పెద్దదిక్కుగా ఉంటాం: షర్మిల | Ys Sharmila paramarsa yatra | Sakshi
Sakshi News home page

పెద్దదిక్కుగా ఉంటాం: షర్మిల

Published Mon, Jan 4 2016 11:33 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

పెద్దదిక్కుగా ఉంటాం: షర్మిల - Sakshi

పెద్దదిక్కుగా ఉంటాం: షర్మిల

మెదక్ జిల్లాలో రెండ్రోజుల్లో 13 కుటుంబాలకు పరామర్శ
♦ ఆత్మీయ స్వాగతంతో అక్కున చేర్చుకున్న ప్రజలు.. ముగిసిన యాత్ర
♦ నేటి నుంచి మూడ్రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పరామర్శ
♦ మొత్తం 13 కుటుంబాలను కలవనున్న వైఎస్ తనయ
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గుండె చెదిరిన వారికి ధైర్యం చెప్పారు.. అండగా నిలబడతామని అభయమిచ్చారు. ఆత్మీయ పలకరింపుతో అక్కున చేర్చుకున్నారు..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మెదక్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల రెండు రోజులు జిల్లాలో పర్యటించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆదివారం ఏడు కుటుంబాలను పరామర్శించిన ఆమె.. సోమవారం 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి 6 కుటుంబాలను కలిశారు.

నర్సాపూర్, ఆందోల్ నియోజకవర్గాల్లో ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. దుబ్బాక నుంచి రెండోరోజు పర్యటన ప్రారంభించిన షర్మిల మొదట కూడవెళ్లిలో కొండ్ర బాలయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ్నుంచి భూంపల్లి మీదుగా దౌల్తాబాద్ మండలం కొత్తపల్లి వెళ్లి అమ్మొళ్ల పోచయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కౌడిపల్లి మండలం కొట్టాలలో గారబోయిన నారాయణ, హత్నూర మండలం బ్రాహ్మణగూడెంలో తిమ్మాపురం కిషన్, మునిపల్లి మండలం తాటిపల్లిలో గోవింద్‌గారి రాజేందర్, కొండాపూర్ మండలం గొల్లపల్లిలో గడీల పార్వతమ్మ కుటుంబాలను పరామర్శించారు. ‘‘అధైర్యపడొద్దు.. మీ బతుకులు మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. మీ జీవితాలను మార్చడానికి నేనున్నా..’ అంటూ తన ముందు కంటతడి పెట్టుకున్న మహిళల కన్నీళ్లను షర్మిల తుడిచారు.

 సర్పంచుల స్వాగతం
 నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం బ్రాహ్మణగూడేనికి షర్మిల వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న సమీప గ్రామాల్లోని దాదాపు 20 మంది సర్పంచులు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు. వారితో షర్మిల కొద్దిసేపు మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో గ్రామాలు పరిపుష్టిగా ఉన్నాయని, రైతులు ఆర్థికంగా బాగున్నారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరువు తరుముతోంది.. ఊరు పొమ్మం టోంది. ఊళ్లో ఉంటే బతుకు లేదు బిడ్డా..తాగటానికి కూడా నీళ్లు దొరుకుతలేదు. మా ఊరి చుట్టూ నాలుగు బీరు ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ చేతికి రూపాయి పని దొరుకుత లేదు.

వానలు పడితే రైతుకు మేలు. ఇప్పుడు వానలు ఉన్నయా? ఆ వానలు మీ నాన్నతోనే పోయినయ్..’’ అంటూ గొల్లపల్లికి చెందిన గడీల లక్ష్మమ్మ షర్మిల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. పరామర్శ యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీశ్వ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు న ర్రా భిక్షపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శులు కె.వెంకట్‌రెడ్డి, విలియం మునిగాల, జి.ధనలక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్.షర్మిల సంపత్ తదితరులున్నారు.
 
 నేటి నుంచి ‘గ్రేటర్’లో పరామర్శ యాత్ర
 సాక్షి, సిటీబ్యూరో: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం కూడా షర్మిల మెదక్ జిల్లాలో పర్యటించి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించాలి. అయితే ఎన్నికల కోడ్ వస్తే హైదరాబాద్ జిల్లాలో ఆత్మబంధువులను కలవడం సాధ్యం కాదని పార్టీ నేతలు చేసిన సూచనతో షర్మిల తన షెడ్యూల్ మార్చుకున్నారు. మెదక్‌లో రెండ్రోజుల్లోనే పరామర్శలను పూర్తి చేసి, సోమవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం నుంచి మూడ్రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో షర్మిల పరామర్శ యాత్ర చేపడతారు. తొలిరోజు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో 8 కుటుంబాలను పరామర్శిస్తారు.

బుధవారం సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో 7 కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో 2 కుటుంబాలను పరామర్శిస్తారు. ‘గ్రేటర్’లో షర్మిల తలపెట్టిన పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఆదం విజయ్‌కుమార్, సురేష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement