అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. సామాన్య జీవనంపైనా ఈ ప్రభావం పడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పంట పొలాల్లో ఉన్న ధాన్యం దెబ్బతినగా, మార్కెట్‌కు తెచ్చిన సరుకు కూడా తడిసి పోవడంతో ఇటు అన్నదాతలు, అటు వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఒక్క శుక్రవారం నాటి నష్టం విలువే రూ.2.26కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తమ శ్రమ ఇలా నీటిపాలు కావడంతో కర్షకులు కన్నీరు పెడుతున్నారు. దక్కిన పంట కూడా అమ్ముడు కాదేమోనని కలత చెందుతున్నారు.
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరులో భారీగా కురిసిన అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని తెచ్చింది.పెద్దకొత్తపల్లి మండలంలోని మరికల్‌లో ఓ ఇల్లు కూలి శాంతమ్మ(58) అనే మహిళ మృతి చెందింది. జిల్లాలో సగటు వర్షపాతం 26.42 మి.మీ.నమోదైంది.
గురువారం అర్థరాత్రి తర్వాత నుంచి శుక్రవారం వరకు జల్లులతో పడిన వర్షంతో జిల్లాలో 2,340 ఎకరాల్లో వరి , 200 ఎకరాల్లో టమాట తోటలు, 60 ఎకరాల్లొ వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయి. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షంతో సుమారుగా మూడు వేల బస్తాల ధాన్యం, 50 క్వింటాళ్ల మిర్చి తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలోనే ప్రకృతి వికటించడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, వెల్డంద, తలకొండపల్లి, మాడ్గుల, కల్వకుర్తి మండలాల్లో 1600 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా , మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. కల్వకుర్తి మార్కెట్‌లో ధాన్యం బస్తాలు తడిశాయి. పది క్వింటాళ్ల ధాన్యం నీటి పాలైంది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మార్కెట్‌యార్డులో వందలాది బస్తాల వరిధాన్యం వర్షంతో తడిసిపోయింది.
ఈ ధాన్యం పలువురు రైతులతో పాటు వ్యాపారులకు సంబంధించిందిగా అధికారులు తెలిపారు. పెబ్బేరు కొనుగోలు కేంద్రంలోని వంద బస్తాల ధాన్యం తడిసిపోయింది. షాద్‌నగర మార్కె ట్ యార్డులో రెండు వేల ధాన్యం బస్తాలు వర్షంతో తడిసిపోయాయి. ఇవి వ్యాపార వర్గాలకు చెందినవిగా అధికార వార్గాలు తెలిపాయి. జడ్చర్ల మార్కెట్‌లో వ్యాపారులకు చెందిన 500 ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మానవపాడు కల్లాల్లో 50 క్వింటాళ్ల మిర్చి వర్షంతో దెబ్బతిన్నది. జడ్చర్ల, మిడ్జిల్, నవాబుపేట మండలాల్లోని 600 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కొందుర్గు, కేశంపేట మండలాల్లోని 200 ఎకరాల్లో టమాట పంట పూర్తిగా దెబ్బతిన్నది. అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతల, బల్మూరు మండలాల్లో 140 ఎకరాల్లో వరి పంట, 60 ఎకరాల్లో వేరుశెనగ పంటలకు నష్టం జరిగింది. ఇక్కడనే కళ్లంలో ఉన్న 40 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది.
జనజీవనానికీ ఇక్కట్లే...
జిల్లాలో భారీగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం రైతులతో పాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కల్వకుర్తిలో భారీగా కురిసిన వర్షంతో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదురుకొన్నారు. వరద నీరు రాకుండా అ డ్డు కట్టలు వేసుకోవటంతో పాటు చేరిన నీటిని ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్‌తో పాటు పలు పట్టణాల్లో భారీగా కురిసిన వర్షంతో పలు రోడ్లు జలమయంగా మారాయి.
శుక్రవారం జిల్లాలో సగటు వర్షపా తం 26.42 మీ.మీ నమోదైంది. అత్యధికంగా నవాబుపేటలో 73.04 మిల్లీమీటర్లు, కొందు ర్గు, ఫరూక్‌నగర్‌లో 65 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కొడంగల్, ఊట్కూర్‌లో 4 మిల్లీ మీటర్లు, చిన్నచింతకుంటలో 3 మిల్లీమీటుర్ల వర్షం పడింది. బొంరాస్‌పేటలో వర్షపాతం నమోదుకాలేదు. జిల్లాలోని అలంపూర్, జడ్చర్ల, అచ్చంపేట, వనపర్తి, దేవరకద్ర, మక్తల్, కల్వకుర్తి, కొల్లాపూర్, కొడంగల్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో భారీగానే వర్షం పడడంతో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఆరబెడితేనే కొనుగోలు చేస్తరట
ధాన్యం ఆరబెట్టి తీసుకువస్తేనే కొంటామని వ్యాపారు లు చెబుతున్నారు. మూడు రోజుల కింద 80 బస్తాల ధాన్యాన్ని ఇక్కడికి తరలిస్తే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ధాన్యం తడిచిందని అగ్గువకు అడుగుతున్నారు.
- బాల్‌రాజు, టంకర, హన్వాడ
ధాన్యం తెచ్చి అయిదు రోజులైంది..
ఆరుగాలం కష్టపడి పండించిన వంద బస్తాల వరిధాన్యాన్ని మహబూబ్‌నగర్ మార్కెట్‌కు తరలిస్తే క్వింటాల్ ధర రూ.850 నుంచి రూ.950 వరకు కొనుగోలు చేస్తామని వ్యాపారులు వేధిస్తున్నారు. మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. 5 రోజుల నుంచి ఈ మార్కెట్‌యార్డులోని ధాన్యం అమ్ముకోవడానికి నిరీక్షిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కొంత ధాన్యం తడిసింది. భారీ వర్షం వస్తే నా ధాన్యం పరిస్థితేంటో అర్థం కావడం లేదు.
- భానురెడ్డి, పాలకొండ, మహబూబ్‌నగర్ మండలం
రూ.750కే ఇవ్వమంటున్నారు.
మార్కెట్‌యార్డుకు 50 బస్తాల ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చి 5 రోజులవుతోంది. మద్ధతు ధరతో తీసుకోవడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. క్వింటాల్ రూ..750 చొప్పున ఇవ్వాలని అంటున్నారు. మద్ధతు ధర వచ్చేంత వరకు ధాన్యంతో ఇక్కడనే ఉంట. అధికారులు మా బాధలు చూడాలి.
- ఆశన్న, పాలకొండ, మహబూబ్‌నగర్.
తడిసిందని కొంటలేరు...
మహబూబ్‌నగర్ మార్కెట్‌కు 3 రోజుల కింద 36 బస్తాల వరిధాన్యాన్ని అమ్మకానికి తెచ్చాం. వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. రెండు రోజులుగా తక్కువ ధరతో కొంటారట.. ధాన్యం తడిసిందని క్వింటాల్‌కు రూ.1180 కంటే ఎక్కువ పెట్టమంటున్నారు. మిల్లర్లతో మాట్లాడితే రూ.1300లకు కొంటామన్న పచ్చి కటింగ్ కింద బస్తాకు 5 కిలోలు తీసివేస్తామంటున్నారు. మళ్లీ వర్షం వస్తే పరిస్థితేందో అర్థం కావడం లేదు.
- ఆంజనేయులుగౌడ్, పెద్దదర్పల్లి, హన్వాడ మండలం
‘వృష్టి’...నష్ట సృష్టి
Published Sat, May 10 2014 2:49 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement