డిపాజిట్.. దిగమింగారు | Deposit .. movements | Sakshi
Sakshi News home page

డిపాజిట్.. దిగమింగారు

Published Thu, Jul 17 2014 3:01 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

డిపాజిట్.. దిగమింగారు - Sakshi

డిపాజిట్.. దిగమింగారు

అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడిన అధికారులు చివరకు ఎన్నికల డిపాజిట్ సొమ్మునూ వదల్లేదు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చెల్లించిన కోటి రూపాయలకు పైగా డిపాజిట్ డబ్బులు దిగమింగారు. ఫలితాలు వెలువడిన నెలరోజుల్లోగా డిపాజిట్ తిరిగి చెల్లించాల్సి ఉన్నా నెలల తరబడి అభ్యర్థులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. చాలామంది అభ్యర్థులకు తాము చెల్లించిన మొత్తం తిరిగి వస్తుందనే అవగాహన లేకపోవడం స్వాహారాయుళ్లకు వరంగా మారింది.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని 1,329 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 13,566 వార్డు సభ్యుల పదవులకు గత యేడాది జూలై చివరి వారంలో ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా సుమారు 45వేలకు మంది అభ్యర్థులు పోటీ చేశారు.
 
 సర్పంచ్‌లుగా పోటీ చేసిన జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వేయి రూపాయల చొప్పున సుమారు రూ.60 లక్షలు డిపాజిట్  చెల్లించారు. వీరితో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేసిన జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున రూ.1.50 కోట్ల మేర డిపాజిట్‌గా చెల్లించారు. ఎన్నికల్లో డిపాజిట్ సాధించినా, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నా అభ్యర్థులకు డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు  సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు పోలైన ఓట్లలో ఎనిమిదో వంతు సాధిస్తే డిపాజిట్ దక్కుతుంది. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థులకు సంబంధించిన మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. డిపాజిట్ల చెల్లింపు, జప్తు ప్రక్రియ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నియమించిన రిటర్నింగ్ అధికారి లేదా ప్రత్యేక అధికారి ఈ ప్రక్రియను పర్యవేక్షించి ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలి. అయితే ఎన్నికలు జరిగి సుమారు యేడాది కావస్తున్నా అభ్యర్థులకు డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించలేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. జిల్లాలో 64 మండలాలకు గాను సుమారు 50 మండలాల్లో పంచాయతీ ఎన్నికల డిపాజిట్ సొమ్మును అధికారులే స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా.
 
 గోప్యత పాటిస్తున్న అధికారులు
 పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన కొందరు ఎంపీడీఓలు, ఈఓ పీఆర్‌డీలు డిపాజిట్ సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొందరు ఎంపీడీఓలు బదిలీపై వెళ్లగా, మరికొందరు మాత్రం తిరిగి చెల్లిస్తామని దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారు.
 
 డిపాజిట్ సొమ్ము తిరిగి వస్తుందనే విషయంపై చాలా మంది అభ్యర్థులకు అవగాహన లేకపోవడం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం, చాలా మంది తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన వారే కావడంతో డిపాజిట్ సొమ్ముపై అవగాహన లేకుండా పోయింది. మరికొన్ని చోట్ల కాళ్లరిగేలా డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించాలంటూ అభ్యర్థులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా దాటవేస్తున్నారనే పిర్యాదులు అందుతున్నాయి.
 
 సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా విజయం సాధించిన వారు ఒకవేళ డిపాజిట్ కోసం పట్టుబట్టినా ‘ఇనాం’ కింద తీసుకున్నామంటూ తిప్పి పంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు డిపాజిట్ సొమ్ము కోటిన్నర రూపాయల మేర అధికారుల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీకి ఏ రకమైన బకాయిలూ ఉండకూడదని ఎన్నికల సంఘం నిబంధన విధించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కుళాయి, ఇంటి పన్ను తదితరాలను గ్రామ పంచాయతీకి చెల్లించారు. అయితే పంచాయతీ అధికారులు ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు సమాచారం.
 
 ప్రత్యక్ష సాక్ష్యాలివే!
 అచ్చంపేట మండలంలో 20 గ్రామ పంచాయతీలకు 44 మంది, 196 వార్డులకు 395 మంది అభ్యర్థులు పోటీ చేశారు. డిపాజిట్ రూపంలో రూ.1.57లక్షలు చెల్లించగా ఏ ఒక్కరికీ ఇప్పటివరకు నయా పైసా తిరిగి చెల్లించలేదు.
 
   ఉప్పునుంతల మండలంలో 15 పంచాయతీలకు 35 మంది, 148 వార్డులకు 332మంది పోటీ చేశారు. వీరు డిపాజిట్ రూపంలో చెల్లించిన రూ.1.37లక్షలు అభ్యర్థులకు తిరి గివ్వకుండా అధికారులే భోంచేశారు.
 
  బాలానగర్ మండలంలో 31 పంచాయతీలు, వాటి పరిధిలోని వార్డులకు సంబంధించి అభ్యర్థులు రూ.3,39,250 డిపాజిట్‌గా చెల్లించారు. వీటిని అప్పటి ఎంపీడీఓ, ఈఓ పీఆర్‌డీ, కార్యాలయ సూపరింటెండెంట్ సొం తానికి వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ఉద్యోగ సంఘం నేత ఈ అంశంపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్, జెడ్పీ సీఈఓను ఆదేశించింది. దీంతో జూన్ మూడో తేదీలోపు డిపాజిట్ సొమ్ము తిరిగి ఇస్తానని అప్పటి ఎంపీడీఓ లిఖిత పూర్వకంగా ఇచ్చినా నేటికీ అభ్యర్థులకు మాత్రం డిపాజిట్ సొమ్ము తిరిగి దక్కలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement