సాక్షి, హైదరాబాద్ : విశ్వనగరం ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్స్ ఫ్రీ సిటీ’గా చేయాలన్న అధికారుల ప్రయత్నాలు ఆశించిన మేర కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా గడిచిన కొద్ది రోజులుగా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద అడుక్కునేవారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
హైదరాబాద్‌లో భిక్షాటన చేసేవారి సంఖ్య సుమారు 14 వేలు. అయితే వారిలో 98 శాతం మంది నకిలీలేనని, మాఫియాగా ఏర్పడి, యాచక ముఠాలుగా వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ‘యాచకులకు డబ్బు ఇవ్వకండి’ అంటూ పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన జీహెచ్‌ఎంసీ.. నిజంగా అభాగ్యులైనవారిని గుర్తించి, పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేసింది. అలా కొంతకాలంపాటు తగ్గిన యాచకుల సంఖ్య.. ఆశ్చర్యకరంగా మళ్లీ పెరుగుతోంది. దీనికి కారణం మాఫియా మాయాజాలమా? లేక అధికారుల నిర్లక్ష్యవైఖరా? వెల్లడికావాల్సిఉంది.
యాచకుల వ్యవహారం ఇలా ఉంటే, మతిస్థి మితం కోల్పోయి, రోడ్లపై సంచరించేవారి కోసం తెలంగాణ జైళ్ల శాఖ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మా వంతు సేవ : మతిస్థిమితం కోల్పోయి రోడ్డపై సంచరిస్తోన్నవారిని చేరదీసి, పునరావాసం కల్పించనున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వి.కె. సింగ్ తెలిపారు. శుక్రవారం చంచల్‌గూడ సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవలో తమ వంతుగా ఈ పని చేయబోతున్నట్లు చెప్పారు. పోలీస్, ఎన్జీవోస్, కార్పొరేట్ సంస్థలతో కలిసి ఆరు నెలల్లో రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వ్యక్తులను చేరదీసి పునరావాసం కల్పిస్తామన్నారు.
శిక్షా కాలం పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగాలు : వివిధ కేసుల్లో ఖైదీలుగా శిక్షా కాలాన్ని పూర్తిచేసుకుని విడుదలైనవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ ప్రకటించింది. జైళ్ల పెట్రోల్ బంకుల్లో డిసెంబర్ నాటికి 500 మంది విడుదలైన ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సింగ్ వివరించారు. అందులో 50 శాతం మహిళలకే అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.