Prison department
-
మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్
సాక్షి, చెన్నై: మదురై కేంద్ర కారాగారంలో రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు న్యాయవాది పుగలేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఖైదీలు సిద్ధం చేసిన వస్తువుల్ని ప్రభుత్వ ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు తరలించినట్టుగా గణాంకాల్లో జైళ్లశాఖపేర్కొని ఉన్నట్టు సమాచార హక్కు చట్టం మేరకు వివరాల్ని పుగలేంది సేకరించారు. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) ఈ లెక్కలు తప్పుల తడకగా ఉండడంతో కోర్టు తలుపు తట్టారు. మదురై కారాగారంలో 2016–2020 మార్చి వరకు రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు, జైళ్ల శాఖలోని కొందరి మాయా జాలంతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హోం శాఖ, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సూచించారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న గణాంకాలే అవినీతి జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని, తక్షణం కేసును ఏసీబీ విచారణకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సాధ్యమైనంతవరకు త్వరిగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. (చదవండి: అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!) -
మహారాష్ట్రలో జైళ్లు ఫుల్
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడం వల్ల జైళ్లన్నీ కిక్కిర్సిపోయాయి. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీల సంఖ్య తక్కువగా, కొత్తగా చేరే ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడక్కడ ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిని జైళ్లుగా మార్చి అందులో ఖైదీలను ఉంచాల్సిన పరిస్థితి రావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వివిధ రకాల జైళ్లున్నాయి. అందులో తొమ్మిది సెంట్రల్, 28 జిల్లా, 19 ఒపెన్ అదేవిధంగా మహిళలు, పిల్లల, ప్రత్యేక, ఇతర నాలుగు ఇలా మొత్తం 60 జైళ్లున్నాయి. ఇందులో 24,032 ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. కానీ, ప్రత్యక్షంగా అందులో వేలాది మంది ఖైదీలున్నారు. 2017–18లో 32,922 మంది ఖైదీలుండగా 2019 మార్చి ఆఖరు వరకు ఈ సంఖ్య 36,366కు చేరుకుందని జైళ్ల శాఖ నిర్వహించిన ఆడిట్లో తెలింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీలలో 27,264 ఖైదీలుండగా 9,008 మంది శిక్ష పడిన వారున్నారు. ఖైదీలలో 51 శాతం అత్యాచారం, హత్యలు చేసిన నేరస్తులున్నారు. ఇందులో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, అపహరణ–హత్య, మోక్కా చట్టం కింద అరెస్టు అయిన ఖైదీలున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్లలో మగ్గుతున్న ఖైదీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరిగింది. కరోనా వైరస్ తోటీ ఖైదీలకు సోకకుండా జైలు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న పెరోల్ సెలవులను వెంటనే మంజూరు చేయడం, పూచికత్తుపై తాత్కాలికంగా జామీను ఇచ్చి విడుదల చేయడం లాంటివి చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు వివిధ జైళ్ల నుంచి 10,710 మంది ఖైదీలు బయటకు వెళ్లారు. అయినప్పటికీ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఇంకా 28,319 ఖైదీలున్నారు. ఈ సంఖ్య కూడా సామర్థ్యానికి మించి ఉందని తెలుస్తోంది. కానీ, పెరోల్ సెలవులు, తాత్కాలిక జామీనుపై బయటకు వెళ్లిన వారు తిరిగి లోనికి వస్తే పరిస్థితి అçప్పుడు జైళ్లలో పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు. (దీపావళి తర్వాతే పాఠశాలలు ప్రారంభం) కరోనా విజృంభణ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైలులో శిక్ష అనుభవిస్తున్న రెండు వేల మందికిపైగా ఖైదీలకు కరోనా మహమ్మారి సోకినట్లు వెలుగులోకి వచ్చింది. అందులో 1,616 మంది బాధితులు కోలుకున్నారని జైలు అధికారులు తెలిపారు. అంతేగాకుండా ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులో ఉందని, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు అందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కాగా, పెద్ద సంఖ్యలో ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. దాదాపు అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. కచ్చా ఖైదీలను సకాలంలో విడుదల చేయకపోవడం, పెరోల్ మంజూరు చేయకపోవడం, కోర్టు పూచికత్తుపై విడుదల చేసినా డబ్బులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం తదితర కారణాల వల్ల ఖైదీలు జైలు నుంచి బయటపడలేకపోతున్నారు. ఫలితంగా జైళ్లన్ని ఖైదీలతో కిక్కిరిసి పోతున్నాయి. దీంతో జైళ్లలో సామాజిక దూరాన్ని పాటించడం అసంభవమని తెలుస్తోంది. కాగా, మే 31వ తేదీన మొదటి కరోనా కేసు నమోదైంది. దీంతో తేరుకున్న జైళ్ల పరిపాలన విభాగం మొత్తం 36 వేల మంది ఖైదీల్లో 14,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. అందులో ఇప్పటి వరకు 2,011 మందికి కరోనా సోకినట్లు కేసులు నమోదయ్యాయి. 1,616 మంది ఖైదీలు కోలుకోగా మిగతా ఖైదీలు జైళ్లలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (సుప్రీంకోర్టుకు అర్నాబ్ భార్య సమ్యాబ్రతా) -
నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ
సాక్షి, చెన్నై : తన గురించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. శిక్షా కాలం ముగిసిన అనంతరం చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం దాదాపు ఖాయమైంది. జరిమానా రూ.10 కోట్లు ముందుగా చెల్లించాల్సి ఉంది. అందుకే ఆమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బెంగళూరులో తిష్ట వేశారు. తన వివరాలను ఎవరుపడితే వారు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటుండడంతో చిన్నమ్మ ఆగ్రహం చెందినట్టు సమాచారం. తన వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని జైళ్ల శాఖకు ఆమె లేఖ రాశారు. విడుదల వ్యవహారం గురించి సమాచారం సేకరించిన వారు, మున్ముందు తన విడుదలకు అడ్డు తగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకోవచ్చని భావించి చిన్నమ్మ లేఖ రాసినట్టు అమ్మ శిబిరంలో చర్చ జరుగుతోంది. జైలులో లగ్జరీగా ఉన్నారన్న విషయం ఒకటి ప్రచారం అవుతున్న దృష్ట్యా దీన్ని బూతద్దంలో పెట్టే దిశగా సమాచారం సేకరించే వారు ఉండవచ్చనే ఆమె భావించినట్టు తెలిసింది. (అమ్మ శిబిరంలో కమలం పంచాయితీ!) చిన్నమ్మ సోదరుడికి వారెంట్ చిన్నమ్మ కుటుంబ సభ్యులు, బంధువుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నమ్మ సోదరుడు సుందరవదనన్‌కు తంజావూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. గతంలో తన ఆస్తులను కబ్జా చేశారని తంజావూరుకు చెందిన మనోహరన్ సతీమణి వలర్మతి ఫిర్యాదు చేశారు. దీంతో సుందర వదనన్, చిన్నమ్మ బంధువులు 10 మందిపై కేసులు నమోదయ్యాయి. కోర్టు విచారణకు వీరు డుమ్మా కొడుతున్నారు. అంతేగాక ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వీరిని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని తంజావూరు కోర్టు పీటీ వారెంట్‌ను జారీ చేసింది. -
సెల్లో 'సెల్లు'కు చెల్లు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో (సెల్) మొబైల్ (సెల్‌ఫోన్) వినియోగానికి శాశ్వతంగా తెరదించేలా జైళ్ల శాఖ యంత్రాంగం కృషి చేస్తోంది. కారాగారంలో ఉంటూ నేర సంబంధిత లావాదేవీల్ని ఖైదీలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారాలు మొబైల్ ఫోన్లలో నిర్వహిస్తున్నట్లు తేలింది. జైళ్లలో మొబైల్ ఫోన్ల అక్రమ వినియోగానికి తెరదించడం పరిష్కారంగా రాష్ట్ర కారాగార శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ముందుకు సాగుతున్నట్లు కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ సంతోష్ ఉపాధ్యాయ తెలిపారు. మొబైల్ ఫోన్లను కారాగారాల్లో నివారించేందుకు లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ ఆధ్వర్యంలో జైళ్లలో మొబైల్ ఫోన్ల చొరబాటు నివారణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 91 జైళ్లలో మొబైల్ లొకేటర్ల వ్యవస్థను ప్రవేశ పెడతామని తెలిపారు. 2019›– 20 ఆర్థిక సంవత్సరంలో 300 మొబైల్ ఫోన్ లొకేటర్లు కొనుగోలు చేస్తారు. తొలి విడత కింద రూ. 75 లక్షలు వెచ్చించి మొబైల్ లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. నేరాల నియంత్రణలో భారీ సంస్కరణ రాష్ట్రంలో నేరాల నియంత్రణలో మొబైల్ లొకేటర్ల ఏర్పాటు భారీ సంస్కరణగా జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. యావజ్జీవ కారాగారవాసం చేస్తున్న ఖైదీలు తమ అనుచరులతో బయటి ప్రపంచంలో నేర కార్యకలాపాల్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న నేర చరిత లావాదేవీలకు ఈ వ్యవస్థ తెర దించుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థ అమలును పురస్కరించుకుని జైలు సిబ్బంది, అధికారుల మొబైల్ ఫోన్లను కూడా జైళ్ల ప్రాంగణాలకు అనుమతించరు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ సంతోష్ ఉపాధ్యాయ్ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను ప్రధాన ప్రవేశ ద్వారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ కౌంటర్లో జమ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
‘ఈ నెల 14కి పది ఉరితాళ్లను సిద్ధం చేయండి'
పాట్నా: ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ అత్యాచార కేసుకు సంబంధించి దోషులకు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బిహార్‌లోని బక్సర్ జైలుకు ఉన్నతాధికారులనుంచి ఓ సందేశం వచ్చింది. డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశంలోని సారాంశం. ఉరితాళ్లను రూపొందించడంలో బక్సర్ జైలుకు ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంటుపై దాడులు చేసిన అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు. తాజాగా.. మరోసారి ఉరితాళ్లు పంపించాలని బక్సర్ జైలుకు జైళ్ల శాఖ డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు. చదవండి: 'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష' దీనిపై బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ.. డిసెంబర్ 14లోగా 10 ఉరితాళ్లను సిద్దం చేయాలని మాకు ఆదేశాలొచ్చాయి. ఇవి ఎక్కడ ఉపయోగించబోతున్నారో మాకు తెలియదు. బక్సర్ జైలుకి ఉరితాళ్లను సిద్ధం చేయడంలో మంచి అనుభవం ఉంది. ఒక్క ఉరితాడును సిద్ధం చేయడానికి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా వీటి తయారీకి యంత్రాలను తక్కువగా ఉపయోగించడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 2016-17లో కూడా పాటియాలా జైలు నుంచి మాకు ఉరితాళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. చివరిసారిగా బక్సర్ జైలు నుంచి పంపించిన ఉరితాడు ధర రూ.1,725అని అరోరా తెలిపారు. ఇనుము, ఇత్తడి ధరలలో తేడాల కారణంగా వీటి ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అరోరా తెలిపారు. ఈ లోహాలను తాడు మెడను గట్టిగా చుట్టి ఉండేలా చూసుకోవడానికి ఉపయోగిస్తారని జైలు సూపరింటెండెంట్ వివరించారు. చదవండి: ఆ పిటిషన్ నేను పెట్టుకోలేదు: నిర్భయ కేసు దోషి -
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..
సాక్షి, హైదరాబాద్ : ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డీజీ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపియన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు. జైళ్ల శాఖలో పనిచేసిన కాలంలో ఆనంద ఆశ్రయం ఏర్పాటు చేసి 15 వేల మంది బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. సర్వీస్‌లో బదిలీలు సాధారణం అని అన్నారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోవడంతో తాను రాజకీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. జైళ్ల శాఖలో అవినీతి చేయడంతోనే తనను బదిలీ చేశారనే ప్రచారం అవాస్తవం అని తెలిపారు. కావాలంటే తనపై విచారణ చేపట్టవచ్చన్నారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే అనేక ఆరోపణలు వస్తాయని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ శాఖలో నార్త్ ఆఫీసర్స్‌కు ప్రాముఖ్యత లేదనిది వాస్తవం కాదని.. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కాగా, చాలా కాలంగా జైళ్ల శాఖలో పనిచేస్తున్న వీకే సింగ్‌ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ జైళ్ల శాఖ దేశానికే ఆదర్శం
సంగారెడ్డి క్రైం: తెలంగాణ జైళ్ల శాఖలో నిర్వహిస్తున్న సంస్కరణలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ బి.సైదయ్య తెలిపారు. సంగారెడ్డి పాత జిల్లా జైలు మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ విలేజ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాలూకా జైలు నుంచి సెంట్రల్ జైలు వరకూ సకల హంగులతో సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,800 మంది ఖైదీలు ఉండేవారని, క్రమంగా తగ్గుతూ 5,800కు చేరిందన్నారు. జైలు జీవితాన్ని శిక్షగా భావించకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా నిరక్షరాస్యులకు అక్షర జ్ఞానం కల్పించడం, వృత్తి నైపుణ్య శిక్షణ అందించి ఆర్థిక వెసులుబాటు కల్పించేలా కార్యాచరణతో పని చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 13 పెట్రోలు బంకులను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. ఖైదీల్లో పరివర్తన, సమాజం పట్ల బాధ్యతలపై అవగాహన కల్పించేలా ప్రొఫెసర్లు, మానసిక నిపుణులతో ‘ఉన్నతి’పేరుతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఐజీ వివరించారు. -
మారడోనాతో మళ్లీ వస్తా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ఫైవ్ స్టార్ సౌకర్యాల జీవన శైలి కలిగిన నేను.. కటిక నేలపై నిద్రించా.. సాధారణ ఖైదీలకు అందించే రొట్టె, పప్పు మాత్రమే నాకూ అందించారు. దోమలు కుట్టినా, జైలు సిబ్బంది అందించిన కంబలి, ఖైదీలు వేసుకునే దుస్తులు సౌకర్య వంతంగానే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం వింత అనుభూతినిచ్చింది’ అని కేరళకు చెందిన వ్యాపార దిగ్గజం బాబీ చెమ్మనూరు తన ‘ఫీల్ ది జైల్’ అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. కేరళ త్రిసూరుకు చెందిన చెమ్మనూరు ఇంటర్నేషనల్ జ్యువెలర్స్ చైర్మన్ బాబీ చెమ్మనూరు సంగారెడ్డి ‘హెరిటేజ్ జైలు మ్యూజియం’ ఆవరణలో జైళ్ల శాఖ నిర్వహిస్తున్న ‘ఫీల్ ది జైల్’లో భాగంగా ఒక రోజు పాటు జైలులో గడిపారు. సోమవారం ముగ్గురు మిత్రులతో కలసి సంగారెడ్డి పాత జైలుకు వచ్చిన ఆయన రూ.500 చొప్పున నలుగురికి రూ.2 వేలు రుసుము చెల్లించారు. జైలు నిబంధనల మేరకు సాధారణ ఖైదీల తరహా లో చెమ్మనూరు బృందం ఒక రోజు జైలు జీవితాన్ని అనుభవించి మంగళవారం విడుదలయ్యారు. 24 గంటల పాటు తాను అనుభవించిన జైలు జీవితంపై ‘సాక్షి’తో మాట్లాడారు. తన వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మార డోనా త్వరలో కేరళ పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరోసారి వచ్చి సంగారెడ్డిలో ‘ఫీల్ ది జైల్’ను అనుభూతి చెందాలనుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా, గల్ఫ్, మలేసియా తదితర దేశాల్లో ‘జైలు టూరిజం’ను ప్రోత్సహించేలా ప్రచారం నిర్వహిస్తానన్నారు. సంగారెడ్డి జైలు మ్యూజియాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సహకారం అందిస్తానన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక చెమ్మనూరు తన మిత్ర బృందంతో కలసి సాధారణ వ్యక్తిలా ఆటోలో తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఫీల్ ది జైలుకు ఆదరణ పెరుగుతోందని జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్, జైలు అధికారులు వెంకటేశ్, గణేశ్ తెలిపారు. -
ఖైదీలకు క్షమాభిక్ష @356
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని నాలుగు గోడల మధ్య నుంచి ఎదురుచూస్తున్న ఖైదీల క్షమాభిక్ష అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సత్ప్రవర్తన కింద ఐదేళ్ల జైలు, రెండేళ్ల రిమిషన్ పూర్తిచేసుకున్న ఖైదీలను క్షమాభిక్షపై విడుదలకు శుక్రవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది నేతృత్వంలో సుదీర్ఘ భేటీ జరిగింది. భేటీలో జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్, ఐజీ నర్సింహా, న్యాయశాఖ కార్యదర్శి తదితరులు ఖైదీల విడుదల మార్గదర్శకాలపై తుది కసరత్తు చేసినట్లు తెలిసింది. అనంతరం మార్గదర్శకాలను సీఎస్ ఎస్పీ సింగ్‌కు పంపించినట్లు సమాచారం. మార్గదర్శకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే క్షమాభిక్ష జీవోను గణతంత్ర దినోత్సవం రోజు(జనవరి 26)న జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంశాఖ వర్గాలు లిపాయి. చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్లలో మొత్తం 356 మంది ఖైదీలు క్షమాభిక్ష జాబితాలో ఉన్నట్టు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త..
సాక్క్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి శివ శంకర్ 141 జీవోను విడుదల చేశారు. ఇందులో 15-డిప్యూటీ జైలర్ పోస్టులు, 2-అసిస్టెంట్ మాట్రాన్, 186- వార్డెన్(పురుషుల) పోస్టులు, 35-వార్డెన్(మహిళ) పోస్టులతో మొత్తం 238 పోస్టుల భర్తీ కై ప్రభుత్వం జీ.వో ను విడుదల చేసింది. ఆరు నెలల క్రితం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు నగేష్ యాదవ్, సైనిక్ సింగ్‌లు పారిపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జైళ్లశాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాకబు చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 300 పోస్టులకు గాను.. 238 పోస్టులను భర్తీ కోసం జీ.వో విడుదల చేసింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్‌గా రిక్రూట్ చేయనున్నారు. -
భిక్షం అడుక్కునేవారిలో 98 శాతం ఫేక్!
సాక్షి, హైదరాబాద్ : విశ్వనగరం ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్స్ ఫ్రీ సిటీ’గా చేయాలన్న అధికారుల ప్రయత్నాలు ఆశించిన మేర కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా గడిచిన కొద్ది రోజులుగా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద అడుక్కునేవారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్‌లో భిక్షాటన చేసేవారి సంఖ్య సుమారు 14 వేలు. అయితే వారిలో 98 శాతం మంది నకిలీలేనని, మాఫియాగా ఏర్పడి, యాచక ముఠాలుగా వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ‘యాచకులకు డబ్బు ఇవ్వకండి’ అంటూ పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన జీహెచ్ఎంసీ.. నిజంగా అభాగ్యులైనవారిని గుర్తించి, పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేసింది. అలా కొంతకాలంపాటు తగ్గిన యాచకుల సంఖ్య.. ఆశ్చర్యకరంగా మళ్లీ పెరుగుతోంది. దీనికి కారణం మాఫియా మాయాజాలమా? లేక అధికారుల నిర్లక్ష్యవైఖరా? వెల్లడికావాల్సిఉంది. యాచకుల వ్యవహారం ఇలా ఉంటే, మతిస్థి మితం కోల్పోయి, రోడ్లపై సంచరించేవారి కోసం తెలంగాణ జైళ్ల శాఖ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా వంతు సేవ : మతిస్థిమితం కోల్పోయి రోడ్డపై సంచరిస్తోన్నవారిని చేరదీసి, పునరావాసం కల్పించనున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వి.కె. సింగ్ తెలిపారు. శుక్రవారం చంచల్‌గూడ సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవలో తమ వంతుగా ఈ పని చేయబోతున్నట్లు చెప్పారు. పోలీస్, ఎన్జీవోస్, కార్పొరేట్ సంస్థలతో కలిసి ఆరు నెలల్లో రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వ్యక్తులను చేరదీసి పునరావాసం కల్పిస్తామన్నారు. శిక్షా కాలం పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగాలు : వివిధ కేసుల్లో ఖైదీలుగా శిక్షా కాలాన్ని పూర్తిచేసుకుని విడుదలైనవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ ప్రకటించింది. జైళ్ల పెట్రోల్ బంకుల్లో డిసెంబర్ నాటికి 500 మంది విడుదలైన ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సింగ్ వివరించారు. అందులో 50 శాతం మహిళలకే అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. -
జైళ్లల్లో అవినీతి లేదు: డీజీ వీకే సింగ్
మహబూబ్‌నగర్ క్రైమ్: రాష్ట్రంలోని జైళ్లలో అవినీతి ఏ మాత్రమూ లేదని, పూర్తిగా పారదర్శకంగా బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జైలుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వన్‌టౌన్ సమీపంలో ఖైదీలతో నిర్వహించనున్న పెట్రోల్ బంకును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇది ఐదవ పెట్రోల్ బంక్ అని తెలిపారు. ఖైదీల్లో మార్పు., వారిలో ఆత్మస్థయిర్యం నింపడం కోసమే ఈ పెట్రోల్‌బంక్ తెరిచినట్లు తెలిపారు. ఇందులో వారే వర్కర్లుగా ఉంటారని, రోజువారి వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
జైల్లో హలో..హలో
ఖైదీలకు ఫోన్ సౌకర్యం నెల్లూరు(క్రైమ్) : చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఉంటున్న ఖైదీలకు ఫోన్ సౌకర్యాన్ని జైళ్లశాఖ ఐజీ బి.సునీల్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీల్లో మానిసిక బాధను తగ్గించడంతో పాటు మానసిక పరివర్తన పెంపొందించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుందన్నారు. వొడాఫోన్ నెట్‌వర్క్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుని రెండు ల్యాండ్లైన్లను కారాగారంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఖైదీ నెలకు ఎనిమిదిసార్లు తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చన్నారు. ఖైదీలు తాము మాట్లాడే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోను నంబర్లను జైలు సిబ్బందికి అందించాలన్నారు. వారు ఆ నంబర్లను రిజిస్టర్ చేసుకుంటారన్నారు. ఖైదీలు మాట్లాడే ప్రతి మాటా ఆటోమెటిక్‌గా రికార్డు అవుతుందన్నారు. ఇప్పటికే చర్లపల్లి, చెంచల్‌గూడ, రాజమండ్రితో పాటు పలు కేంద్ర కారాగారాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ సౌకర్యం కల్పించడంపై ఖైదీలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కారాగారంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే ఆ శాఖ డీజీ కృష్ణంరాజు పర్యటన ఉన్న దృష్ట్యా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచిం చారు. ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ఆయన పాతజైలును సందర్శించారు. పాతజైలును త్వరలోనే సీకా (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్)గా మార్చనున్నారు. ఆంధ్రరాష్ట్రంలోని జైలుశాఖ అధికారులకు, సిబ్బందికి ఇకపై నెల్లూరులోని సికాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఆయన జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్‌తో మాట్లాడారు. ఐజీ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది.