![కేన్సర్ వస్తే భయపడొద్దు](/styles/webp/s3/article_images/2017/09/5/71486155484_625x300.jpg.webp?itok=miYJLKqF)
కేన్సర్ వస్తే భయపడొద్దు
- ధైర్యంగా ఎదుర్కోండి: సినీనటి మనీషా కొయిరాలా
- వ్యాధి తీవ్రతను పార్లమెంటులో ప్రస్తావిస్తా: ఎంపీ కవిత
- రోజూ కేన్సర్ బారిన 1700 మంది మృత్యువాత: సంగీతారెడ్డి
- హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వస్తే భయపడాల్సిన పనిలేదని.. దానికి సరైన చికిత్స ఉందని సినీనటి మనీషా కొయిరాలా చెప్పారు. ‘‘నాకు కేన్సర్ వచ్చినప్పుడు మొదట షాక్‌కు గురయ్యా. అనేక మంది భయపెట్టారు. అయితే నేను అనేక మంది వైద్యులను సంప్రదించా. ధైర్యంతో పోరాడి ఇప్పు డు క్యాన్సర్‌ను జయించా’’ అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’ అంతర్జాతీయ సద స్సులో ఆమె మాట్లాడారు. కేన్సర్ వస్తే ఓపిగ్గా దానిపై అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాత సరైన చికిత్స చేయించుకోవాలన్నారు.
2 వేల రోగులకు ఒకరే : కవిత
దేశంలో ప్రతీ 2 వేల మంది కేన్సర్ రోగులకు ఒక్క ఆంకాలజిస్టు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత అన్నారు. కేన్సర్‌తో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు చనిపోతున్నారని పేర్కొన్నారు. ‘‘కేన్సర్‌పై సమాచారాన్ని సేకరించి దాని తీవ్రతను పార్లమెంటులో ప్రస్తావిస్తా. కేన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు రోగితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఎంత వరకు సరైనదో ఆసుపత్రులే ఆలోచించాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతిరోజూ 1,700 మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని అపోలో ఆసుపత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి చెప్పారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ మెడికల్ టూరిజం అభివృద్ధికి కృషిచేస్తు న్నామన్నారు. ఈ సదస్సులో డాక్టర్ అఖిల ఎన్.విశ్వనాథన్, డాక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, డాక్టర్ ఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.