మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? | The Discussion on the ministerial expansion in the TRS began | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?

Published Sat, May 25 2019 1:12 AM | Last Updated on Sat, May 25 2019 6:53 AM

The Discussion on the ministerial expansion in the TRS began - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవానికి ముందే విస్తరణ జరపాలని టీఆర్‌ఎస్‌ ఇన్నాళ్లూ భావించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పార్టీ ఆశించిన స్థాయిలో లభించని నేపథ్యంలో దీనిపై పునరాలోచించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను జూన్‌ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు టీఆర్‌ఎస్‌ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? సంస్థాగత ఎన్నికల తర్వాత జరుగుతుందా అనే చర్చ మొదలైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా ల్లో నిర్వహించే కార్యక్రమాల కోసం మంత్రివర్గ విస్తరణతోపాటు మిగిలిన ప్రభుత్వ పదవులను భర్తీ చేస్తారని ఆశావహులు భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ మదిలో ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. విస్తరణపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం వద్ద మాత్రం ఇప్పుడు ఎలాంటి చర్చ జరగడంలేదు. కొత్త రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాల ఆమోదం కోసం ఈ నెలాఖరులోగానీ లేదా జూన్‌ మొదటి వారంలోగానీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోపే విస్తరణ ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ కాకుండా 17 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌తోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించాల్సి ఉంది. త్వరలో జరపనున్న విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

మంత్రివర్గ విస్తరణ మాత్రమే ఉంటుం దా? ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో మార్పులు ఉంటాయా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు మం త్రుల సొంత సెగ్మెంట్లలో ప్రత్యర్థి పార్టీలకు ఆధిక్యం వచ్చింది. దేవాదాయశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌ సెగ్మెంట్‌లో బీజేపీకి 14,555 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్‌ రెండో స్థానం లో నిలిచింది. టీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. రవాణా మంత్రి ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గం సొంత సెగ్మెంట్‌ బాల్కొండలో బీజేపీకి 11,562 ఓట్ల మెజారిటీ వచ్చింది. పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (సికింద్రాబాద్‌) సొంత అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీకి 14,832 ఓట్ల మెజారిటీ దక్కింది.

ఎక్సైజ్‌ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లో బీజేపీకి 4,555 ఓట్ల మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో మంత్రులుగా ఉంటూ సొంత నియోజకవర్గాల్లో పట్టు దక్కించుకోలేని ఈ నలుగురి విషయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం పునరాలోచన చేసే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల్లో మరొకరికి కీలకమైన పదవులు ఇవ్వడమా లేదా వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించడమా అనే విషయంలో టీఆర్‌ఎస్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటే ఈ ప్రక్రియ  ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

మరో ఆరుగురు...
మంత్రివర్గ విస్తరణకు మాత్రమే పరిమితమైతే మరో ఆరుగురికి పదవులు దక్కనున్నాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఈసారి పదవి ఖాయం కానుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ మంత్రులుగా లేరు. టీఆర్‌ఎస్‌ కీలక నేత తన్నీరు హరీశ్‌రావుకు విస్తరణలో అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఎస్టీలు, మహిళలు మంత్రివర్గంలో లేరు. ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పట్లోళ్ల సబితారెడ్డిలలో ఒకరికి మంత్రిగా అవకాశం వస్తుందని తెలు స్తోంది. ఎస్సీ మాదిగ సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. ఈ కోటాలో సండ్ర వెంకట వీరయ్య, అరూరి రమేశ్‌లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తే ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement