్రసాద్ రావు ‘సాక్షి’కి వివరించారు.
Advertisement
Advertisement