క్షేత్రస్థాయి పరిశీలన గడువు పెంపు
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సర్కారు తాజా నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలనకు గడువుపెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ అధర్ సిన్హా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉచిత కేటగిరీలో వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆయా మండలాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించుకోవాలని, తక్కువ దరఖాస్తులు ఉండే బీ,సీ కేటగిరీ మండలాల్లో ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేయాలని అధర్ సిన్హా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఎక్కువ దరఖాస్తులున్న ‘ఏ’ కేటగిరీ మండలాల్లో పరిశీలన ప్రక్రియను మార్చి15లోగా పూర్తి చేయాలని సూచించారు.
పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే బీ,సీ కేటగిరీ మండలాల సిబ్బందిని ఏ కేటగిరీ మండలాలకు డిప్యుటేషన్‌పై పంపాలని కలెక్టర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే సరికి అర్హులైన వారికి పట్టాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం సమన్వయ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజేశ్వర్ తివారీ, సునీల్‌శర్మ, హర్‌ప్రీత్‌సింగ్, ఆర్వీ చంద్రవదన్, అహ్మద్ నదీమ్ సభ్యులుగా ఉన్నారు.