రెండేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్యకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) మంజూరు చేసిన రూ. వెయ్యి కోట్ల రుణాన్ని ఏ విధంగా ఖర్చుచేయాలన్న దానిపై మత్స్యశాఖ పలు ప్రణాళికలు రూపొందించింది. ఈ రుణంతో 2017–18, 2018–19 సంవత్సరాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌చందా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రూ. వెయ్యి కోట్ల రుణంతో చేపట్టే కార్యక్రమాలతో 31 జిల్లాల్లోని 3.26 లక్షల మంది మత్స్య సహకార సంఘాల సభ్యులు లబ్దిపొందనున్నారు. 38 రకాల అంశాల్లో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
రెండేళ్లలో చేపట్టనున్న కార్యక్రమాలు...
♦ జిల్లా మత్స్యకారుల సంఘాలు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీపై చేప విత్తన కేంద్రాలను బలోపేతం చేస్తారు. నూతన చేప విత్తన కేంద్రాల నిర్మాణం, రిటైల్ చేపల మార్కెట్లు, హోల్‌సేల్ చేపల మార్కెట్ల నిర్మాణం చేపడతారు.
♦ చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వేసేందుకు వంద శాతం గ్రాంటు ఇస్తారు. ఈ చెరువులపై మత్స్య సహకార సంఘాల సభ్యులకు హక్కులు ఇస్తారు.
♦ 75 శాతం సబ్సిడీతో చేప విత్తన హ్యాచరీస్, చేప పిల్లల విత్తన అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కొత్త చేపల చెరువుల తవ్వకం, మొబైల్ షిప్ ఔట్‌లెట్ల ఏర్పాటు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తారు.
♦ మత్స్యకారులకు అవసరమైన వలలు, తూకం వేసే వస్తువులు, మోపెడ్లు, చేపల రవాణా ఆటోలు, ట్రక్కులకు ప్రస్తుతమున్న సబ్సిడీని 75 శాతానికి పెంచుతారు.
♦ నూతన పద్ధతుల్లో చేపల పెంపకం, చేప విత్తన కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే మత్స్యకార సంఘాల సభ్యులను ప్రోత్సహించేందుకు 90 శాతం సబ్సిడీపై నిధులు కేటాయిస్తారు.
♦ మత్స్య సహకార సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో రిజర్వాయర్లలో పది ఆక్వా టూరిజం కేంద్రాల ఏర్పాటుకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు.
♦ చేపల పెంపకంలో మెళకువలు నేర్పేలా మత్స్యసహకార సంఘాల సభ్యులకు వివిధ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారు.
♦ మత్స్యరంగ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటుకు రూ. 3.50 కోట్లు వంద శాతం గ్రాంటుపై కేటాయిస్తారు.
రూ.వెయ్యి కోట్లతో మత్స్య సంపద అభివృద్ధి
Published Wed, Jun 7 2017 3:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
Advertisement
Advertisement