లోకల్ వాళ్లకే ఇవ్వాలి | Dalit leaders met TRS | Sakshi
Sakshi News home page

లోకల్ వాళ్లకే ఇవ్వాలి

Published Wed, Jun 24 2015 4:13 AM | Last Updated on Sat, Mar 9 2019 3:30 PM

లోకల్ వాళ్లకే ఇవ్వాలి - Sakshi

లోకల్ వాళ్లకే ఇవ్వాలి

- ఎంపీ టిక్కెట్‌పై టీఆర్‌ఎస్ దళిత నేతల డిమాండ్
- ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికే టిక్కెట్
- టీఆర్‌ఎస్ దళిత నేతల భేటీ
- గులాబీ బాస్‌ను కలవాలని నిర్ణయం
సాక్షి ప్రతినిధి, వరంగల్ :
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ విషయంలో పోటీ పెరుగుతోంది. ఉద్యమంలో పని చేసినవారు, తర్వాత పార్టీలోకి వచ్చిన వారి అంశంపై ఇప్పుడు అధిక చర్చ జరుగుతోంది. వీటికి తోడు స్థానికత అనేది ఇప్పుడు ప్రధాన  అంశంగా మారింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో జిల్లాలోని నేతలకే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌లోని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

ఈ అంశంపై జిల్లాలో గులాబీ పార్టీ ముఖ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హన్మకొండలోని ఓ దళిత నేత ఇంట్లో ఈ భేటీ జరిగింది. తెలంగాణ ఉద్యమం కీలక సమయంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పని చేసిన పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, జన్ను జకారియా, ప్రొఫెసర్ సాంబయ్య, జోరిక రమేశ్, చింతల యాదగిరి ఈ భేటీలో పాల్గొన్నారు. త్వరలోనే జిల్లాలోని టీఆర్‌ఎస్ దళిత నేతలు మరోసారి భేటీ కావాలని అనుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను త్వరలోనే స్వయంగా కలిసి స్థానికులకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతల ద్వారా ముఖ్యమంత్రిని కలవాలని అనుకున్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు టి.హరీశ్‌రావు, కేటీఆర్, కవితలను కలిసి జిల్లాలో పోటీ చేసే అవకాశం ఇచ్చే అంశంపై తమ అభిప్రాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్ టిక్కెట్ స్థానికులకే ఇవ్వాలనే అంశంపై వీలైనంత త్వరగా జిల్లాలోని దళిత కులాల నేతలందరితో మరోసారి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు.
 
అంతటా చర్చ

టీఆర్‌ఎస్‌లో ‘స్థానిక’ అంశం తెరపైకి రావడంపై చర్చ జరుగుతోంది. జిల్లాకు సంబంధం లేని పలువురు గులాబీ నేతలు ఇటీవల వచ్చి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పుకుటుండడం స్థానిక నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల బాధ్యుడు గాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక నేతలు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్లోనే ఒకరికి అవకాశం ఇచ్చే ఉద్దేశంలో ఉందని.. కాంగ్రెస్ ఇదే విధంగా నిర్ణయం తీసుకున్న సందర్భంలో టీఆర్‌ఎస్ స్థానికేతరులకు అవకాశం ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు.
 
టీఆర్‌ఎస్‌లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వారికే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేతను కోరాలని స్థానిక నేతలు నిర్ణయానికి వచ్చారు. కొత్తగా కొందరు నేతలు, తటస్థులు పార్టీ టిక్కెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నికలు జరిగే తేదీలో స్పష్టత లేనప్పటికీ అవకాశం విషయంలో మాత్రం టీఆర్‌ఎస్‌లో ఇప్పుడే హడావుడి మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement