రైతును రాజును చేసిన ఘనత వైఎస్దే: వైఎస్ షర్మిల | credit goes to YSR, says YS sharmila | Sakshi
Sakshi News home page

రైతును రాజును చేసిన ఘనత వైఎస్దే: వైఎస్ షర్మిల

Published Sat, Jan 24 2015 6:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

రైతును రాజును చేసిన ఘనత వైఎస్దే: వైఎస్ షర్మిల

రైతును రాజును చేసిన ఘనత వైఎస్దే: వైఎస్ షర్మిల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదవాడిని తన భుజాన మోసి, రైతును రాజును చేశాడు కాబట్టే ఆయన కోట్లాది మంది తెలుగు గుండెల్లో రాజన్నగా కొలువుదీరాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదర షర్మిల అన్నారు. నల్లగొండ జిల్లాలో నాలుగోరోజు శనివారం పరామర్శయాత్రలో భాగంగా షర్మిల హుజూర్‌నగర్ నియోజక వర్గంలో  పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓ నాయకుడి గురించి వందలాది గుండెలు ఆగిపోయిన చరిత్ర ఎప్పుడూ లేదని, అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనే జరిగిందని అన్నారు.

రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడ్డ వైఎస్ వారి కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని, లక్షలాది మంది పేదలు తలెత్తుకుని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారని, కుయ్...కుయ్...కుయ్ అంటూ వచ్చిన 108 వాహనం లక్షలాది మందికి ప్రాణం పోసిందని చెప్పారు.

ఏ పన్ను, చార్జీలు పెంచకుండానే అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ నిలిచిపోయారని ఆమె అన్నారు. వైఎస్ ఆశయాలను మనమే ముందుకు తీసుకెళ్లాలని, ఆయన పథకాలను మనమే కొనసాగించుకోవాలని, అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి చేయి కలపాలని షర్మిల ప్రజలను కోరారు. షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులున్నారు.


నాలుగోరోజు ఐదు కుటుంబాలకు పరామర్శ

పరామర్శయాత్రలో భాగంగా షర్మిల నాలుగోరోజు ఐదు కుటుంబాలను పరామర్శించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. అందరినీ పలకరించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని, ఆ తర్వాత గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో వెంకటగిరి జయమ్మ, హుజూర్‌నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్‌లో లింగంపాండు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం భోజన విరామం తర్వాత మేళ్లచెర్వు మండల కేంద్రంలోని చల్లాపూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ పూర్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి అదే మండలంలోని కందిబండ గ్రామంలో పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడంతో నాలుగోరోజు యాత్ర ముగిసింది.


వైఎస్ విగ్రహావిష్కరణ

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం బస్టాండ్ సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ..ఇన్నేళ్లయినా నాన్నను గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement