పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుండి తీసుకున్న రుణాలతో పాక్ రోజులు నెట్టుకొస్తోంది. రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారింది. దేశంలోని నలుమూలల నుంచి నాలుగు లక్షలకు పైగా యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేర సంఘటనలు మరింతగా పెరిగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంపై పాక్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ ఒక నివేదికను అందజేసింది. దానిలో కరాచీ పోలీస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మాట్లాడుతూ, ఈద్, రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులు కరాచీకి వచ్చారని, వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చన్నారు.
ప్రస్తుతం కరాచీలో యాచకుల సంఖ్య పెరిగిందని, అలాగే నేరాల సంఖ్య కూడా పెరిగిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నగర అదనపు ఐజీ మాట్లాడుతూ పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment