
హైదరాబాద్: అంతరిక్ష రంగంలో మనదేశం ప్రపంచానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ఇస్రో, స్పేస్ కమిషన్ మాజీ చైర్మన్, కేంద్ర స్పేస్ విభాగం సలహాదారు డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో ఉత్తమమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నామన్నారు. మాజీ సీఎం దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతిని పురస్కరించుకొని చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం బేగంపేట సెస్ ప్రాంగణంలో నిర్వహించిన చెన్నారెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్, మంగళ్‌యాన్ తదితర ప్రయోగాలు మన శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇటీవల 630 టన్నుల బరువున్న జీఎస్‌ఎల్వీ–ఎంకే 3 నౌక ప్రయోగంలో 3,200 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. దేశీయంగా రూపొందించిన క్రయోజినిక్ ఇంజన్లతో చేసిన వరుస ప్రయోగాలు రాకెట్ టెక్నాలజీ రంగంలో మేలుమలుపుగా చెప్పవచ్చన్నారు.
ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో దేశం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని, భవిష్యత్‌లో మరిన్ని స్థానాలు మెరుగు పరచుకోవడానికి ఇస్రో నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అమెరికాకు చెందిన నాసా బడ్జెట్ 19 బిలియన్ డాలర్లు ఉంటే.. ఇస్రో బడ్జెట్ 1.2 బిలియన్ డాలర్లు మాత్రమేనని, అయినా మనం మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రతీ అంతరిక్ష ప్రయోగం దేశంలోని పేదలకు పరోక్షంగా ఉపయోగపడేదేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలు, సౌర వ్యవస్థలోకి మానవ రహిత ప్రయోగాలు సహ పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.