సంగారెడ్డి క్రైం: తెలంగాణ జైళ్ల శాఖలో నిర్వహిస్తున్న సంస్కరణలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ బి.సైదయ్య తెలిపారు. సంగారెడ్డి పాత జిల్లా జైలు మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ విలేజ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాలూకా జైలు నుంచి సెంట్రల్ జైలు వరకూ సకల హంగులతో సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,800 మంది ఖైదీలు ఉండేవారని, క్రమంగా తగ్గుతూ 5,800కు చేరిందన్నారు. జైలు జీవితాన్ని శిక్షగా భావించకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం కల్పించడం, వృత్తి నైపుణ్య శిక్షణ అందించి ఆర్థిక వెసులుబాటు కల్పించేలా కార్యాచరణతో పని చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13 పెట్రోలు బంకులను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. ఖైదీల్లో పరివర్తన, సమాజం పట్ల బాధ్యతలపై అవగాహన కల్పించేలా ప్రొఫెసర్లు, మానసిక నిపుణులతో ‘ఉన్నతి’పేరుతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఐజీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment