అసెంబ్లీలో ‘ఆశ’ సమస్య
♦ ప్రస్తావిస్తామని హామీనిచ్చిన షర్మిల
♦ వైఎస్ బతికి ఉంటే ఆశ కార్యకర్తలు పర్మనెంట్ అయ్యేవారు
♦ ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న రాజన్నకు మరణం లేదు
♦ చేయి చేయి కలిపి ఆయన ఆశయాలు సాధించుకుందాం
♦ ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు కొనసాగిన పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: మహానేత వైఎస్సార్ బతికుంటే ఆశ కార్యకర్తలు పర్మనెంట్ ఉద్యోగులు అయ్యేవారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆశ కార్యకర్తల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీనిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన వేమనపల్లి మండలంలో యాత్ర సాగింది. లక్ష్మీపూర్‌లో గండ్రపెద్ద రామారావు కుటుంబీకులను పరామర్శించారు.
అటవీప్రాంతమైన ఖానాపూర్ మండలం తాటిగూడలో గుగ్లావత్ మంగ్యానాయక్, ఇదే మండలం సత్తన్నపల్లిలో భూక్యా వసంత నాయక్, జన్నారం మండల కేంద్రంలో రాథోడ్ లుంబా నాయక్, కడెం మండలం లింగాపూర్‌లో కొలిప్యాక భూమన్న కుటుం బీకులకు భరోసా కల్పించారు. యాత్రలో భాగంగా బెల్లంపల్లి, మంచిర్యాల, కన్నెపల్లిలో ఆశ కార్యకర్తలు షర్మిల వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. మంచి రోజులు ముందున్నాయని షర్మిల వారికి భరోసా కల్పించారు. అనంతరం జన్నారం మండల కేంద్రంలో పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రజల గుండెల్లో వైఎస్
ఒక నాయకుడు మరణిస్తే వందలాది మంది గుండెలు ఆగిపోయిన ఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని, రాష్ట్ర ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్‌కు మరణం లేదని షర్మిల పేర్కొన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ైవె ఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువై ఉంటారన్నారు. ‘‘వైఎస్ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వారు లబ్ధిపొందారు. కరెంట్, ఆర్టీసీ, గ్యాస్ వంటి చార్జీలు పైసా కూడా పెంచకుండానే అనేక పథకాలు అమలు చేశారు. మహిళల్ని అక్కాచెల్లెళ్లుగా భావిం చి వారికి పావలా వడ్డీకే రుణాలిచ్చారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు సర్కారు ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేశాయి. కానీ వైఎస్సార్ నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. కుయ్.. కుయ్.. అంటూ వచ్చే 108 వాహనాలు లక్షలాది మందికి ప్రాణం పోస్తున్నాయి. వైఎస్ బతికుంటే ఇల్లు లేని నిరుపేద రాష్ట్రంలో ఉండే వారు కాదు’’ అని పేర్కొన్నారు. చేయి చేయి కలిపి వైఎస్సార్ ఆశయాలు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఒకేసారి రుణమాఫీ చేయాలి
రైతుల రుణాల్ని ఒకేసారి మాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. పొంగులేటి ఆధ్వర్యంలో సాగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ముస్తాఫా అహ్మద్, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రపుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, యాత్ర ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.భగవంత్‌రెడ్డి, వేముల శేఖర్, విలియం మునిగెల, మేస్రం శంకర్, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్న గౌడ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు సుమిత్‌గుప్త, మాజీద్‌ఖాన్, ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి నిజామాబాద్ జిల్లాలో యాత్ర
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: షర్మిల సోమవారం నుంచి రెండ్రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. తొలిరోజు బాల్కొండ మండలం దూద్‌గాం నుంచి మొదలవుతుంది. తొలిరోజు ఆరు, మరుసటి రోజు ఆరు కుటుంబాలను కలుస్తారు. రెండు రోజుల్లో సుమారు 214 కిలోమీటర్లు ప్రయాణిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి తెలిపారు.