వైద్యుల నిర్వాకం
- ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
- ఆస్పత్రిని సీజ్ చేసిన సబ్‌కలెక్టర్
- పాలమూరు జిల్లాలో ఘటన
నారాయణపేట: కాన్పు కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత్యువాత పడింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట మృత దేహంతో ధర్నా నిర్వహించారు. దాదాపు 9 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన మల్లమ్మ (26)ను కాన్పు కోసం ఈనెల 17న నారాయణ పేటలోని శ్రీ రాఘవేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించాలని వైద్యులు రాత్రి ఏడు గంటలకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసు కెళ్లారు. 8.10 గంటల సమయంలో బాబు జన్మించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అయితే, 4 గంటలైనా మల్లమ్మను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకురాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి డాక్టర్లను నిలదీశారు. దీంతో కొద్దిసేపటి తర్వాత ఆమెను బయటికి తీసుకువచ్చి బెడ్‌పై పడుకోబెట్టారు. మత్తు ఇంజక్షన్ కారణంగా ఆమె స్పృహలో లేదని చెప్పడంతో మిన్నకుండిపోయారు. ఇంతలోనే ఆపరేషన్ చేస్తుండగా రక్తస్రావం జరిగిందని, ఆమె పరిస్థితి బాగా లేదని వెంటనే మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు ఉచిత సలహా ఇచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. బాలింతకు పసిరికలు ఉన్నాయని అందుకే రక్తం నిలవడం లేదన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు.
వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మల్లమ్మ మార్గమధ్యలోనే కన్ను మూసింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. మృతదేహాన్ని నేరుగా నారాయణపేట రాఘవేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మల్లమ్మ మృతి చెందిందంటూ ఆరోపిం చారు. కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వైద్యం అందించిన వైద్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లమ్మ మృతిపై సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్య, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు స్పందించి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిని సీజ్ చేశారు.
కాన్పు కోసం వస్తే కాటికి పంపారు!
Published Thu, Apr 20 2017 2:19 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
Advertisement