► వారంలోగా ప్రతిపాదనలు
► ఇవ్వకుంటే కఠిన చర్యలే
► ప్రాజెక్టుల నిర్మాణ ఏజెన్సీలకు
► నీటిపారుదల శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించని యెడల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. టెండర్ అగ్రిమెంట్‌ను రద్దు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలపై ఇప్పటివరకు ఏజెన్సీల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వ్యవహారాన్ని నీటి పారుదల శాఖ సీరియస్‌గా తీసుకుంది.
ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి బుధవారం సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, ఏజెన్సీలతో హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ)లు మురళీధర్, విజయ్‌ప్రకాశ్ హాజరయ్యారు. 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లోని 111 ప్యాకేజీల్లో స్టీలు, సిమెంట్, ఇంధన ధరలకు తోడు కార్మికుల కూలీ, యంత్ర పరికరాల ధరలకు అదనంగా చెల్లించడానికి జీవో 146లో ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలు నవంబర్ 30 నాటికే ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్కరూ ముందుకు రాలేదు.
దీంతో డిసెంబర్ 30వరకు ఒకమారు, జనవరి 15 వరకు మరోమారు గడువు పొడగించారు. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా ఏజెన్సీలతో అధికారులు సమావేశం నిర్వహించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు లేవనెత్తిన అంశాలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న 19 ప్యాకేజీలు, కరీంనగర్ 20 ప్యాకేజీలు, ఆదిలాబాద్ జిల్లాలోని 6 ప్యాకేజీలపై సమీక్ష జరిగింది. ప్రాజెక్టుల పనులు ముందుకు కదలకపోవడంతో ఆయకట్టు లక్ష్యాలు దెబ్బతింటున్నాయని, రూ.10 వేల కోట్ల పనులు ఆగిపోయాయని జోషి వారి దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వ లక్ష్యాలు చేరుకోవాలంటే కాంట్రాక్టర్లు సహకరించాలని, పనులు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. వారం లోగా ప్రతిపాదనలు సమర్పించాలని, లేనియెడల టెండర్ అగ్రిమెంట్‌ను రద్దు చేసి కాంట్రాక్టర్లపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. అయితే, దీనిపై మెజార్టీ ఏజెన్సీలు సానుకూలత వ్యక్తం చేసినట్టుగా, ప్రతిపాదనలు సమర్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. గురువారం మరిన్ని ప్యాకేజీల పరిధిలోని ఏజెన్సీలతో సమావేశం కొనసాగే అవకాశం ఉంది.